
చిత్రం : ఆడబ్రతుకు (1965)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్
******
విశేషాలు–ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చిన సంగీతదర్శక ద్వయంలో రామ్మూర్తి ఒకరు.ఈయన పూర్తిపేరు తిరుచిరాపల్లి కృష్ణస్వామి రామ్మూర్తి. తిరుచిరాపల్లిలో మే 18, 1922లో నాగలక్ష్మి, కృష్ణస్వామి అయ్యర్ దంపతులకు జన్మించారు రామ్మూర్తి. తమ పూర్వీకులందరికీ సంగీతంపై పట్టు ఉండటం, తండ్రి కృష్ణస్వామి, తాతయ్య మలైకొట్టై గోవిందస్వామి అయ్యర్లు వయొలిన్ విద్వాంసులు కావడంతో చిన్నప్పటి నుండే రామ్మూర్తికి సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది. అంతేకాకుండా చిన్నప్పుడే తండ్రితో కలిసి చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారు. చిన్న వయసులోనే రామ్మూర్తి సంగీతంపై ఏర్పరుచుకున్న ఇష్టాన్ని గమనించారు ప్రముఖ సంగీత దర్శకులు సి.ఆర్.సుబ్బరామన్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులోనే హెచ్ఎమ్వీ కంపెనీలో వయొలినిస్ట్గా చేరాడు రామ్మూర్తి. తర్వాత టి.జి.లింగప్ప, ఎం.ఎస్.విశ్వనాథన్లతో కలిసి పనిచేశారు. విశ్వనాథన్తో కలిసి చాలా చిత్రాలకు సంగీతం అందించారు. విశ్వనాథన్లో కలిసి చేసిన తొలిచిత్రం తమిళంలో పణమ్ (1952), తెలుగులో మా గోపి (1954). దాదాపు ఇరైవె తమిళ చిత్రాలకు సోలోగా సంగీతం అందించారు. ఆయన సోలోగా సంగీతం అందించిన మొదటి చిత్రం సాధు మిరండాళ్ (1966).ఇక ఈ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి.రామారావు గారికి పి.బి.శ్రీనివాస్ గారి గాత్రం బాగానే suit అయింది. పి.బి.శ్రీనివాస్ గారు పాడిన మధుర గీతాల్లో ఇదొకటి.
***
ఈ పాట ప్రత్యేకత–యువతీ యువకుల మధ్య ప్రేమ చిగురించే తొలినాళ్ళల్లో ,వారు ఒకరినొకరిని సూటిగా చూసుకోవటానికి సిగ్గు పడుతుంటారు!అలాంటి దోబూచులాటలో వలపు తొంగి చూస్తుంది. ఆ భావనను నారాయణ రెడ్డి గారు,” నిన్ను నేను చూసేవేళ..నన్ను నీవు చూడవేల.నేను పైకి చూడగానే… నీవు నన్ను చూతువేల?తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను.” అలతి అలతి చక్కని తెలుగు పదాలతో వ్రాసిన ఈ పాట ఎప్పటికీ నాకు గుర్తుండిపోతుంది.నారాయణరెడ్డి గారికి అభినందనలను తెలియచేద్దాం!
****
పల్లవి :
కనులు పలుకరించెను
పెదవులు పులకించెను
బుగ్గలపై లేత లేత సిగ్గులు
చిగురించెను
చరణం : 1
నిన్ను నేను చూసేవేళ…
నన్ను నీవు చూడవేల (2)
నేను పైకి చూడగానే… నీవు నన్ను చూతువేల
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
చరణం : 2
మొలక నవ్వు దాచుకోకు… జిలుగుపైట జారనీకు (2)
కురులు చాటు చేసుకోకు… తెరలు లేవు నీకు నాకు
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
చరణం : 3
అందమైన ఈ జలపాతం… ఆలపించె తీయని గీతం
ఒహొహో ఒహొహో… ఒహొహో…
అందమైన ఈ జలపాతం… ఆలపించె తీయని గీతం
కనిపించని నీ హృదయంలో…
వినిపించెను నా సంగీతం
తెలిసిపోయె నీలో ఏదో వలపు తొంగిచూసెను
ఈ సుమధుర గీతాన్ని ఇక్కడ https://www.youtube.com/watch?feature=player_detailpage&v=XHNog2qlsBI వినండి!
టీవీయస్. శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.