“యస్తు విజ్ఞాన్ వాన్ భవతి సమనస్కః సదా శుచిః
సతు తత్ పదమాప్నోతి యస్మాద్ భూయో న జాయతే||”
అనగా ఎవరు విజ్ఞానవంతుడో, మనస్సును అదుపుచేయగలడో, పావనుడుగానుండునో అతడు ఎచ్చటకు వెళితే మరుజన్మను పొందడో అట్టి భగవత్ స్థితిని పొందును. కనుక మనోనిగ్రహము కలిగి పవిత్రుడుగా నున్న విజ్ఞానవంతుడు ముక్తిని సాధించకలుగు చున్నాడు. అతడు గ్రహించిన బ్రహ్మ విద్యయే అతడిని మోక్ష గామిని చేయుచున్నది.
పురాకృత ఫలముగా లభించిన ఈ శరీరము ఆత్మరూపముగా లభించినదని భావించి ఈ ఉపాధి అశాశ్వతము, సాధ్యమని గ్రహించి ఇదే శాశ్వతమని దీనియందు అభిమానమును విడనాడి ‘అహం బ్రహ్మిస్మి ‘ అనగా నేను బ్రహ్మమును భావన గల్గి ఆ పరబ్రహ్మ పరమాత్మ అంశరూపములో నున్న ఆత్మను గుర్తించి ఆ అనుభూతి పొందిన కలుగు ఆనందము దేనికి సరిరాదు. ఇది అనుభవైక వేద్యము. వాక్కునకు అందనిది, నిర్మలమైనది, జ్ఞానదృష్టికి మాత్రము గోచరమగునది , శుద్ధమైనది శాశ్వతమైనది, జనన మరణముల కతీతమైనది, అవినాశియగు బ్రహ్మ పదార్ధమను ఏది యున్నదో అదే ” ‘అహం బ్రహ్మాస్మి ‘ అనే భావనతో అనుభూతినొంది బ్రహ్మానందమును అనుభూతి లోనికి తెచ్చుకొనవలయును. ఆ పరబ్రహ్మము నీవే యనే భావన చేయవలయును.
ఈ శరీరము సర్వము అనుభవించుచున్నను, కించిత్ అయినా ఆ అనుభవమును అనిభవింపనిది ఆత్మ. అది సాక్షి మాత్రముగానే ఈ ఉపాధి యందుండును. అదియే పరబ్రహ్మ పరమాత్మ యొక అంశయని గ్రహించాలి. ఈ బ్రహ్మమనేది సత్యము. జ్ఞానస్వరూపమైనది మీది మిక్కిలి అనంతమైనది. మరియు అది నిత్యము, శుద్ధము మరియు ఆనంద స్వరూపముగానే భావించాలి. ఈ జగత్తంతమయు అట్టి బ్రహ్మస్వరూపమే. ఇందులో ఎటువంటి సందేహములేదు.
నేనే పరబ్రహ్మమును ‘అహం బ్రహ్మాస్మి ‘ అనే భావనతో వాసనలన్నింటిని నిరోధించి జీవత్వమునకు సంబంధించిన అన్ని విషయములను దూరము చేసి మనస్సును ఏకాగ్రతతో లగ్నము చేసి, ఆత్మనిష్ఠాపరుడై ఆత్మానందమును అనుభవించు సాధన చేసిన వానికి ఇక ఇహలోకముతో సంబంధముండదు.అప్పుడిక ప్రారబ్ధము అంతమయ్యేవరకు శరీరము పోషింపబడుతుంది. అన్నింటికి మూలము అయిన అహంకారమును తప్పనిసరిగా పరిత్యజించవలయును.అహంకరాము వీడిన తోడనే సంసార బంధనము అన్నియు పటాపంచలమగును.అప్పుడు ఆత్మ తత్త్వమును సులభ స్రాహ్యమగును. కర్మ ఫలముల నాశించని దానికి ఆలోచన లుండవు. చిత్త ఏకాగ్రత సమకూరును. అప్పుడు వాసనలు క్షీనించిపోవును.ఈ వాసనలు నిశ్శేషమైతే మోక్షమునకు మార్గమేర్పడును. అప్పుడతడు. జీవన్ముక్తుడుగానే పరిగణించబడతాడు.
