కలయ జగమునఁ గలయట్టి నలుపులెల్ల
దెలుపులుగఁ జేసి నీడలు దెలుపు సేయఁ
గా వశము గామిఁ బొడము దుఃఖమునఁ బోలె
సాంద్ర చంద్రిక తుహిన బాష్పములు గురిసె
వెన్నెల, తాను జగమునందలి నల్లని పదార్థాలన్నిటినీ తెల్లగాచేసికూడా, నీడలని మాత్రం తెలుపుచేయడానికి శక్యం కాకపోవడంతో (వశము గామిన్), జనించిన దుఃఖంతో కాబోలునన్నట్లు మంచు చినుకులు (తుహిన బాష్పములు) కురిసాయి.
వరూధిని విరహ పరాకాష్ట –
వరూధిని ప్రవరుడి కోసం బహువిధములైన విరహ బాధలననుభవించింది. ఆ విరహం పరాకాష్టకి చేరుకుంది.
చనుగవఁ గప్పు దొలగ వాసన గాలి కెదురేఁగుఁ
బరు వొప్ప నలుగుల బాఱు కరణి
నిడుద వేనలి నూనె ముడి వీడఁ జిగురాకు
బొదఁ దూఱుఁ గార్చిచ్చుఁ గదియు కరణిఁ
బసిడి గాజులు పైకి వెసఁద్రోచి నునుఁదీగఁ
దెమలించు నురిత్రాడు నెమకు కరణి
మొలనూలు బిగియించి వెలది వెన్నెలఁ జొచ్చుఁ
బిఱుదీయ కేటిలో నుఱుకు కరణి
జడియ దళులకుఁ గురియు పుప్పొడుల మునుఁగు
మావికడ నిల్చు విరుల నెత్తావిఁ గ్రోలు
విషమ సాయకునేఁపుల విసివి విసివి
తనువుఁ దొఱగంగ దలఁచి యవ్వనరుహాక్షి.
ఇది విరహావస్థలో “మృతి” అనే చివరి మన్మథావస్థ. ఈ స్థితికి చేరుకున్న వరూధిని విరహం తట్టుకోలేక చేసిన మరణ ప్రయత్నం అభివర్ణింపబడింది.
ఆమె మన్మథుడు వేసిన పుష్పబాణాలచే (విషమ సాయకు తూపులన్) విసిగి విసిగి, శరీరాన్ని విడిచిపెట్టెయ్యడానికి (తనువు తొఱగంగన్) నిశ్చయించుకుని, పైట తొలగిపోయినా, పరుగున పరుగున సువాసనలు వెదజల్లే గాలికి ఎదురేగుతోంది. అటునుండి వచ్చేవి మన్మథుడు వదులుతున్న పూల బాణాలు; ఆ పూలబాణాలు సువాసనలు వెదజల్లుతూ ఈమె కేసి వస్తున్నాయి – ఇటునుండి ఈమె ఆ బాణాలకేసి వేగంగా – శరీరత్యాగానికి కూడా వెనుకాడకుండా – ఆ బాణాలకేసి దూసుకు వెళ్తోంది.
దావాగ్ని (కార్చిచ్చు) చేరబోవు విధంగా (కదియు కరణిన్) పొడవైన (నిడుద) జడతో వేసిన సిగయొక్క (వేనలి) ముడివీడిపోగా, చిగురాకు పొదలలోకి దుముకుతుంది. (విరహిణి మతిచలించి చనిపోదామని చిగురుటాకుల రాశి అగ్నిగుండమని భ్రమించి దూకింది).
బంగారుగాజులు పైకి త్రోసుకొని, లతలని ఉరిత్రాడుగా పెనవేసుకుంటుంది. మొలత్రాటిని బిగించుకుని, సముద్రంలో దూకుతున్నట్టు వెన్నెలలో జొరబడుతుంది. తుమ్మెదలకి (ఆళులకి) భయపడదు.
