పాట: ఆది భిక్షువు వాడినేది కోరేది
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సినిమా: సిరివెన్నెల
పాటల పల్లకి – పలుకుల వల్లకి డొక్కా ఫణి
సాహిత్యంలో “నిందా స్తుతి” అనే ఒక ప్రక్రియ వుంది. ఇటువంటి రచనలలో దేవుణ్ణి తిడుతున్నట్టుగా, దెప్పిపొడుస్తున్నట్టుగా పైకి అనిపిస్తుంది. కానీ, కాస్త లోతుగా చూస్తే, ఈ రచనలన్నీ దేవుడి లీలలని గానం చేస్తూ, ఆతని మహత్యాన్ని వివరిస్తూ, అతను చేసే పనులలోని రహస్యాలన్నీ విప్పి చెబుతున్నట్లు మనకి తెలుస్తుంది. ఇటువంటి రచన సిరివెన్నెల సినిమాలో, సీతారామ శాస్త్రిగారు రచించిన “ఆది భిక్షువు వాడినేది కోరేది” అనే పాట.
ఈ పాటకు నాకు తెలిసినంతవరకు అర్థం వివరించే ప్రయత్నం చేస్తాను.ఈ విశ్వంలో ప్రతి వస్తువు కీ, ప్రాణికీ యజమాని శివుడు. మరి ఆయన భిక్షమెత్తడం ఎందుకు? “ఆది భిక్షువు” అంటే “మొదటి సన్యాసి” అని అర్థం. అంతా తనదే. అంతటా ఆయనే నిండి వున్నాడు. అయినా దేనినీ తను కోరలేదు, దేనిపైనా మమకారం లేదు. సర్వం వదిలిపెట్టేసాడు. తనకోసం ఎప్పుడూ చింత పడలేదు. తన చల్లని చూపుతోనే సమస్తమైన సంపదలనూ ఇవ్వగల పరమ శివుడు, గొప్పదైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, ఆ ఆశ్రమ ధర్మమైన భిక్షాటన చేస్తూ, మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. అందుకే అతను ఆది భిక్షువు. అతని దృష్టిలో బంగారమూ, బూడిదా రెండూ సమానమే. ఇది లోపలి అర్థం. పైకి మాత్రం “ఆది భిక్షువువి నువ్వు, నిన్నేమి కోరుకోనయ్యా? ఏవైనా అడిగితే, ఇంత బూడిద ఇస్తావు, నిన్నేమి అడగనయ్యా?” అని దెప్పిపొడుస్తున్నట్టుగా వుంటుంది.
తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమినవాడి నేది కోరేది?
కఱకు గర్జనల మేఘముల మేనికి మెఱుపు హంగు కూర్చిన వాడి నేది అడిగేది?
ఎంతో కమ్మగా, తీయగా పాడే కోకిలని నల్లగా తయారుచేసావు. వింటేనే భయంవేసేట్టుగా గర్జించే మేఘాలకి మాత్రం, మెఱుపులు అనే తెల్లటి అంచులు తొడిగావు, అని సరసమాడుతున్నాడు. ఆయన దృష్టిలో కోకిల అయినా, మేఘమైనా ఒకటే. ఆయన సృష్టిలో అంతటా వున్నాడు. లోపం మనం చూడడంలోనే వుంది. అంతటా ఆయన్ని చూడగలిగే జ్ఞానం కలిగిననాడు మనకు ఇవేవీ వింతగా అనిపించవు.
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది?
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది?
ఎంతో ముద్దొచ్చి, తేనెని కలిగివుండే పూలకి కేవలం ఒక రోజు ఆయుర్దాయమిచ్చావు. మరి ఏ ప్రయోజనమూ లేని బండరాయికి కొన్ని వందల సంవత్సరాల జీవితం ప్రసాదించావు. ఇదేమి సృష్టి స్వామీ? అని పైకి పరాచకాలాడుతున్నారు. నీ దృష్టిలో రెండూ సమానమే అని లోపలి అర్థం.
గిరిబాలతో తనకు కల్యాణమొనరింప దరిచేరు మన్మధుని మసిచేసినాడు, వాడినేది కోరేది
పార్వతి పై శివునికి ప్రేమని కలిగించి, పార్వతీపరమేశ్వరుల వివాహానికి, తద్వారా కుమార సంభవానికి, తారకాసుర వధకి సహకరించాలనే మంచి ఉద్దేశ్యంతో దగ్గరకు వచ్చిన మన్మధుణ్ణి మసి చేసి పారేశాడు. ఎందుకయ్యా ఇంత కోపం? అని పైన చెప్పే అర్థం. “కాముడు” అంటే కోరిక. కోరికలని దరిచేరనివ్వకపోవడమే శివ తత్వం అని లోపలి అర్థం.
వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించి నాడు, వాడినేది అడిగేది
రాక్షసులకి అడిగినవరాలన్నీ ఇచ్చాడు శివుడు. వాళ్ళు ఆ వరాల బలంతో లోకాలని పీడించారు, ఇది తప్పు కదా శివా, అని పైన అర్థం.
ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడు శివుడు. ఎవరైనా పవిత్రమైన మనసుతో శివారాధన చేస్తే, ఆ భక్తుల కోరికలన్నీ (మంచివీ, చెడ్డవీ కూడా) తీరుస్తాడు శివుడు. అలా వారిలో కోరికలనేవే లేకుండా చేసి,తరువాత వారికి మోక్షాన్నిస్తాడు.
ముఖ ప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు వాడినేదికోరేది , ముక్కంటి, ముక్కోపి, తిక్క శంకరుడు
పొగడ్తలని కోరుకునే వాడివయ్యా శివా అని పైన అర్థం. భక్త సులభుడవి, ఒక్కసారి నమస్కరిస్తే చాలు ఆనందపడిపోయి, అడిగినవన్నీ ఇచ్చేసే బోళా శంకరుడివి అని లోపలి అర్థం. మూడు కన్నులవాడు, చాలా కోపం కలవాడు, తిక్క కలవాడు అని పైన అర్థం, జ్ఞాననేత్రం వున్నవాడివి, ధ్యాన మార్గంలో ఆటంకాలొస్తే ఖచ్చితంగా కోపగించుకునేవాడివి, విశ్వాన్ని కాపాడడంకోసం విషాన్నైనా మింగేయగల మొండితనం, ధైర్యం (తిక్క) కలవాడివి అని లోపలి అర్థం.
తెలుగు సినిమా పాటలో నామనసుకు నచ్చిన పాటలని, వాటిపై నా ఆలోచనలని మీతోపంచుకోవాలని ఈ ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నాను. సంకల్పం, ప్రయత్నం నాది, అటుపై అంతా ఈశ్వరేచ్ఛ.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.