Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

అద్భుత జానపద చిత్రరాజం ‘జగదేకవీరుని కథ’

By   /  July 10, 2016  /  No Comments

    Print       Email

13669111_1462300163795378_7028390152038929366_nభారతీయ చలనచిత్ర రంగం సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించే అతి పెద్ద పరిశ్రమ. వాణిజ్యపరంగా అత్యధికంగా చిత్రాలను నిర్మించి తెలుగు చిత్రసీమ వర్థిల్లుతోంది. ఎన్నో మంచి చిత్రాలను అందించింది మన తెలుగు చిత్రపరిశ్రమ. సామాజిక కోణంలో సమాజానికి ఉపయోగపడేలా, అలాగే ఊహాతీత మైన చిత్రాలనూ, ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి ఆనాడు ప్రేక్షకులను అలరించింది. నేటికీ అలరిస్తూనే ఉన్నాయి ఆనాటి చిత్రాలు. వాటిలో విజయావారి చిత్రం ‘ జగదేక వీరుని కథ’ ఒక చక్కని చిత్రం.
Jakadekaveera1961 ఆగస్టులో విడుదలై రికార్డులను సృష్టించింది.
ఈ చిత్రంలో వినోదం ఉంటుంది. సాహసం.. అంతకు మించి వ్యక్తిత్వ వికాసం ఉంటుందీ చిత్రంలో. ఒక మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు అనే విషయాన్ని ఈ సినిమా చెప్తుంది. అందుకే దాదాపుగా 55 ఏళ్ల క్రితం సినిమా అయినా వెలుగులు మసక బారకుండా ఈ నాటికీ కొత్తగా హాయిగా ఉంటుందీ చిత్రం. ఓ యువరాజు తనకు వచ్చిన కలను సాకారం చేసుకోవడానికి ఎన్నో సాహసాలను చేసి తను కన్న కలను నిజం చేసుకుంటాడు. అందుకే అతను జగదేక వీరుడయ్యాడు. ఈ కథను తమిళంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జగదల ప్రతాపన్’అనే చిత్రం తాలూకు కథను పింగళి నాగేంద్ర తీసుకున్నారు. ఆ కథకి తెలుగు వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేశారు.
ఉదయగిరి రాజ్యానికి యువరాజు ప్రతాప్ (ఎన్‌టి రామారావు). ఒక రోజు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో నలుగురు కన్యలను వివాహమాడాలని కోరిక కలుగుతుంది. అయితే అతను కన్న కలలోకి వచ్చిన అమ్మాయిలు మామూలు కన్యలు కాదు. ఒకరు దేవేంద్ర కుమార్తె జయంతి(బి.సరోజాదేవి), మరొకరు నాగేంద్రుని కూతురు నాగిని (ఎల్. విజయలక్ష్మి), అగ్ని దేవుని కూతురు మరీచిక (జయంతి), వరుణదేవుని కూతురు వారుణి(బాల). ఇవీ వారి పేర్లు. ప్రతాప్ పుట్టిన రోజు నాడు తండ్రి మీ కోరికలు ఏమిటని తన ఇద్దరి కుమారులను అడుగుతాడు. యువరాజు ప్రతాప్ తనకు వచ్చిన కల గురించి చెప్పి చలువరాతి మేడలో తూగుటుయ్యాలమీద నలుగురు రాకుమారీలు తనకు సేవలు చేస్తుండగా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఉందంటాడు. అందుకు తన కలను నెరవేర్చుకోవాలని ఉందంటాడు. ప్రతాప్ కలను విన్న తండ్రి ఉదయగిరి మహారాజు ఈ కల సాధ్యమా అని మండిపడుతూ కొడుకు ప్రతాప్‌ను దేశం విడిచి పొమ్మంటాడు. అలా దేశ బహిష్కరణకు గురైన రాకుమారుడు ప్రతాప్ తన కలను నెరవేర్చుకునేందుకు దేశం నుండి బయలుదేరుతాడు. ఇలా తన ప్రయాణంలో దేవేంద్ర కూతురు జయంతిని ఒక కొలనుదగ్గర చూసి ఆమె చీరను తస్కరిస్తాడు ప్రతాప్. ఆ చీర లేకుంటే తనకు దేవలోక ప్రవేశం లేదని ప్రతాప్ వెంటపడుతుంది జయంతి. అది ఆమెకు ఒక ముని శాపం. తన చీరను దొంగిలించిన వాడినే పెళ్లాడితేనే దేవలోక ప్రాప్తి అని శపిస్తాడు ఆ ముని. ఆ చీరను ఎలాగైనా పొందాలని, ప్రతాప్ తన చీర ఎక్కడ దాచాడో తెలియక అతనిని వివాహ మాడుతుంది. తరువాత భార్యతో సహా కామకూట రాజ్యంలోకి అడుగు పెడతాడు ప్రతాప్. ఆ దేశపురాజు(రాజనాల) జయంతి అందం చూసి ఎలాగైనా తన అంతఃపురానికి రప్పించి ఆమెను పొందాలని అనుకుని ప్రతాప్, జయంతిని తన అంతఃపురానికి రప్పిస్తాడు. తనను బాధిస్తోన్న రాచపుండు తగ్గడానికి ఔషథం కావాలని అది దేవలోకాన ఉంటుందని చెప్పగా తాను తెస్తానని జయంతి ఇచ్చిన మంతం సహాయంతో దేవలోకానికి వెళ్తాడు ప్రతాప్. ఔషథం