Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

2 – నిదురించే తోటలోకి – డొక్కా ఫణి

By   /  May 4, 2015  /  No Comments

    Print       Email

సినిమా : ముత్యాల ముగ్గు
పాట   : నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
రచన : శ్రీ.గుంటూరు శేషేంద్ర శర్మ గారు

InCorpTaxAct
Suvidha

బాపు రమణల దృశ్యకావ్యం “ముత్యాల ముగ్గు” లో నా మనసుకు ఎంతో దగ్గరైన అద్భుతమైన పాట ఒకటి వుంది. ఈ పాట అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదేమోనని నా అభిప్రాయం. “ముత్యాల ముగ్గు” అనగానే మనకు గుర్తొచ్చేవి “ముత్యమంతా పసుపు”, “ఏదో ఏదో అన్నది”, “శ్రీరామ జయరామ”, “ఎంతటి రసికుడవో” వంటి పాటలే. అవన్నీ గొప్ప పాటలే. అయితే, మనలో చాలామంది మర్చిపోయిన మరొక పాట గురించి ఇవాళ ముచ్చటించుకుందాం. తెలుగుజాతి గర్వంగా “తమవాడు” అని తలెత్తి చెప్పుకోవలసిన యుగ కవి, ఉపాసకుడు “శ్రీ. గుంటూరు శేషేంద్ర శర్మ” గారు రాసిన ఒకే ఒక్క సినిమా పాట ఇది. ఒక గొప్ప విరహ కావ్యాన్ని, కొండంత విషాదాన్ని, చిన్ని చిన్ని మాటలలో ఆవిష్కరించిన “నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది” అనే పాట !! ఎన్ని సార్లు విన్నా కళ్ళమ్మట నీరొలికించే పాట. అది, నా మనసుకు హత్తుకు పోయిన పాట.

భర్తకు దూరమై, మోడుబారిన తన జీవితం తిరిగి ఎప్పుడు చిగురిస్తుందో తెలియని నిరాశలో వున్న కథానాయికకి తను, తన భర్తతో కలిసి పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఒక ఫొటో దొరికింది. భర్త వచ్చి వెళ్ళిన జాడ తెలిసింది. రేవులో, దూరంగా, వెళ్ళిపోతున్న నావలో భర్తని చూసి మౌనంగా రోదిస్తూ కుమిలిపోయింది, కూలబడిపోయింది. ఇదీ సన్నివేశం. ఇంత గొప్ప సన్నివేశానికి పాట రాసి, ఒప్పించడం కత్తి మీద సామే. అయితే యుగ కవి కాబట్టి శేషేంద్ర శర్మ గారు అలవోకగా ఆ భావాలన్నీ ఒక పొందికైన పాటలో పొదిగారు. ఈ పాటకి అక్షర లక్షలిచ్చినా చాలదు. కవి గారి ఋణం తీర్చుకోలేనిది.

 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది..”

ఆమె జీవితం ఒకప్పుడు నందన వనం. ఇప్పుడు నిదురిస్తోన్న వనం. అయితే అది నిదుర కాదు, నిరీక్షణ మాత్రమే. అందుకే కన్నుల్లో నీరు. నిదురపోతున్నప్పుడు కళ్ళలో నీరుండదుగా. ఆ ఆవేదననీ, నిరీక్షణనీ తాత్కాలికంగా దూరం చేస్తూ ఒక (కోయిల) పాట వచ్చిందట తోటలోకి. ఆ పాట ఆమె కన్నీళ్ళు తుడిచి, ఊరడించి, ఒక కమ్మటి కలని కానుకగా ఇచ్చి, కాసేపు సేదదీరమన్నదట. ఈ ఆశావహ భావానికి సూచనగా, పాట మొదలయ్యే ముందు కోయిల కూత వినబడుతుంది. అది దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు – వీరి అవగాహనకు అద్దంపడుతుంది.

 

“రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది, దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది”

అలా వచ్చిన పాట, ఇంటిముందు ముగ్గులు వేసి, ఆ చీకటి ఇంటిలో దీపం పెట్టిందిట. పండుగ వచ్చేముందు, ఎవరన్నా బంధువులు వచ్చే ముందు మనం ఇల్లలికి ముగ్గులు పెట్టి, దీపాలు వెలిగించి ఇల్లంతా కళకళలాడేట్టు చేస్తాము. ఆ వచ్చే పండుగకోసం, మనవారికోసం ఆశగా ఎదురు చూస్తాము. అదే భావన ఇక్కడ చెప్పారు.

ఇక మూడవ వాక్యం పాటకే మకుటం వంటిది. కేవలం ఒక్క “శ్రీవిద్యా ఉపాసకులు” మాత్రమే రాయగలిగిన గొప్ప వాక్యం, అని నాకనిపిస్తుంది.

 

“శూన్యమైన వేణువులో, ఒక స్వరం కలిపి నిలిపింది”

వేణువుకైనా, మనిషి మనుగడకైనా గాలి ఆధారం. ఆగాలి శృతిపక్వమైతే స్వరమౌతుంది, లయ బద్ధమైతే ఉఛ్వాసమూ, నిశ్వాసమూ అవుతుంది. స్వరం శృతి తప్పితే వేణువే వెలెవెలబోతుంది. ఊపిరి లయతప్పితే జీవితం దుర్భరమౌతుంది. జీవన వేణువులో ఊపిరులూదిన పాట ఒక స్వరమై కాసేపు జీవితాన్నే శృతిచేసిందిట. ఎంత గొప్ప భావన !!

