పలాశిడాసి రాజుఁజూచి పల్కె నోరి నోరికీ
పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దొఁచితౌ
బలా, బలాలితోడఁ బాలఁబట్టి బిట్టుచుట్టి నిన్
హళాహళిన్ హలాహలాభయౌ బుభుక్షఁ దీర్చెదన్
మాంసభక్షకుడైన (పలాసి) ఆ రాక్షసుడు సమీపించి (డాసి) రాజుని చూసి ఇలా అన్నాడు (పల్కెన్). ఓరీ, ఈ వనంలో (పొలానన్) నా నోటికి (నోరికి), పెనుమాంసం (పెన్ పొల) తినడానికి (ఆనన్), లేకపోయిన ఈ సమయంలో (లేకపోవన్), నువ్వు కనపడ్డావు (తోచితి); ఇది నాకు తగును (ఔ); భలే (బలా). నీ సైన్యంతో సహా (బల+ఆళితోన్, ఈ బాలికని (బాలన్) పట్టుకొని (పట్టి), ఇప్పుడే, వడిగా (బిట్టు), నిన్నుకూడా చుట్టబెట్టి (నిన్ చుట్టి), ఆత్రంతో (హళా హళిన్) హాలాహలంలాంటి (హలా హలాభయౌ), ఆకల్ని (బుభుక్ష) తీర్చుకుంటాను (తీర్చెదన్).
ఇందీవరాక్షుడు చాటుగా అదృశ్యరూపంలో ఆయుర్వేదవిద్యని నేర్చుకొన్నాడు. తరవాత గురువుగారి దగ్గఱకి వెళ్ళి అపహాస్యం చేసి, నీచపు బిచ్చపు మునీ (కష్ట ముష్టింపచా) అని ధిక్కరించాడు.
అనినన్ గన్నులు జేవురింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్యద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్ నిగుడన్, లలాట ఫలకం బందంద ఘర్మాంబువుల్
చినుకన్, గంతు దిదృక్షు రూక్షనయన క్ష్వేళాకరాళ ధ్వనిన్
ఇందీవరాక్షుడు అలా ప్రేలగానే, బ్రహ్మమిత్రుడనే ఆ మునికి కన్నులు ఎఱ్రపడిపోయాయి. పెదవులు కోపంతో కంపించాయి (అల్లాడన్). గుబురుగా పెరిగి వ్రేళ్ళాడు తున్న (వేల్లత్), కనుబొమలు (భ్రుకుటి) మాటిమాటికీ (పునః పునః), ఎగిరిపడ్డాయి (ఉద్యత్). సర్పద్వయంలా (భుజంగ యుగళీ) బుసకొట్టినట్టు (ఫూత్కార) భయంకరమైన (ఘోర) గాలియా అన్నట్టు (అనిలంబు అనన్) శ్వాశ (ఊర్పులు) వెలువడింది. ఆ నిట్టూర్పులు అంతకంతకు ఆవేశం వల్ల ఎక్కువైపోయాయి (నిగుడన్). నుదిటిమీద అక్కడక్కడ (అందంద) చెమటబిందువులు (ఘర్మాంబువుల్) చినుకగా – ఒక భయంకరమైన అరుపు అరిచాడు. ఆ బొబ్బ ఎలాఉందంటే, మన్మధుణ్ణి (కంతు) తన కోపపుచూపుతో (దిదృక్షు) వేడికన్నుగల (రూక్షనయన) పరమశివుడు దహనం చేసిన సమయంలో చేసిన సింహనాదంలాటి (క్ష్వేళా) భీతిని కలుగచేసేటటువంటి (కరాళ), మహాశబ్దం (ధ్వనిన్) లాంటి ధ్వని ఈ ముని నోటివెంట వచ్చింది.
వెంటనే ఇందీవరాక్షుణ్ణి బ్రహ్మరాక్షసుడవైపొమ్మని శపించాడు.
మునిశాపప్రభావం వల్ల క్రమేపీ తనకి బ్రహ్మరాక్షస లక్షణాలు ఎలా వచ్చాయో ఇందీవరాక్షుడు స్వరోచికి ఇలా చెబుతున్నాడు.
అభ్రమండలి మ్రోచునందాక నూరక
పెరిగినట్లౌ మేను నరవరేణ్య
యవధి భూధర సానువందాక నూరక
పఱచినట్లౌ మేను పార్థివేంద్ర
యబ్జ భూ భవనంబునందాక నూరక
యెగసినట్లౌ మేను జగధదీశ
యహిలోక తల మంటునందాక నూరక
పడినయట్లౌ మేను ప్రభువతంస
యఖిల జగములు మ్రింగునంతాకలియును
నబ్ధులేడును జెడగ్రోలునంత తృషయు
నచల చాలన చణమైన యదటుఁ గలిగె
నసురభావంబు ననుఁ జెందు నవసరమున
ఓ రాజా, రాక్షసత్వం నన్ను ఆక్రమించుకొన్న సమయంలో నా శరీరం కారణం లేకుండానే (ఊరక) గగనాన్ని (అభ్రమండలి) మోసేటంతంగా (అంటే ఆకాశాన్ని తాకుతుందా అన్నంతగా) పెరిగిపోయినట్లనిపించింది. ఇంక వెడల్పు చూద్దామా అంటే – చక్రవాళ (అబ్జభూధరము) పర్వత చరియలదాకా పరుచుకున్నట్లు అనిపించింది. పైకి ఎదగిపోతోందన్న భావం ఇంకా ఆగలేదు. అన్ని లోకాలకన్నా పైనున్న బ్రహ్మదేవునియొక్క సత్యలోకం దాకా (అబ్జ భూభవనం) కూడా పెరిగిపోయినట్లనిపించింది. పొడుగు, వెడల్పు చెప్పాడు. ఇప్పుడు క్రిందికి చెబుతున్నాడు. పాతాళలోకం (అహి అంటే పాము ఆహిలోకం నాగులకు లోకమైన పాతాళం) దాకా ఊరికే పడిపోయినట్లు భావన కలిగింది.
అంతే కాదు లోకాలన్నిటినీ (అఖిల జగములు) మింగేద్దమా అన్నంత ఆకలీ, సప్తసముద్రాలనీ తాగేద్దమా అన్నంత దాహమూ వేసాయిట. పైగా పర్వతాలని (ఆచలములు – కదలనివి, పర్వతాలు) కూడా కుదిపేసేటంతటి (చాలన – కదలించే) చణము, నేర్పరితనము, బలము (అదటున్) కలిగాయి ఓ రాజా నన్ను దైత్యత్వం ఆవరించిన వేళ.
***
స్వరోచి వనదేవత ద్వారా ఒక కుమారుణ్ణి కన్నాడు.
కాంచెన్ బుత్రు విశాలనేత్రుఁ బృథువక్షః పీఠి విభ్రాజితున్
బంచాస్యోద్భట శౌర్యధుర్య ఘన శుంభద్బాహుఁ దేజోనిధిం
బంచాస్త్ర ప్రతిమాను మాన ఘను సామ్రాజ్యైక హేతు ప్రభూ
తంచల్లక్షణ లక్షితున్ సుగుణ రత్నానీక రత్నాకరున్
విశాలమైన కళ్ళు, వెడదఱొమ్ము, సింహపరాక్రమమం, మన్మధుణ్ణిమించిన సౌందర్యం, సార్వభౌమలక్షణాలూ, సకలసద్గుణసంపన్నుడూ, అభిమానధనుడూ అయిన కుమారుడు జన్మించాడు.
అతడే స్వారోచిషుడు.
తెలుగు భాష లాలిత్యం, సౌకుమార్యం తెలియాలంటే “మనుచరిత్ర” చదవాలి అని పెద్దలంటారు. చతుర్దశ (పధ్నాలుగు) వర్ణనలు కలిగి, ఆఱు ఆశ్వాసాల ఈ ప్రబంధ రత్నం, 750 పైగా పద్య-గద్య-వచనాలతో ఒక కళాఖండంగా వెలిసింది. తెలుగు భాష ఉన్నంతకాలం అల్లసాని పెద్దనామాత్యుని పేరు ఈ భూమీద సుస్థిరంగా ఉంటుందనడానికి సందేహం లేదు.
శుభం !!
బాలాంత్రపు వేంకట రమణ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.