పాట: ఎదుటా నీవే, ఎదలోనా నీవే
సినిమా: అభినందన
రచన : ఆచార్య ఆత్రేయ
అభినందన సినిమా నేను డిగ్రీలో జాయనయిన సంవత్సరం వచ్చింది. నూత్న యవ్వనవేళ కదా. అంచేత అద్భుతమైన ఆ లొకేషన్సు, సినిమాటోగ్రఫీ, పాటలు, మొత్తంగా ఆ ప్రేమ కావ్యం మనసులో నిలిచిపోయింది. ప్రేమించాలనీ, ప్రేమించేసాననీ, విరహమంటే ఇలా వుంటుందా అనీ, అయితే నేను అనుభవిస్తున్నదే విరహమా అనీ, ఇలా చాలా చాలా అనిపించిన క్షణం అది. చూసిన ప్రతి అమ్మాయినీ ప్రేమించగల విశాలమైన మనస్సు నాది. ఆమె ఒక చిరునవ్వు నవ్వితే అమృతం కురిసినట్లే. చూడ కుండా వెళిపోతే గరళం గొంతులో కొట్లాడినట్లే. ఇలా పొద్దున్న ఇల్లువదలి రాత్రి ఇల్లు చేరేలోపు నాలోనే ఒక భావుకుడు, ప్రేమికుడు, భగ్న ప్రేమికుడు తారాడడం, అంతలోనే ఆశరేకెత్తించే ఏదో ఒక చిరునవ్వు చిరు తెమ్మెరలా వచ్చి మరలా పలకరించడం, మళ్ళీ కథ మొదటికి రావడం, ఇన్ని కలలతో, ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి ఇల్లు చేరడం. రాత్రి కలలను, నిన్నటి జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటూ మరో ఉదయానికి స్వాగతం పలకడం, ఒక మధ్యతరగతి యువరాజు యావత్ప్రపంచాన్ని తన ప్రేమ సామ్రాజ్యంగా భావించిన తరుణం అది. పువ్వు తనకోసమే పూస్తోందని, తుమ్మెద తన పాటకే శృతిని అందిస్తోందని, తన నవ్వుతోనే సుర్యోదయమౌతుందని నిజంగా నమ్మిన ఆ యవ్వనారంభవేళ చూసిన సినిమా అభినందన. ఆ హీరో నవ్వితే నవ్వాను, కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే నేనూ పెట్టుకున్నాను. అమ్మాయిలు ఎందుకిలా చేస్తారని అలిగాను. మళ్ళీ మర్నాటికి కథ మామూలయ్యేది. నా డబ్బులతో నేను కోఠీలో షాపు వాడి దగ్గర ప్రత్యేకంగా చేయించుకున్న తొలి సినిమా ఆడియో టేపులో ఒక వైపు “అభినందన”, మరో వైపు “ఘర్షణ” పాటలుండేవి. ఎన్ని వందల సార్లు విన్నానో, లెఖ్ఖే లేదు. ఇవాళ మనం అభినందన సినిమాలోని “ఎదుటా నీవే ఎదలోనా నీవే” అనే పాట గురించి సరదాగా మాట్లాడుకుందాము.
ఆత్రేయ గారు స్వయానా ఒక భగ్న ప్రేమికుడు. గొప్ప భావుకుడు. మాటల మాంత్రికుడు. మనసు ఆను పానులు ఎరిగిన మహా యోగి. ఆయన తన యవ్వన వేళ “బాణం” అనే ఒక స్త్రీమూర్తిని ప్రేమించి, దక్కించుకోలేకపోయారని విన్నాను. ఆనక ఆయన పెద్దలు చెప్పిన పెళ్ళి చేసుకున్నా, అన్నీ వదలి మదరాసు వచ్చేసారని ఎక్కడో చదివాను. ఆయన అన్నీ వదిలేసినా, ఎన్నో జ్ఞాపకాలు ఆయనను వదిలిపెట్టలేదు. అందుచేతనే ఆయన అంత గొప్ప పాటలు రాయగలిగారు. విరహ వేదన ఆయనకు తెలుసు, కన్నీరు తెలుసు, మనసు మరిగిపోవడం తెలుసు, దేవుణ్ణి ప్రశ్నించడం తెలుసు, విధినే బోనులో నిలబెట్టడం తెలుసు. దానికి సాక్ష్యం ఇలాంటి పాటలే.
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే..
ప్రేమించినవాడికి తన ప్రియురాలే లోకమౌతుంది. ఆమె లేని చోటే ఉండదు. అద్దంలో చూసుకున్నా ఆమే కనబడుతుంది. అన్ని దిక్కులలోనూ ఆ రూపమే అగుపడుతుంది. అలా కనిపించి ఊరిస్తుంది. ఆమెని చూడాలనిపిస్తుంది. అప్పటికప్పుడు సాధ్యం కాదు. ఒక్కోసారి ఎప్పటికీ సాధ్యం కాదని పిస్తుంది. అప్పుడు మనసు కలత చెందుతుంది. “నువ్వు కనిపించకపోతేనే బావుండును” అని అనుకుంటాడు ప్రేమికుడు. ఇది ప్రేమికులందరికీ స్వానుభవమే. అదే చెప్పారు ఈ పల్లవిలో.
కలలకు భయపడి పోయాను, నిదురకు దూరం అయ్యాను, వేదన పడ్డాను..
