ఆ నలుగురు వెళ్తే ఏమవుతుంది?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ను ఇరుకున పెడుతున్నామని సంబర పడుతున్న కాంగ్రెస్ కు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరి గట్టి షాక్‌ను ఇచ్చాడు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వలసల భయం పట్టుకుంది. నివారణ చర్యలు చేపట్టేందుకు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. జానారెడ్డి పైకి ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన తమకు ఏమీ కాదని, ఇలాంటి వంద మందిని కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుందని బయటకు గంభీరంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం భయపడుతున్నారనేది వాస్తవం.
వాళ్ల భయానికి అదే కారణం..
తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్‌కు ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటుందా.. ఊడుతుందా అనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరిన చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు మరో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లితే ప్రతిపక్ష హోదా పోతుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు మదన పడిపోతున్నారు. ఎలాగైనా ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో టీఆర్ ఎస్‌లోకి వెళ్తారని పుకార్లు వస్తున్న ఎమ్మెల్యేల ఇంటికి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి లాంటి స్వయంగా వెళ్లి మాట్లాడుతున్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో కూడా మాట్లాడిస్తూ వాళ్లకు కొన్ని హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఆకర్ష్‌కు ఆకర్షితులవుతారో లేదో తెలుసుకోవాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.