తెస్తాడు. ఔషథంతోపాటు నాగకన్యను పెళ్లాడి తీసుకొస్తాడు. ఇలా ఈ రాజు మూలంగా మిగతా ఇద్దరి కన్యలను కూడా తీసుకొస్తాడు ప్రతాప్. ఇంతలో తన తండ్రికి కళ్లు పోయాయని, తన ఉదయగిరి రాజ్యం అన్యా క్రాంతమై పోయిందని తెలుసుకుని తన నలుగురు భార్యలతో కలిసి రాజ్యానికి వస్తాడు. అక్కడ తన రాజ్యరక్షణ కోసం యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది ప్రతాప్‌కు. వెళ్తూ జయంతి చీరను తల్లికి ఇచ్చి దాచమని చెప్పి వెళ్తాడు. ప్రతాప్ వెళ్లగానే అత్తగారిని మంచి చేసుకుని నలుగురు కోడళ్లు కలిసి ఆమె దగ్గర దాచిన చీరను అడిగి తీసుకోగానే జయంతికి శాపవిమోచనం అయిపోతుంది. దీంతో దేవలోకానికి వెళ్ల్లి పోతారు. వెళ్లిపోయాక దేవకన్యలకు తమ భర్తమీద ప్రేమను చంపుకోలేక దేవేంద్రునికి మొర పెట్టుకుంటారు. అయితే దేవేంద్రుడు ఒక పరీక్ష పెడతానని, అందులో నెగ్గితే తప్పకుండా మిమ్మల్ని పంపుతానని అంటాడు. చివరగా దేవేంద్రుడు పెట్టిన పరీక్షలో నెగ్గి వారి నలుగురితో తన రాజ్యానికి వచ్చి సుఖంగా రాజ్యపాలన చేస్తాడు.
ఇదీ కథ..
ఈ కథను రచించింది పింగళినాగేంద్రరావు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కెవి రెడ్డి, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు.
ఇలా హేమాహేమీల చేతితో మలిచిన కథను కెమెరా మాంత్రి కుడు
మార్కస్ బార్‌ట్లేకు అందించారు. ఇక సెట్లు వేయడానికి గోఖలే, కళాధర్‌లకు బాధ్యతలు అప్పగించారు.
‘ జగదేకవీరుని కథ’ చిత్రం గురించి చెప్పగానే ముందుగా మనకు గుర్తుకువచ్చే పాట ‘శివశంకరీ.. శివానందలహరి’ అనేపాట.
ఈ పాటను పింగళి నాగేంద్ర రాయగా పెండ్యాల స్వరపరిచారు. ఇక పాడింది అమర గాయకుడు ఘంటసాల. దర్శకుడు కేవి రెడ్డిల సమష్టి కృషితో వచ్చి ఈ నాటికీ ఒక గొప్పపాటగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. సన్నివేశం కూడా హీరో తన అమృత గానంతో గండ శిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట ఇది.
ఈరోజు మనం హాలీవుడ్ చిత్రాల గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. అవతార్, జంగిల్ బుక్ ఇవన్నీ హాలీవుడ్ అద్భుతం అంటారు.
నిజానికి యాభై ఐదేళ్ల క్రితం గ్రాఫిక్స్ అనే పదమే పుట్ట లేదు. ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఐదుగురు ఎన్టీఆర్‌లను ఒకే వేదికపై వివిధ హావభావాలతో తీయడం నిజంగా మన తెలుగు పరిశ్రమ గొప్పదనం.
ఇది నిజంగా కెవి రెడ్డి, మార్కస్‌బార్‌ట్లేల గొప్పతనం కూ డా. అద్భుతమైన ఈ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో ఎన్టీఆర్ చక్కని హావభా వాలతో అందర్నీ మంత్రము గ్థులను చేశారు. వెండి తెరపై ఈ పాటకు,  ఎన్టీఆర్ అభిన యానికి ప్రేక్షకులు ఆనాడు బ్రహ్మరథం పట్టారు.
‘జలకా లాటలలో.. కలకల పాటలలో.. ఏమి హాయిలే హలా..’ అంటూ
భూ లోకానికి వచ్చి దేవకన్యలు పాడే పాట ఇది. పాటకు ముందు ఇంద్రకన్య జయంతి భూలోకానికి వచ్చి తన స్నేహితురాళ్లను పిలుస్తూ
‘హలా నాగినీ… హలా వరుణీ.. హలా మరీచీ..’ అంటూ పిలుస్తుంది.
మనం ‘హలో’ అనే పదాన్ని కెవి రెడ్డి మార్చి ఇలా ‘హలా’ అని పదప్రయోగం చేయడం వింటానికి చాలా బాగుంటుంది. అలాగే బి.సరోజాదేవి ముద్దు ముద్దుగా మాట్లాడే మాటలు కూడా వినడానికి చాలా హాయిగా ఉంటాయి. ఈ పాటను జనవరిలో తీసారుట ఉదయాన్నే చలిగా ఉంటుందని ఆ కొలను నిండా వెచ్చటి నీళ్లను పోయించి ఆ పాటను షూట్ చేశారని సినీ పెద్దలు కెవి రెడ్డి గురించి చెప్తూ అంటారు. అందుకే ఆ పాటలో ఏమి హాయిలే హలా.. అంటూ హాయిగానే దేవకన్యలు జలకాలాడుతారు. అప్పట్లో ఆరులక్షలు ఖర్చయ్యిందట. ఈనాడు లెక్క కడితే.. ఖర్చు కోట్ల రూపాయల్లోనే.

 

InCorpTaxAct
Suvidha

 

 

Author:

Vinjamuri Venkata Apparao

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →