Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

అట్లాంటాలో మన కోసం వచ్చిన “పల్లకీ”

By   /  March 10, 2015  /  No Comments

    Print       Email
 
 
అట్లాంటా వాసులకు చిరపరిచితుడైన ఫణి డొక్కా తను రాసిన “పల్లకీ” అనే కథ ఆధారంగా “పల్లకీ” అనే లఘు చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో రూపొందించాడు. అట్లాంటాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ “పారామౌంట్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్”  అధినేత, ఎంతో కాలంగా తెలుగు సంస్కృతినీ, సాహిత్యాన్నీ ప్రోత్సహిస్తున్న సంస్థలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న శ్రీ.ప్రమోద్ సజ్జా గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పల్లకీ కథ సుమారు దశాబ్దం క్రితం రాసుకున్న కథ. బాపు, రమణలు, శ్రీ గొల్లపూడి మారుతిరావు గారు, తనికెళ్ళ భరణి గారు, ఎల్.బి.శ్రీరాం గారు వంటి ప్రముఖ రచయితల, దర్శకుల, నటుల మెప్పు పొందిన కథ పల్లకీ. ఏడేళ్ళక్రితమే ఈ కథ చదివిన వెంటనే భరణి గారు ఈ కథని లఘు చిత్రంగా తీయమని, దానిలో తాను తప్పక నటిస్తానని చెప్పి ఆశీర్వదించారు. ఆయన మాట చలవవలన నేటికి అది సినిమాగా ముస్తాబై మనముందుకొస్తోంది. ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు అడుగడుగునా సహకరించి, తమ విలువైన సూచనలను, సలహాలను అందజేసి, ప్రోత్సహించి ఈ సినిమా రూపొందడానికి సహాయపడ్డారు. 
 
కేవలం ఆరు రోజులలోనే షూటింగు పూర్తిచేసుకొన్న అరుదైన లఘు చిత్రం మన పల్లకీ. ఈ చిత్రంలో శ్రీ.ఎల్.బి.శ్రీరాం గారు ప్రధాన పాత్రధారులు. శ్రీ.గొల్లపూడి మారుతి రావుగారు, శ్రీ తనికెళ్ళ భరణి గారు కూడా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్, స్వాతిముత్యం, సిరివెన్నెల, సితార వంటి ఆణిముత్యాలను అందించిన శ్రీ.ఎం.వి రఘు గారు ఈ చిత్రానికి కెమేరామెన్ గా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ.మాధవపెద్ది సురేష్ గారు ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దర్శకుడు ఫణి డొక్కా రాసిన పాటలోని సాహిత్యాన్ని మెచ్చుకుని, శ్రీ మాధవపెద్ది సురేష్ గారి వీనులవిందైన బాణీకి ముగ్ధుడైన గాన గంధర్వుడు శ్రీ.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారు తన అద్భుతమైన గాత్రంతో ఆ పాటని అజరామరం చేసారు. ఈ టైటిల్ సాంగ్ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.   
 
తెలుగు సంస్కృతిని నిలబెడుతూ, తెలుగు వాతావరణాన్ని ప్రతి ఫ్రేములోనూ చూపిస్తూ, ఆద్యంతం ఆసక్తిగా సాగే కథనంతో రూపొందిన చిత్రం “పల్లకీ”. పూర్తిగా అవుట్ డోర్ లో, పచ్చని పల్లెటూరిలో, పొలాలు, కొబ్బరి తోటల నడుమ ప్రకృతి ఒడిలో రూపొందించబడి, సర్వాంగ సుందరంగా, ఒక దృశ్యకావ్యంగా రూపొందిన ఈ పల్లకీ లఘు చిత్రం నిడివి 40 నిమిషాలు. తరాల మధ్య అంతరాలనీ, మారిపోతున్న విలువలనీ, శాశ్వతంగా నిలిచే స్నేహాన్నీ ప్రతిబింబిస్తూ, మనదైన సంస్కృతిపట్ల గౌరవాన్నీ, విశ్వాసాన్నీ కనబరుస్తూ  సాగే చక్కటి చిత్రం పల్లకీ. దర్శకుడు ఈ చిత్రాన్ని బాపు రమణలకు అంకితమిచ్చాడు. 
 
2015 మార్చి 14, 15 తారీఖులలో అట్లాంటాలోని కార్ మైక్ థియేటర్ (415 Atlanta Road Cumming GA 30040 – Theater #8 ) లో, ఈ పల్లకీ సినిమా ప్రదర్శిస్తున్నారు. మార్చి 14 శనివారం నాడు మధ్యాహ్నం 2:15 నిముషాలకు, మరల 3:15 నిముషాలకు, తిరిగి మార్చి 15 ఆదివారం నాడు మధాహ్నం 2:15 నిముషాలకు ప్రదర్శనలు వుంటాయి.  థియేటర్ లో ప్రతి పదర్శన కేవలం 120 మంది చూసే అవకాశం వున్నది. కాబట్టి ఈ సినిమా చూడదలుచుకున్నవారు నిర్ణీత సమయానికి కనీసం 30 నిముషాల ముందుగానే థియేటర్ చేరుకోవలసినదిగా దర్శకుని విజ్ఞప్తి. 
 
ఒక వేళ ఆదివారం తరువాత కూడా ఇంకా చాలా మంది ఈ చిత్రాన్ని చూడాలనుకొంటే, వారికోసం మళ్ళీ మరొక వారం పది రోజులలో, తిరిగి ఒకటి రెండు షోలు వేసే ప్రయత్నం కూడా చేస్తామని దర్శకుని హామీ.  అట్లాంటాలోని తెలుగువారంతా వచ్చి ఈ సినిమాని చూసి తమ విలువైన అభిప్రాయాలనూ, స్పందననూ తెలియజేయమని దర్శకుడు ఫణి సవినయంగా మనవిచేస్తున్నాడు, సాదరంగా ఆహ్వానిస్తున్నాడు.
 
ఈ చిత్రం చివరిలో మీ మనసులు కదిలినా, కళ్ళు చెమర్చినా మా పూచీ లేదు. 
Best Regards,
Phani Dokka
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →