నను నిముసంబు గానక యున్న నూరెల్ల
నరయు మజ్జనకుఁ డెంతడలు నొక్కొ
యెపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న
న్నోమెడు తల్లి యెంతొఱలునొక్కొ
యనుకూలవతి నాదు మనసులో వర్తించు
కులకాంత మది నెంత కుందునొక్కొ
కెడఁ దోడునీడలై క్రీడించు సచ్ఛాత్రు
లింతకు నెంత చింతింతురొక్కొ
యతిథిసంతర్పణంబు లేమయ్యె నొక్కొ
యగ్ను లేమయ్యె నొక్కొ నిత్యంబులైన
కృత్యములఁ బాపి దైవంబ కినుక నిట్లు
పాఱవైచితె మిన్నులు పడ్డ చోట.
తను అక్కడే చిక్కుబడిపోయి ఇంటికి వెళ్ళలేకపోతే ఎవరెవరు ఎంత బెంగపెట్టుకుంటారో ఆని ప్రవరుడిలా చింతిస్తున్నాడు. నేను ఒక్క నిముషం కనిపించకపోతే ఊరంతా వెదికే (అరయు) నా తండ్రి ఎంత విచారిస్తాడో (అడలునో) కదా; ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలయందు (త్రిసంధ్యలయందు) ఇల్లు దాటనీయక నిత్యం నన్ను కాపాడుతూ ఉండే (నన్ను ఓమెడు) నా కన్నతల్లి ఎంత దుఃఖిస్తుందో కదా (ఒఱలునొక్కొ); అనుకూలవతి, ఎల్లఫ్ఫుడూ నామనసులో వర్తించే నా భార్య ఎంత వెతపడుతుందో కదా (కుందునొక్కొ) ; నిత్యం నాకు తోడునీడలుగా, నా చెంతనే (ఎడన్) ఉంటూ, నాతో ఆటలాడే (క్రీడించు), నా మంచి శిష్యులు (సచ్ఛాత్రులు) – ప్రవరుడు శిష్యుల్ని స్నేహితుల్లాగా చూసుకుంటాడన్నమాట – నేను ఇల్లు చేరకపోతే (ఇంతకు) ఎంత విచారిస్తారో కదా; నేను చేసే అతిథి సంతర్పణలు ఏమైపోతాయో కదా! నిత్యాగ్నిహోత్రినైన నా అగ్నులేమైపోతాయో కదా! నేను భక్తిశ్రద్ధలతో చేసే నా దినచర్యనుండి (నిత్యకృత్యములన్) దూరంచేసి, తప్పించి (పాపి) – ఓ దైవమా నన్నెందుకిలా దూరంగా (మిన్నులు పడ్డచోట) విసిరేశావు (పారవైచితివి) తండ్రీ! అని మొరపెట్టుకున్నాడు ప్రవరుడు.
మృగమదసౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరళ మై
మగువ పొలుపుఁ దెలుపునొక్క మారుత మొలసెన్
కస్తూరిపరిమళంతో (మృగమద సౌరభ విభవ), దానికి రెట్టించిన (ద్విగుణిత) పచ్చకర్పూరం కలిపి (ఘనసార) పరిమళం (గంధ) ఇంపారగా, ఇంకా ఇతర పరిమళ వస్తువులు కలిపిన (స్థగిత + ఇతర) సువాసనలతో నిండిన (సాంద్ర) తాంబూలం (వీటీ) యొక్క సువాసనలను తెలుపుతూ ఒకానొక చిరుగాలి వీచింది (ఒలిసెన్). ప్రవరుడి ముక్కుపుటాలకి సోకింది. ఆ సువాసనని బట్టి, సమీపంలో ఒక జవరాలు (మగువ) ఉందని గ్రహించాడు. ఆ చిరుగాలి ఆమె జాడని (పొలుపున్) తెలిపింది.
తాంబూలసేవనంలో వైభోగం. మగవారైతే రెండు పాళ్ళు కస్తూరి ఒక పాలు పచ్చకర్పూరంతో తాంబూలం సేవిస్తారు. మగువలైతే తాంబూలంలో ఒకపాలు కస్తూరి, రెండు పాల్లు పచ్చకర్పూరం వేసుకుంటారు. కాబట్టి ప్రవరుడు తనకేసి వీచిన చిరుగాలిలో ఆ పరిమళాన్ని బట్టి మగువ పొలుపుని, అంటే ఈ సమీపంలో ఎక్కడొ ఒక జవరాలు ఉంది అని గ్రహించాడు.
అతఁడా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
న్వితమిచ్చోటని చేరఁబోయి కనియెన్ విద్యుల్లతా విగ్రహన్
శతపత్రేక్షణఁ జంచరీకచికురన్ జంద్రాస్యఁ జక్రస్తనిన్
నతనాభిన్ నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్
ప్రవరుడు గాలివాటుగా వచ్చిన సుగంధము యొక్క ప్రవర్తన విలాసము చేత, ఈ ప్రాంతం జనులు కలదిగా గ్రహించి, వెళ్ళేసరికి అక్కడ అతనికి ఒక అత్యుత్భుతమైన సౌందర్యవతి అగుపించింది. అతడు మెఱుపుతీగలాటి మేను కలదానిని (విద్యుల్లతావిగ్రహన్); కమలాలవంటి కన్నులు గలదానిని (శతపత్ర + ఈక్షణన్), తుమ్మెదరెక్కలవంటి కురులు గలదానిని (చంచరీక చికురన్), చంద్రబింబం లాంటి మోముగలదానిని (చంద్ర + ఆస్యన్), చక్రవాకముల వంటి, లేదా గుండ్రనైన చన్నులు గలదానిని (చక్రస్తనిన్), లోతైన బొడ్డు కలదానిని (నత నాభిన్) ఒకానొక, దేవతాస్త్రీశిరోమణిని (మరుత్ నారీ శిరోరత్నమున్), జవరాలిని (నవలాన్) ప్రవరుడు చూశాడు (కనియెన్). సర్వశుభలక్షణ అని వర్ణన.
తనకేసి వస్తున్న ప్రవరుణ్ణి చూడగానే, ఆ దేవతాస్త్రీకి –
అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ గాంతి పె
ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పల పంక్తులఁ గ్రుమ్మరింపఁగా
గుబ్బ మెరుంగుఁ జన్గవ గగుర్పొడువన్ మదిలోనఁ గోరికల్
గుబ్బతిలంగఁ జూచె నలకూబర సన్నిభు నద్ధరామరున్
నలకూబరనితో సమానమైన అందంగల ఆ బ్రహ్మణుణ్ణి (ధర+అమరున్) చూడగానే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు విప్పారాయి; కాంతిపెల్లుబ్బి కంటినల్లగ్రుడ్లు విచ్చిన (వికసిత) కలువపూవుల్లా అయ్యాయి (ఉత్పలపంక్తులని గ్రుమ్మరించాయి); గుండ్రనైన మిసమిసలాడే స్తనద్వయం (గుబ్బమెఱుంగు చన్గవ) గగుర్పొడిచింది. మదిలోన కోరికలు పెల్లుబికాయి (గుబ్బతిలంగన్).
బాలాంత్రపు వేంకట రమణ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.