Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 14

By   /  May 17, 2015  /  No Comments

    Print       Email

ప్రవరుని చూసిన వరూధిని మన్మథాతావస్థకు గురి అయింది.

ఎక్కడివాఁడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్

InCorpTaxAct
Suvidha

జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడువాఁడు, మహీసురాన్వయం

బెక్కడ యీ తనూవిభవ మెక్కడ యేలని బంటుగా మరున్

డక్కఁ గొనంగ రాదె, యకటా! నను వీడు పరిగ్రహించినన్!

ఎక్కడివాడో! అబ్బ! ఎంత సౌందర్యం! నలకూబరుణ్ణి (యక్షతనయ), చంద్రుడ్ని (ఇందు), జయంతుడిని (ఇంద్రకుమారుడు జయంతుడు) వసంతపురుషుణ్ణి, మన్మధుణ్ణి (కంతున్) అందంలో గెలవగలిగినవాడు! బ్రాహ్మణకులం ఎక్కడ? ఈ శరీరసంపత్తి (తనూ విభవము) ఎక్కడ? అకటా, నన్ను ఇతడు పరిగ్రహిస్తే మన్మధుడిచేత వెట్టిచాకిరీ చేయించుకోనా! అంటే మన్మధ సామ్రాజ్యాన్ని జయించి దాని అధిపతి అయిన మన్మధుడి చేతనే బానిసలాగా వెట్టిచాకిరీ చేయించుకోనా, అని.

ఆ దివ్యాంగన ప్రవరుడి రూపలావణ్యం గురించి ఇలా భావిస్తోంది.

వదన ప్రభూత లావణ్యాంబు సంభూత

     కమలంబు లన వీని కన్నులమరు

నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడు

     కరణి నున్నవి వీని ఘన భుజములు

సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె

     వెడఁద యై కనుపట్టు వీని యురము

ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్రవాఱిన

     రీతి నున్నవి వీని మృదుపదములు

 

నేరెటేటి యసల్ తెచ్చి నీరజాప్తు

సానఁబట్టిన రాపొడి చల్లి మెదిపి

పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు

వీనిఁ గాకున్నఁ గలదె యీ మేని కాంతి!

 

ఈ అందగాని కన్నులు ముఖ కాంతి అనే నీట పుట్టిన కమలాలవలె ఉన్నాయి. అతని ఎగుభుజాలు నిక్కి చెవులతో ఆటలాడుతున్నాట్టున్నాయి. ఇతని విశాల వక్షస్థలం మన్మధుడి సింహాసనంలాగ ఉంది. పాదాలు ఎంత సుకుమారంగా వున్నాయంటే, నడుస్తున్నప్పుడు గడ్డి చిగుళ్ళు తగిలి కందిపోయాయి కాబోలు, బాగా ఎఱ్రబారి ఉన్నాయి.

 

ఆ బ్రహ్మదేవుడు జంబూనది (నేరెటి+ఏటి) యందలి బురద (అసల్) తెచ్చి (జంబూనదిలోని అడుసు బంగారమని చెప్పబడింది), సూర్యుణ్ణి సానబట్టగా రాలిన పొడిని (రజను) అందులో జల్లి, కలయగలిపి, ముద్ద పాకానికి కావలసిన (పదను) తడిని అమృతంతో కలిపి రంగరించి ఇతనిని చేశాడేమో ! లేకపోతే ఇంతటి శరీర కాంతీ, లావణ్యం ఎలా సాధ్యం ? ఇంకా –

సుర గరుడోరగ నర ఖే

చరకిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా

ధర గంధర్వకుమారుల

నిరతము గనుఁగొనమె, పోలనేర్తురె వీనిన్?

దేవతలు (సుర) గరుడ (పక్షీంద్రుడైన గరుత్మంతుడు), నాగజాతి (ఉరగ), ఆకాశంలో సంచరించే దివ్యపురుషులు (ఖ అంటే ఆకాశం, దానిలో చరించేవారు ఖేచరులు), కిన్నర, సిద్ధ, సాధ్య, చారణ, విద్యాధర, గంధర్వ – వీరిలో యుక్తవయసులో ఉన్నవారిని (కుమారులన్), నిత్యం చూస్తూ ఉండనా? వారిలో ఎవరైనా వీనితో సరిపోలగలరా? అనుకుంది.

 

ఇంతలు కన్నులుండఁ దెరు వెవ్వరివేఁడెదు భూసురేంద్ర! యే  

కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా

గింతియ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు నీ

కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె, మాటలేటికిన్?

 

చెంపకి చారడేసి కళ్ళు పెట్టుకుని ఎవరినయ్యా దారి అడుగుతున్నావు? ఒంటరిగా ఉన్న జవరాలిని పలకరించే నెపం కాకపోతేను! నువ్వు వచ్చిన త్రోవ అప్పుడే మర్చిపొయావా? ఇంత భయంలేకుండా అడగడానికి నేను నీకు చులకన (ఎల్లిదము) అయ్యానా?

 

“భూసురేంద్రా” అని సంబోధించింది. బ్రాహ్మణులలో ఇంద్రునివంటి వాడా అని. నేను అప్సరసని – నీవు ఇంద్రుడివి. చక్కటి కన్నులతో ఉన్నావు. నీ ఆందం నాకు నచ్చింది. జవరాలిని. యుక్తవస్సులో ఉన్నదానిని. ఒంటరిగా ఉన్నాను. అన్ని సూచనలనిచ్చింది. ఇంక మాటలెందుకు – నేను నీకు భోగ్యురాలిని – అని నర్మగర్భంగా పలికింది.

 

ఇంకా అతడు తనని సామాన్యురాలిగా తలచకూడదని ఇలా చెప్పింది.

 

చిన్ని వెన్నెలకందు వెన్ను దన్ని సుధాబ్ధిఁ

     బొడమిన చెలువ తోఁబుట్టు మాకు

రహి పుట్ట జంత్ర గాత్రముల ఱాల్ గరఁగించు

     విమల గాంధర్వంబు విద్య మాకు

ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు

     పని వెన్నతోడఁ బెట్టినది మాకు

హయమేధ రాజసూయము లనఁ బేర్పడ్డ

     సవనతంత్రంబు లుంకువలు మాకుఁ

 

గనకనగ సీమఁ గల్పవృక్షముల నీడఁ

బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ

బద్మసంభవ వైకుంఠ భర్గ సభలు

సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర.

 

ఓ భూసురోత్తమా! పాల సముద్రంలో (సుధాబ్ధిన్) బాల చంద్రుని (చిన్ని వెన్నెలకందు) వెనుకనే ప్రభవించిన అందగత్తె (చెలువ) – సాక్షాత్తూ లక్ష్మీదేవి – మాకు తోబుట్టువు; వీణ మొదలైన జంత్రవాయిద్యాలచేతనూ, కంఠగానం (గాత్ర) తోనూ బాగా రక్తి (రహి) కలిగించే గొప్ప సంగీత విద్య మా గంధర్వుల సొత్తు; కామశాస్త్రపాఠాలని (మినుకులు – పలుకులు; ఆవర్తించడం – వల్లెవేయడం) బాల్యంలోనే వెన్నతో పాటు మాకు వంటబడతాయి.

అశ్వమేధం, రాజసూయం లాంటి గొప్ప యఙ్ఞాలు చేసినవాళ్ళకి మాత్రమే మేం దక్కుతాం. ఆ యఙ్ఞఫలాలే వాళ్ళు మాకు ఇచ్చే కట్నాలు (ఉంకువలు).

మేరుపర్వతం (కనక నగ సీమ), కల్పవృక్షాల నీడలో పచ్చఱాళ్ళ చరియలపై మేము కూటమి తీరుస్తాం. బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల సభలు మాకు నాట్యశాలలు. అంత గొప్పదాన్ని సుమా !

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Shailesh Lakhtakia’s Journey

Read More →