ఇతను భగ్న ప్రేమికుడు. సమీప భవిష్యత్తులో తన ప్రియురాలు విధి వశాత్తూ మరొకరిని పెళ్ళి చేసుకోవాలి. అది భరించలేని భావన. అదే కలగా వస్తే, అంతకు మించిన పీడ కల వుండదు. అందుకే అసలు పడుకోవడమే మానేసాడు. బెంగతో, బాధతో కృశించి, వేదన పడుతున్నాడు.
స్వప్నాలైతే క్షణికాలేగా, సత్యాలన్నీ నరకాలేగా
అతను కోరుకున్న స్వప్నాలు ఇప్పుడు వట్టి కలలు మాత్రమే. క్షణంలో మాయమైపోతాయి. కానీ తను వేరొకరిని పెళ్ళి చేసుకుంటోందన్న చేదు నిజం నరకప్రాయం.
ఇక తరువాతి వాక్యాలు అక్షర సత్యాలు, ఆ మహానుభావుడి కలం నించి జాలువారిన ఆణి ముత్యాలు.
స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్న మయ్యేదుందా?
ప్రేమకింత బలముందా?
ప్రతీ వారు తమ కల (స్వప్నం) నిజమవ్వాలని కోరుకుంటారు. కానీ ఇతను ఈ నిజం (సత్యం) కల అయిపోవాలని కోరుకుంటున్నాడు చూడండి. అది ఒక గొప్ప భావన. మన జీవితంలో హఠాత్తుగా ఏదైనా చెడు గానీ, భరించలేనిది గానీ జరిగినప్పుడు మనందరికీ అనిపిస్తుంది, “దేవుడా, ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాను, తెరిచేసరికి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళిపో, ఈ నిజాన్ని ఒక కల చేసేయ్” అని. అదే చెప్పారు ఆత్రేయ. ఇన్నీ చెప్పి “ప్రేమకింత బలముందా” అని అనడం నిజంగా అమోఘం. ప్రేమ గురించి మనకి ఎంత తెలిసినా, ఎంత అనుభవించినా, అది అనంతం. దాన్ని గురించి పూర్తిగా తెలుకోవడమే మోక్షం. ప్రేమే దేవుడు. దేవుడే ప్రేమ.
ఇక రెండో చరణం..
మరుపే తెలియని నా హృదయం తెలిసీ వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం
మరుపు అనేది మనిషికి దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం, వరం. అయితే మరచిపోవాలా వద్దా అని నిర్ణయించుకోవలసింది మాత్రం మనమే. మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ వుంటే ఎలా మరిచిపోతాం? హీరోకి ఎక్కడ చూసినా ఆమే కనబడుతోంది. అతనికి మరుపు అనేదే తెలియదు. అందుకే ఈ వేదన. అతననుకుంటున్నాడుట “నాకు మరిచిపోవడం తెలియదు, అలాంటప్పుడు నేను ప్రేమించడమే ఒక పెద్ద తప్పు, ఆ తప్పు చేసాను కాబట్టే ఈ గాయమైంది మనసుకి” అని. ఏదైనా కష్టం కలిగినప్పుడు మనకి ఇలా గతం తవ్వుకుని బాధపడే అలవాటు వుంటుంది. గజేంద్రమోక్షంలో చూడండి, మొసలి తన కాలుపట్టుకుని ప్రాణ శక్తిని హరించేస్తున్న సమయంలో ఏనుగు అనుకుంటుంది ” నానానేకపయూధముల్ వనములో నన్ను పెద్దకాలంవు సన్మానింప” అంటూ. అంటే, ” కొన్ని వేల ఆడ ఏనుగులు నన్ను గొప్పగా కొలుచుకుని, రాచ మర్యాదలు చేసేవి, ఇంద్రభోగాలను అనుభవించేవాడిని. అలాంటి నేను హాయిగా ఏ గంధం చెట్ల నీడనో విహరించక, ఈ దిక్కుమాలిన చెరువుకే ఎందుకొచ్చానురా భగవంతుడా” అని.. అలాగే హీరో కూడా తనలాంటివాడు అసలు ప్రేమించడమే తప్పేమో అనుకుంటున్నాడిక్కడ.
గాయాన్నైనా మాననీవు, హృదయాన్నైనా వీడి పోవు..
సరే, ప్రేమించాడు, మరచిపోలేకపోతున్నాడు. కనీసం ఆ అమ్మాయైనా సాయం చెయ్యొచ్చుగా. ఆమె తన హృదయం వదిలేసి పోతే, ఈ గాయం మానుతుందిగా. అదే అడుగుతున్నాడు.
కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు..
కాలం కలిసి రాలేదు. ఈ బాధని తట్టుకునే శక్తి తనకి లేదు. కనీసం మృత్యువు వచ్చి, తనని తీసుకెళ్ళిపోయినా బావుండునని భావిస్తున్నాడు. ఇక ఏమీ చెయ్యలేక చివరికి
పిచ్చివాణ్ణి కానీదు..
అన్నాడు. పిచ్చి వాడికి బాధ తెలియదు. తనవాళ్ళు, పరాయి వాళ్ళు అనే భావన వుండదు. అతనికి జ్ఞాపకాలున్నా, అవి బాధించవు. అతనికి పగలూ రాత్రీ ఒకటే. బ్రతుకూ, చావూ ఒకటే. అందుకే తను పిచ్చి వాడినైపోయినా బాగుండునని నిస్సహాయుడై కన్నీరు కార్చాడు.
ఒక ప్రేమికుడి బాధనీ, విరహాన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించిన పాట. మనసుకవి ఆత్రేయ గారి గొప్ప రచన. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట తోట తలిరాకు, స్వర రాజు ఇళయరాజా గారి బాణీలో అచ్చుదిగిన రవ్వల పిడిబాకు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.