రాలే పుప్పొడులలో మునుగుతుంది. మామిడిచెట్టు వద్ద నిలిచి పూవులనిండు పరిమళాన్ని గ్రోలుతుంది.
గంధర్వుడు మాయా ప్రవరుడిగా అవతరించాడు.
అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట
పట్టి దీర్చిన గంగ మట్టి తోడఁ
జెక్కుటద్దములందు జిగివెల్లువలు చిందు
రమణీయ మణికుండలముల తోడఁ
బసిఁడి వ్రాఁత చెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు
నరుణాంశుకోత్తరీయంబు తోడ
సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు
బెడఁగారు నీర్కావి పింజె తోడ
ధవళ ధవళము లగు జన్నిదముల తోడఁ
గాశికాముద్ర యిడిన యుంగరము తోడ
శాంతరస మొల్కు బ్రహ్మతేజంబు తోడఁ
బ్రవరుఁదయ్యె వియచ్చర ప్రవరుఁడపుడు
అర్థచంద్రుణ్ణి అందాన్ని తిరస్కరించేలాగ ఉన్న నుదిటిమీద గంగమట్టిని తిలకంగా దిద్దుకున్నాడు. అందమయిన మణులతో చెక్కిన కుండలాల్ని చెవులకు ధరించాడు. వాటి కాంతులు అద్దాల్లాంటి అతని బుగ్గల మీదకి చిందుతున్నాయి. . బంగారుపనితనంతో అంచులు మిసమిసలాడుతున్న, ఎఱ్రని రంగుగల ఉత్తరీయం భుజం మీద వేసుకున్నాడు. వెలలేని రత్నాలతో పొదిగిన బంగారు మొలత్రాడు (జాళువా మొలకట్టు) కట్టుకున్నాడు. అందమైన కావిరంగు (నిత్యం ఉతికి ఆరవేసుకోడం వల్ల కావిరంగు తేలింది) పంచె కట్టుకున్నాడు. అతితెల్లటి యఙ్ఞోపవీతం ధరించాడు. వేలికి కాశీముద్రవున్న ఉంగరం పెట్టుకున్నాడు. శాంతరసం ఒలికే బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతూ – ప్రవరుడి రూపంతో నిలిచాడు ఆ గంధర్వశ్రేష్టుడు (వియచ్చరప్రవరుడు).
కాంచి కలక్వణత్కనక కాంచిక యై యెదురేఁగి యప్పు డ
క్కంచన కేతకీ కుసుమ గాత్రి వయస్యలడించి తన్నికుం
జాంచల వీథి దాఱుచు ఘనాంత చలచ్చపలాకృతిన్, గలన్
గాంచిన వస్తువున్ దెలిసి గాంచినయ ట్లనురక్తిఁ గాంచుచున్
పసిమి మొగలిపువ్వులాంటి మేనుఛాయగల వరూధిని ఆ కపట బ్రాహ్మణుడైన మాయాప్రవరుణ్ణి చూచి (కాంచి) – అతడు అసలు ప్రవరుడనే ఆమె అనుకుంది – మొలకు కట్టుకున్న మువ్వల వడ్డాణం అవ్యకమధురంగా ధ్వనులు (కనత్ కనక కాంచితయై) చేస్తుండగా, చెలికత్తెలని విడిచి, తానే వంటరిగా (ఎదురేగి), అతడు ఉన్నచోటున వున్న పూపొదలసమీపంలో (తత్ నికుంజ + అంచల వీథిన్) తాపీగా నడుచుకుంటూ (తారుచున్), కలలోచూసిన వస్తువుని మెలకువ వచ్చాకా చూసినట్టు (కలన్ కాంచిన వస్తువున్ తెలిసి కాంచినయట్లు), అతనినే ప్రేమపూర్వకంగా (అనురక్తిన్) చూసింది.
బాలాంత్రపు వేంకట రమణ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.