Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News  >  Current Article

ఈశ్వరుడు నాకంటె భిన్నముగా లేడు

By   /  April 27, 2015  /  No Comments

    Print       Email

సృష్టి ఏదైనా దానికి రెండు కారణములు ఉంటాయి. ఒకటి నిమిత్త కారణము. ఆ వస్తువును సృష్టించుటకు కావలసిన విజ్ఞానము మరియు నైపుణ్యము గల పురుషుడు నిమిత్త కారణము. రెండవది ఉపాదాన కారణము. ఆ వస్తువును తయారు చేయుటకు కావలసిన ముడిసరుకు ఉపాదాన కారణము. భగవానుడు అర్జునునకు ఇట్లు బోధించినాడు: ఈ జగత్తు దేని నుండి ఉద్భవించినదో ఆ పరబ్రహ్మను నేనే. నేనే ఈ జగత్తును పోషించి పాలించుచున్నాను, ఈ జగత్తు నాయందే విలీనమగును.

ఈ బోధను బట్టి భగవానుడు జగత్తునకు నిమిత్త కారణము మాత్రమే గాక, ఉపాదాన కారణము కూడ భగవానుడేనని మనకు స్పష్టమగుచున్నది. ఏలయన, ఒక వస్తువు దేని జీవితకాలము పూర్తి అయిన పిదప విలీనమయ్యేది ఉపాదాన కారణమే గాని, నిమిత్త కారణము కాదు. కుండ విలీనమయ్యేది మట్టిలో కాని, కుమ్మరివానిలో కాదు. కావుననే, భగవానుడిత్లు చెప్పుచున్నాడు: ఈ సృష్టిలో నాకంటె భిన్నముగా గాని, అతీతముగా గాని ఏది లేదు. ఏ వస్తువు అయిననూ, నాకంటె భిన్నముగా మనజాలదు. ఏలయన, దేశకాలరూపమగు ఈ అవిచ్ఛిన్న ప్రవాహమునకు, దానిలోని ప్రతి పదార్థమునకు కారణము నేనే.

InCorpTaxAct
Suvidha

వాస్తవములో మానవుడు సృష్టించినది ఏదీ లేదు, మనము కేవలము ఉన్నవాటిని పునర్వ్యవస్థీకరిస్తూ ఉంటాము. భగవానుడు సృష్టించి పెట్టినవాటిని పలువిధములుగా మనము కలుపుతూ ఉంటాము. భగవంతుడు మన అవసరములనన్నింటినీ సమకూర్చియే యున్నాడు. ఈ సత్యమును గుర్తించినప్పుడు మనము భగవానునకు కృతజ్ఞతను ప్రకటించ గోరుట సహజము. కాని, మనము ఏ భగవానునకు కృతజ్ఞతలను ప్రకటించ గోరుచున్నామో. ఆయన మన అవగాహనకు అతీతుడుగానున్నాడు. భగవానుని స్వరూపము సరిగా తెలియని సందర్భములో భక్తులు ఈ క్రింది శ్లోకమును ప్రార్థనగా వినియోగిస్తారు:

తవ తత్త్వం న జానామి కీదృశో2సి మహేశ్వర|
యాదృశో2సి మహాదేవ తాదృశాయ నమో నమః||

ఓ మహాదేవా! నీ స్వరూపము నాకు తెలియదు నీవు ఎల్లా ఉంటావో కూడ నాకు తెలియదు. ఓ మహేశ్వరా! నీవు ఎట్టివాడవో, అట్టి నీకు పలుమార్లు నమస్కరించుచున్నాను.

నిజం చెప్పాలంటే, ఇది చాల ఉపయోగకరమైన ప్రార్థన. భగవానుని స్వరూపము విషయములో గాని, ఆయన నివాసస్థానము విషయములో గాని మన అవగాహన తప్పే అయినప్పటికీ, ఈ ప్రార్థన ఎవరికొరకు ఉద్దేశించబడినదో వారిని చేరి తీరును.

ఈ జగత్తునకు ఉపాదాన కారణము భగవానుడేనని సరిగా తెలుసుకున్న వ్యక్తి భగవానుని వెదుకుతూ ఎక్కడికైననూ వెళ్లవలసిన పని లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి భగవానుడే. ఈ జగత్తులోని సర్వము భగవానుడే. మన స్థూలదేహములు, జ్ఞానేంద్రియములు మరియు మనస్సుతో సహా ఈ జగత్తులొ దేశకాలముల పరిధిలో మనుగడను సాగించే ప్రతి పదార్థము భగవానుడే. సృష్టించబడిన సర్వము భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు:

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా||7-6||

ఈ సకలజగత్తు నానుండియే పుట్టినది. ప్రళయములో జగత్తు నాయందే విలీనమగును.

జగత్తునకు ఉపాదాన కారణము ఈశ్వరుడే గనుక, జగత్తు నాకు తెలుస్తూనే ఉన్నది గనుక, నాకు ఈశ్వరుడు తెలిసినట్లే అని కొందరు వాదించవచ్చును. కాని, ఈశ్వరుడు మన జ్ఞానములో విషయము కాజాలడు. ఏలయనగా, జ్ఞానములో విషయమయ్యే వస్తువు జ్ఞాతకంటె వేరుగా ఉండాలి. కాని, ఈశ్వరుడు జ్ఞాతకంటె వేరుగా లేడు. సర్వము ఈశ్వరుని కంటె భిన్నముగానుండే పక్షములో, ఈశ్వరునియందు మిగిలేది సున్న. జ్ఞాత ఈశ్వరుని తన జ్ఞానములో విషయముగా దర్శించే పక్షములో, ఈశ్వరునికంటె జ్ఞాతయే గొప్ప యగును. ఈశ్వరుడు జ్ఞాతకంటె భిన్నముగా జ్ఞాతయొక్క మనోవృత్తిలో విషయమయ్యే పక్షములో, ఆ జ్ఞాత ఈశ్వరుడు విషయముగా గల ఆ మనోవృత్తిని త్రోసిపుచ్చి, మరియొక విషయమును గురించి ఆలోచించే మనోవృత్తి గల జ్ఞాతగా మనుగడను సాగించును. మనోవౄత్తిలో విషయములుగా వ వచ్చిపోయే పదార్థముల జాబితాలో ఈశ్వరుడు కూడ చేరును. అప్పుడు ఈశ్వరుడు జ్ఞాతయొక్క మనోవృత్తిపై ఆధారపడి యుండును. అప్పుడు ఈశ్వరునకు ఇతరములగు పరిచ్ఛిన్న పదార్థములకు తేడాయే ఉండదు. ఈశ్వరుని స్వరూపమును తెలుసుకొనుటలో పొరపాటును చేసినచో, ఇట్టి పరిస్థితి యేర్పడును.Slide95

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →