మనము ప్రార్థనలో భగవానుని గురించి ఆలోచిస్తాము. అనగా, భగవానుని ఉనికి మనకు తెలియునని మనము ప్రార్థనద్వారా నిరూపిస్తున్నాము. కాని, వ్యక్తి తనకు ఈశ్వరునకు భేధము లేదనే సత్యమును గుర్తించని పక్షములో, ఆ వ్యక్తికి ఈశ్వరుని గురించి ఉండే అవగాహన అసంపూర్ణము . ఏడవ అధ్యాయములో ఇట్టి అసమగ్రమగు తెలివికి జ్ఞానము అని పేరు పెట్టబడినది. ఈశ్వరుని ఉనికిని స్వీకరించే ఈ పాక్షికమగు జ్ఞానము గల వ్యక్తి ఆస్తికుడనబడును.
సముద్రమునుండి అలలు పుట్టును. వాటిని సముద్రమే నిలబెట్టును. అవి సముద్రములోననే విలీనమగును. అలకు సముద్రముతో ఉండే సంబంధమే వ్యక్తికి ఈశ్వరునితో గలదు. ప్రతి అలయందు సముద్రము వ్యాపించియుండును. కాని, అల తనకంటె సముద్రము భిన్నముగా నున్నదని తలపోయును. అనంతమగు సముద్రము అల్పుడనగు నన్ను సృష్టించినదని అల తలపోయును. ఒక మూర్ఖపు అల తాను స్వర్గమునుండి వచ్చినాననియో, లేక తనకంటె భిన్నముగా ఏదీ లేదనియో తలపోయును. మరియొక అల తనను సృష్టించిన సముద్రముయొక్క ఉనికిని స్వీకరించును. ఆ మూర్ఖపు అలకంటె ఈ అలయొక్క అవగాహన చాల రెట్లు మెరుగు. తన జన్మకు నిమిత్త కారణము సముద్రమని ఈ అల విశ్వసించుచున్నది గనుక, దీనికి ఆస్తిక-తరంగము అని పేరు పెట్టవచ్చును. సముద్రము ఉన్నది(అస్తి) అని ఈ అల స్వీకరించుచున్నది. ఇది వ్యక్తి తనకు పూర్వములో కొన్ని వందల తరముల క్రితము పూర్వజుడు ఒకడు ఉండెనని స్వీకరించుట వంటిది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.