పరబ్రహ్మము ఆత్మయును ఒకటేయను భావన ద్వారానే దానిని అనుభూతిలోనికి తెచ్చుకొను సాధన ద్వారా మాత్రమే మోక్షమార్గమును తెలుసుకొనవచ్చును. అంతియే గాని శాస్త్రముల ద్వారా నేర్చుకొన్న పాండిత్య బలము వాక్చాతుర్య ఉపన్యాసముల ద్వారా మోక్షము సాధ్యము కాదు. శాస్త్రాధ్యాయనము ఆచరణ యోగ్యము చేసి సాధనా బలముతో మాత్రమే పరతత్త్వమును అవగాహన చేసుకొనవచ్చును. అవిద్యను దూరము చేసిన కాని బ్రహ్మజ్ఞాన వెలుగును కాంక్షించలేము. ఇటువంటి వెలుగును ప్రసాదించుటకు సమర్ధవంతుడగు గురువు ఆవశ్యకత ఎంతైనను గలదు. గురువు చెప్పిన విషయములను శ్రవణము చేసిన తర్వాత మననము నిధి ధ్యాసనములు మొదలైన పరిక్రియల ద్వారా మాత్రమే అసలైన జ్ఞాన ఫలితము ఆవిష్కరింపబడును. తదుపరి ఎల్లప్పుడును ఆత్మ తత్త్వ ధ్యానమును కొనసాగించవలయును. అప్పుడే ఆత్మానాత్మ వివేకము తెలియును. తత్ఫలితముగా సమస్త ఇహలోక మోహములు దూరమగును. అజ్ఞాన జనిత భావనల వలననే జనన మరణ విషవలయమును మానవుడు చిక్కుకొనుచున్నాడు. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలుగునో అప్పుడే పరమాత్మ జ్ఞానముద్భవించును. ఈ జ్ఞాన కారణముగానే భవబందనములను ఛేదించుకొని ముక్తి మార్గమును గ్రహించకలుగును. ఈ జ్ఞానము కారణముగానే తాను సచ్చిదానంద స్వరూపడుననే అనుభూతి కలుగును. ఈ శరీరము జననమునకు ముందుగా లేదు. మరణానంతరము ఉండదు. అట్టి నశ్వరమగు శరీరము నందు ఆత్మ విరాజమానమై యున్నది. శరీరముతో సంబంధము లేకుండా సకల కార్యకలాపములకు సాక్షిమాత్రముగా నున్న ఈ ఆత్మ మాత్రము నిత్యము మరియు సత్యము. అదియును గాక జనన మరణములకు లోను కానిది శాశ్వతమైనది. ఈ శాశ్వతమైన ఆత్మ అశాశ్వతమైన శరీరము నందుండిన పరమాత్మ యొక్క అంశగానే భావించవలయును. ఈ దేహము నేను అనే అహంకార బుద్ధి వీడినంతకాలము మోక్షము సాధ్యము కాదు.
ఎవరైతే మాయకు లోబడి భ్రాంతిలో ఊహాలోకములో అనేక కల్పిత మధుర భావనలతో తేలియాడుతూ ఉంటారో అవి మానసికముగా అసత్యములని తెలిసియు వాటియందు విహరించు అవిద్య ఎందుకూ కొరగానిది. ఈ అవిద్యను, ఈభ్రాంతిని, ఈ మాయను జయించి నిజప్రపంచము లోనికి వచ్చిన వానికి తానెక్కడున్నది తెలియును. కాని కల్పిత భ్రాంతికి లోనయిన వానికి బ్రహ్మ విద్యా ప్రాప్తి దుర్లభము. కలగనిన వానికి మెలుకవ రాగానే అది ఎంతటి సత్య దూరమో తెలియును. అటులనే అవిద్య దూరమై జ్ఞానోదయము అయిన సాధకునికి తానున్న స్థితి అవగాహనమగును. మోక్షమును అపేక్షించు సాధకుడు ఆత్మతత్త్వ జ్ఞానమును తప్పనిసరిగా సంప్రాప్తింప జేసుకొనవలయును అట్టి ఉద్దేశ్యము జ్ఞానోదయ కారణముగా కల్గిననాడు సంసార బంధముల నుండి విడివడ వలయును.
ఎవరో ఒక వివేకవంతుడు మాత్రము అంతరంగములోని ఆత్మను చూడగల్గుచున్నాడని కఠోపనిషత్తు చెబుతున్నది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.