విచిత్రమయిన ప్రశ్నలా అనిపిస్తున్నా ఈ ప్రశ్న వివేకవంతమైన ప్రశ్న. క్రితం వ్యాసంలో మనం మనస్సు అనే వ్యవస్థను గురించి చర్చిస్తూ మనస్సు భావాల యొక్క సమాహారమని తెలుదుకున్నాం కదా! మనస్సును మాయం చేయడమంటే ఒకరకంగా భావరహిత స్థితిని సాధించడమే. అంతేకాక నేనెవరిని? అన్న చింతనను కొనసాగించడం ద్వారా మనం మనసును మాయం చేయవచ్చు. అయితే ఆ పనిని మనసుతోనే చేయగలం. ఎలా? అని ప్రశ్నించడం సహజం, అది సాధ్యమే. ఉదాహరణకు మనం ఒక కట్టెను వెలిగించి దహనక్రియ జరిపినపుడు దాహింపబడే వస్తువుతోపాటు కట్టె కూడా కాలేచందంగా మనసుతోనే మనం చింతన చేసినా మనకు ఆత్మసాక్షాత్కారం లభించడంతోనే మనస్సు కూడా అదృశ్యమవుతుంది. అపుడు ‘నేను’ అనే భావం నశిస్తుంది. ప్రాణం తాలూకు కార్యకలాపాలు నెమ్మదవుతాయి. అహానికి,ప్రాణానికి మూలం ఒక్కటే, ఏ పని చేసినా అహంకారం లేకుండా చేయాలి. అనగా ఈ పని నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయాలి. అలా మనం చేయ గలిగితే ఆ స్థితిలో మనకు స్వంత భార్య సయితం ” విశ్వమాత”గా గోచరిస్తుంది. నిజమైన భక్తి అంటే అహంకారాన్ని ఆత్మకి అంకితం చేయడమే.
చింతన చేయడం తప్ప మనస్సుని మాయా చేయడానికి మరే ఇతర తృప్తికరమైన మార్గాలూ లేవు. ఇతర పద్ధతుల ద్వారా మనస్సును నిశ్చలం చేసినా అది తాత్కాలికం మాత్రమే. చంచలమైన మనస్సు మళ్ళీ మేల్కోని యథా ప్రకారం గంతులు వేస్తుంది. తిరిగి తన పాత ధోరణిలోకి వెళ్ళిపోతుంది.
మనలోని భావనలను, వాసనాలను, వాంఛలను అణచాలంటే మనం మన అంతరంగం లోనికి చూస్తూపోవాలి. అలా వెళ్తున్న కొద్దీ పైవన్నీ బలహీనమై చివరకవి మనను విడిచి పోతాయి. దృఢనిశ్చయంతో ఆత్మలోనికి చొచ్చుకొనిపోయిన కొద్దీ కొన్ని జన్మల నుండి మనస్సులో ఇంకిపోయిన వాసనలు కూడా తొలగిపోతాయి. చింతన నిరంతరం కొనసాగడం వల్ల మనస్సు మనస్సు మాయమైపోయి చివరికి ఆత్మగా మారిపోతుంది. మనలో ఆలోచనలను ప్రేరేపించే శక్తి వున్నంత వరకు చింతన కొనసాగుతూనే వుండాలి. ఒక్కోసారి ఒక్కొక్క ఆలోచన బయట పడినప్పుడల్లా ఈ చింతనతో దానిని జన్మస్థానంలోనే ధ్వంసం చేయడాన్నే వైరాగ్యం అనవచ్చు.
మనకు ఆత్మాసాక్షాత్కారమయ్యే వరకు చింతన చేస్తూనే ఉండాలి. మనకు కావలసినదల్లా ఒక్కటే, నిరంతరం”ఆత్మ”ను గురించిన యోచన చేయడమే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.