 

“ఆకు రాలు అడవికి ఒక ఆమని దయ చేసింది !!”

ఇందాకా “తోట” అన్నారు. ఇప్పుడది “అడవి” అయిపోయింది చూసారా ! మనము మన కష్టాలని పదే పదే తలుచుకుంటూ కుమిలిపోతే, అవి ఉన్నవాటికన్నా చాలా పెద్దగా కనిపిస్తాయి రాను రాను. ఇది సహజమే కదా. అందుకనే ఆ “అడవి” లో ఆకులన్నీ రాలిపోయి శిశిరం వచ్చేసిందిట. అప్పుడు ఒక్కసారి వసంతం వచ్చి పలకరించి వెళ్ళిపోయిందిట. “దయ చేయడం” అనేమాటకి “రావటం”, “పోవటం” అని రెండర్థాలున్నాయి కదా. “కరుణించడం” అనే మరో అర్థం కూడా ఉంది. ఇక్కడ అర్థాలన్నీ సరిపోతాయి, అలోచించి చూస్తే. ఇది ఒక చక్కని పద “చిత్రం”.

 

విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో..”

పాపం, ఆమె ఎన్నో కలలు కంది. చక్కని భర్త, ముద్దొచ్చే పిల్లలు, చల్లని సంసారం, బొమ్మరిల్లులాంటి ఇల్లు, ఎంతో ఊహించుకుని ఎన్నో వేల్పులకి మొక్కింది, మరెన్నో కోరికలు పెంచుకుంది. ఇప్పుడా కోరికలు విఫలమయ్యాయి. సాధారణంగా గుమ్మానికి వ్రేలాడేవి మంగళ తోరణాలు, మామిడాకులు. అయితే ఆమె ఇల్లు ఒక చీకటి తోట. అక్కడ అడియాశలైన ఆమె కోరికలు గబ్బిలాలై వేళ్ళాడుతున్నాయి !!

 

అశల అడుగులు వినపడి, అంతలో పోయాయి..”

అక్కడ ఒక్కసారి ఎవరో వచ్చిన అలికిడైంది. అడుగుల శబ్దం వినబడింది. ఆమె పరిగెత్తుకు వచ్చి చూసింది, ఎవరూ కనబడలేదు పాపం. మళ్ళీ ఒంటరి తనం, నిరాశే మిగిలాయి. అప్పుడు ఆమె తలెత్తి దూరంగా చూసింది. కొమ్మల్లో పక్షులు కనబడ్డాయి. తల పైకెత్తింది. ఆకాశంలో మబ్బులు కనబడ్డాయి. తను వెళ్ళలేని చోటుకి, తను చేరలేని త్రోవకి అవి వేగంగా వెళ్ళగలవు. తన సందేశాన్ని భర్తకు అందివ్వగలవు. అందుకే

 

కొమ్మల్లో పక్షుల్లారా, గగనంలో మబ్బుల్లారా” అని పిలిచింది..

ఇక్కడ మరో మహా కావ్యం వంటి వాక్యం పడింది చూడండి..

 

నది దోచుకు పోతున్న నావని ఆపండి..”

ప్రవహించే నది తనతోబాటుగా నావను దొంగిలించుకు పోతున్నదట !!

కదలలేకపోవడం రేవు అసహాయత. కదిలి వెళ్ళిపోవడం నావ బలహీనత. నావని ఆపలేక, దానితో వెళ్ళలేక మౌనంగా రోదించడం రేవు నిస్సహాయత. రేవుకి పాపం విరహమే మిగిలింది. ఎదురు చూపులే రాసిపెట్టివున్నాయి రేవుకి. అందుకే ఆమె సందేశం..

 

రేవు బావురుమంటోందని నావకు చెప్పండి..” అని.

నువ్వెళ్ళిపోయినా, నీ జ్ఞాపకాలలో, తలపులలో నేను జీవఛ్ఛవాన్నై కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాను అనే సందేశాన్ని పంపిందట. మనకు దగ్గరైన వాళ్ళు, మనవాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు, మళ్ళీ ఏనాటికో, ఎన్నో ఏళ్ళకు అయినవారినీ, ఆప్తులనీ తిరిగి కలుసుకున్నప్పుడూ, మనం “బావురు”మంటాం. ఇది మనసులోంచి సూటిగా వచ్చిన గొప్ప మాట. మనమంతా మరిచిపోతున్న తెలుగుమాట.

 

ఇంత గొప్ప పాటని రచించిన కీర్తిశేషులు శ్రీ.గుంటూరు శేషేంద్ర శర్మ గారు చిరస్మరణీయులు. మనకు అమృతాన్ని అందించిన బాపు,రమణలు, కెవిమహదేవన్ గారు, సుశీలమ్మ ధన్యులు. వీరందరికీ తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడేవుంటుంది.

 

– ఫణి డొక్కా

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →