మనము మూడు రకముల భక్తులను గురించి చర్చించినాము. కాని, శ్రీకృష్ణ భగవానుడు నాల్గు రకముల భక్తులను వర్ణించినాడు:
చతుర్విధా భజంతే మాం జనాస్సుకృతినో2ర్జున|
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ||7-16||
ఉదారాస్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం||7-18||
భరత వంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి మరియు జ్ఞాని అనే నాలుగు రకముల పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు.
వీరందరు గొప్పవారే. కాని,జ్ఞాని నా స్వరూపమేనని నా సిద్ధాంతము.
ఈ నాలుగు రకముల భక్తులు తనకు ప్రియమైనవారే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుచున్నాడు.ఏలయనగా, వీరందరు భగవానుని ఉనికిని, శక్తిని తెలుసుకున్నవారే. కాని, వీరందరిలో జ్ఞాని సర్వోత్కృష్టుడైన భక్తుడు. ఏలయన, జ్ఞానికి మాత్రమే భగవత్స్వరూపమును గురించి యథార్థమైన అవగాహన గలదు.
భగవానుడు గలడు అనే వాక్యము జ్ఞానమును ప్రకటించగా, భగవానుడు నేనే అనే వాక్యము విజ్ఞానము (పూర్ణ జ్ఞానము)ను ప్రకటించును.భగవానుడు ఉన్నాడనియు, ఈ సర్వమునకు కారణము ఆయనయేననియు తెలుసుకొనుట కేవల జ్ఞానము మాత్రమే. కాని, భగవానుడే ఆత్మచైతన్యము అని దర్శించుట విజ్ఞానము. ఈశ్వరునియందు మరియు నాయందు ఉండే చైతన్యము ఒక్కటియే. కావున, భగవానుడు నాలోనే ఉన్నాడు.
తన స్వరూపము నీరు అని తెలుసుకున్న అల, తన స్వరూపము మాత్రమే గాక అన్ని అలల స్వరూపము కూడ నీరేననియు, సముద్రము కూడ నీరేననియు, కావున తానే సముద్రము అని చెప్పగల్గును. ఇది పూర్ణ జ్ఞానము, విజ్ఞానము.
భగవానుడిట్లు చెప్పుచున్నాడు:
జ్ఞానితో భక్తి పరాకాష్టను చేరి పరిపూర్ణమై సఫలమైనది. ఏలయన, అట్టి జ్ఞాని జ్ఞానముచే నాతో ఐక్యమును పొందినాడు. వాస్తవములో జ్ఞాని నేనే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.