Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

“బ్రహ్మ జ్ఞానము”

By   /  February 28, 2015  /  No Comments

    Print       Email


జనన మరణరూప ప్రవాహముతో గూడిన సంసారరూప దుస్తర సాగరమును తరింప గోరువారికి “బ్రహ్మజ్ఞానము” అనగా “వేదాంతవిద్య” గాక మరి యె యితరవిద్యయు సాధనము గాదు. ఈ సిద్ధాంతమును నిరూపించుటకై శ్రీశంకరాచార్యులవారు శ్రీ వివేకచూడామణియందు-
“న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా|
బ్రహ్మాత్మైకత్వబొధేన మోక్షస్సిద్ధ్యతి నాన్యథా||”
అనియును, “పాకస్య వహ్నివద్జ్నానం వినా మోక్షో న సిద్ధ్యతి” అని ఆత్మబోధమునందును చెప్పియున్నారు కావుననే సమస్త విద్యలకు ఆత్మజ్ఞానవిద్యయే శిరోమణి యని ఆత్మవిదులగు మహాత్ములు నిశ్చయించిరి.
శ్రీకృష్ణభగవానులు భగవద్గీతయందు – ” న హి జ్ఞానేన సదృశ౦ పవిత్ర మిహ విద్యతే” అనియు, ” రాజవిద్యా రాజగుహ్యమ్ పవిత్ర మిద ముత్తమమ్” అనియు, ఇంకను ఇట్టివే అనేక ప్రమాణములు జ్ఞానమును గూర్చి ఆనతిచ్చిరి. ఈ బ్రహ్మవిద్య సమస్తవిద్యలలో పవిత్రము, ఉత్తమము అయినది. ఎందుకంటే జననమరణరూప ప్రవాహమునుండి మానవుని తరింప జేసి మోక్షసామ్రాజ్యాభిషిక్తుని జేయుటకిది యొక్కటి మాత్రమే ఏకైక సాధనమై యున్నది. కానీ ఇది మిగుల దుర్లభమైనది; అనేక జన్మకృత సుకృత విశేషమున గాని సామాన్యముగా ప్రాప్తించునది గాదు. కావుననే ” అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి వరాం గతిం” అని భగవద్వాక్యము.
శ్రీకృష్ణభగవానులు గీతయందిట్లు నిరూపించిరి.
“మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే|
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్థ్వతః||”
” అనేకమంది మనుష్యులలో మోక్షసిద్ధిని పొందవలెనని యత్నించు వాడు ఏ ఒక్కడో ఉండును. అట్లు ప్రయత్నించు వారాలలో గూడ నిజముగా నన్ను తెలుసుకున్నవాడు ఒకానొకడు మాత్రమే.” కావున అట్టి బ్రహ్మజ్ఞాన ప్రాప్తి అనేకజన్మ సుకృతవిశేషమున గాని లభింపదని శాస్త్రములు, అనుభవజ్ఞులగు పెద్దలు చెప్పుచున్నారు.
బ్రహ్మనిష్టాగరిష్టుడగు సద్గురువు నాశ్రయించి “తత్త్వమసి” ఇత్యాది మహావాక్యరూప మహామంత్రములను విశ్వాసముతో విని మననము చేయుటవలన నతి శీఘ్రముగా బ్రహ్మజ్ఞానము గలుగును.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →