Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 16

By   /  May 20, 2015  /  No Comments

    Print       Email

ప్రవరుడు ఆమెకు సమాధానం కూడా చెప్పకుండా, ప్రక్కనే ఉన్న కొలనులో శుచి అయ్యి అగ్ని దేవుడిని ప్రార్థించాడు.

 

InCorpTaxAct
Suvidha

దానజపాగ్ని హోత్ర పరతంత్రుఁడనేని భవత్పదాంబుజ

ధ్యానరతుండనేనిఁ బరదార ధానాదులఁ గోరనేని స

న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం

భోనిధి లోనఁ గ్రుంకకయ మున్న రయంబున హవ్యవాహనా.

యఙ్ఞ్జయాగాదులనుండి హవిస్సుల్ని తీసికువెళ్ళే ఓ అగ్నిహోత్రుడా (హవ్యవాహనా)! దాన జప అగ్నిహోత్రములకు నేను అధీనుడనైతే, సదా నీపాదపద్మములయొక్క ధ్యానమందు ఆసక్తికలవాడనైతే, పరుల భార్య-ధనాదులను నేను ఎన్నడూ కోరనివాడనైతే, సగౌరవంగా (కామ మోహిత అయిన ఈ వరూధినిచే అగౌరవం పాలవకుండా), సూర్యుడు (ఇనుడు) పడమటి సముద్రంలో (పశ్చిమాంభోనిధిలోనన్) క్రుంకకముందు నన్ను ఇల్లు చేర్చు తండ్రీ – అని ప్రార్థించాడు.

వెంటనే అగ్నిదేవుడు ప్రవరునికి అమితమైన తేజోబలాలని ప్రసాదించాడు. ఆ ప్రభావంతో ప్రవరుడు తక్షణమే తన ఇల్లు చేరుకున్నాడు.

***

పెద్దన గారు చేసిన కొన్ని రమణీయమైన వర్ణనలు.

సూర్యాస్తమయ వర్ణన –

 

శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షులుష్ణాంశు పా

షాణ వ్రాతము కోష్ణమయ్యె, మృగతృష్ణా వార్థు లింకెన్ జపా

శోణం బయ్యెఁ బతంగ బింబము దిశాస్తోమంబు శోభాదరి

ద్రాణంబయ్యెఁ సరోజషండములు నిద్రాణంబులయ్యెన్ గడున్

 

పక్షులు బారులు తీరి ఆకాశ మధ్యభాగానికి (నబోంతరాళంబునన్) పరిగెట్టాయి-ఎగిరాయి. సూర్యకాంత శిలాసముదాయం (ఉష్ణాంశు పాషాణవ్రాతము) నులివేడి (కోష్నము) కలవిగా అయింది. మధ్యాహ్నానికి వేడెక్కిన సూర్యకాంతపురాళ్ళు చల్లబడ్డాయి అని. సముద్రంలాగా అంతులేనట్టు కనబడే ఎండమావులు (తుష్ణావార్థులు) ఇంకిపోయాయి. సూర్యమండలం (పతంగబింబం) జపాకుసుమం – దాసానిపువ్వు – లాగ ఎఱ్రగా అయింది. దిక్కుల సమూహం (దిశాస్తోమంబు) కాంతిచే పేదఱికం చెందింది (శోభాదరిద్రాణంబు అయ్యెన్). అంటే అన్ని దిక్కులా కాంతి తగ్గి చీకటి పడటం మొదలయింది. పద్మసమూహాలు (సరోజషండములు) బాగా (కడున్) ముకుళించాయి (నిద్రాణంబు). అంటే ప్రొద్దుక్రుంకు సమయం అయింది.

 

ఇరుట్లు (చీకటి) వర్ణన –

 

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన

     మాయాకిరాతు మై చాయఁ దెగడి

నవపింఛ మయ భూష లవధరించి నటించు

     పంకజాక్షుని చెల్వు సుంకమడిగి

కాదంబ నికురుంబ కలిత యై ప్రవహించు

     కాళింది గర్వంబుఁ గాకు సేసి

తాపింఛ విటపి కాంతార సంవృతమైన

     యంజనాచల రేఖ నవఘళించి

 

కవిసె మఱియును గాకోల కాల కంఠ

కంఠ కలకంఠ కరి ఘటా ఖంజరీట

ఘన ఘనా ఘన సంకాశ గాఢకాంతిఁ

కటిక చీకటి రోదసీ గహ్వరమున

అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రాదించిన సమయంలో, మాయా కిరాతుడి రూపంలో వచ్చిన శివుడు ఒళ్ళంతా కస్తూరి (మృగనాభి) అలముకున్నప్పుడు కలిగిన నల్లటి ఒంటి రంగు, నెమలిపింఛమునలంకరించుకున్న కృష్ణుడు, నల్లని హంసలను కలిగిన యమునా నది, చీకటి చెట్లతోపులు (తాపించ విటపి కాంతార) గల కాటుకకొండ (అంజనాచలం), మాలకాకులు (కాకోల), నెమిళ్ళమెడలతో (కాలకంఠ కంఠ), ఏనుగుమంద (కరిఘటా), కాటుక పిట్టలతో (ఖంజరీట), కాఱుమబ్బులు (ఘన ఘనా ఘన)- వీటంతటి కాఱు నలుపుని మించిన నలుపుతో కటికచీకటి జగమంతా కమ్ముకుంది.

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →