అంగ రంగ వైభవంగా రామచంద్రుడి పట్టాభిషేకం
భద్రాచలం పుణ్యక్షేత్రంలో నిర్వహించిన సీతారామ చంద్రస్వామి పట్టిభిషేకం కనుల పండువగా జరిగింది. ఈ పట్టాభిషేకం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, రోడ్లు, భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి శ్రీరాముడి పట్టాభిషేకాన్ని తిలకించారు. అంతకు ముందు నరసింహన్ రాములవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో ఆలయం మొత్తం తిరిగి చూశాడు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ భక్తులకుఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని, వారి మనోభావాలకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.
భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. భద్రాచలం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి త్వరలో చర్యలు తీసుకోనున్నట్లుతెలిపారు. జిల్లాలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్టును వైకుంఠరాముని ఆశీస్సులతో త్వరలో పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు, విస్తృత ప్రచారం కల్పించిన మీడియా ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలుతెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.