నవమాసాలు నిండిన పిమ్మట వరూధిని ఒక శుభముహూర్తాన ఒక చక్కని కుమారుణ్ణి కన్నది. మునులు ఆ బాలుడికి జాతక కర్మ నిర్వహించి అతడు సూర్యచంద్రులలాగా ప్రకాశిస్తూ ఉండటంచేత అతనికి “స్వరోచి” అని నామకరణం చేశారు. యుక్తవయసులో అక్షరాభాసం చేసి సకలవిద్యలూ ఉపదేశించారు. స్వరోచి యౌవనవంతుడై, మహావీరుడై మందరగిరిమీద విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన నగరాన్ని, ఆటవికులందరూ భయభక్తులతో కొలుస్తూ ఉండగా రాజ్యం ఏలసాగాడు.
ఒకనాడు స్వరోచి వేటకి వెళ్ళాడు. అక్కడ అతను పరిజనులతో కలిసి, తనివి తీరా కౄరమృగాలని వేటాడి వినోదిస్తూ ఉండగా, ముందుగా కొన్ని అపశకునాలూ, తదుపరి శుభశకునాలూ కనిపించాయి. స్వరోచి “ముందు ఏదో మహాయుద్ధం జరిగినతరవాత శుభమయ్యేలాగా ఉంది” అనుకుంటూ ఉండగా “అయ్యో, అబలని, రక్షించండి! రక్షించండి!!” అన్న ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది.
వెంటనే స్వరోచి ఆ ఆర్తనాదం వినిపించిన దిక్కుగా తన పంచకల్యాణిని ఉరికించాడు. అటునుంచి ఒక దివ్యమైన సుందరి భయంతో కంపించిపోతూ అతనికి ఎదురై “ఓ రాజా! నన్ను రక్షించు. నేటికి మూడుదినాలుగా ఒక రాక్షసుడు నన్ను వెంబడిస్తున్నాడు. నేను ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజు కుమార్తెను” అని ఇంకా తన కథని ఇలా వివరించింది.
“ఓ మహావీరా! నా పేరు మనోరమ. నాకు కళావతి, విభావసి అనే ఇద్దరు చెలికత్తెలు ఉన్నారు. ఒకనాడు మేము హిమాలయపర్వతంమీద పువ్వలకోసం వెళ్ళి, అక్కడ ఒక గుహలో ఒక ముసలిముని తపస్సుచేసుకుంటూ ఉండగా చూశాం. అతడు బూచిలాగా ఉండడం చూసి, బాల్యచాపల్యంతో “ఇతని నోరేది? ఇతని కళ్ళు ఎక్కడున్నాయి? ఇతని చెవులు ఏవి?” అని అతని మొహం పట్టుకుని ఊపాను. దానితో ఆమునికి తపోభంగమయ్యి, “వయసుమదంచేత ఒళ్ళెరక్క వృద్ధుడనైన నన్నిలా అవమానించావు కనుక నువ్వు రాక్షసుడిబారినపడి ప్రాణభయం పడుదువుగాక” అని శపించాడు. పైగా నన్ను తన బెత్తంతో నన్ను చావగొట్టాడు. అప్పుడు నాచెలికత్తెలు తెగబడి అతనిని మందలించగా, అతను కోపించి వాళ్ళిద్దర్నీ క్షయరోగ పీడితులుకమ్మని శపించాడు.
“ఓ రాజా, ఆ శాపప్రభావంవల్ల మూన్నాళ్ళగా ఒక బ్రహ్మరాక్షసుడు నన్ను కబళిస్తానని వెంటపడుతున్నాడు. నన్ను రక్షించు. నేను నీకు ‘అస్త్రహృదయం’ అనేవిద్యని ప్రసాదిస్తాను. ఈ విద్యని తొలుత ఈశ్వరునిచే స్వయంభువమనువు, అతనివలన వసిష్టుడు, అతనిద్వారా చిత్రాశ్వుడు అనే మా మాతామహుడు, క్రమంగా పొందారు. ఆయన ఈ విద్యని నా తండ్రికి అరణంగా ఇచ్చాడు. మా తండ్రి నాకు ప్రసాదించాడు. ఈ విద్యని ఇప్పుడు నేను నీకు ఇస్తాను. దీని సాయంతో నువ్వు రాక్షసుణ్ణి సంహరించి నన్నుకాపాడు. ఒక స్త్రీవలన విద్యస్వీకరించడానికి సందేహించకు” అని పలికింది.
స్వరోచి సంతోషించి, శుచియై, మనోరమవద్ద అస్త్రహృదయాన్ని ఉపదేశం పొందాడు. అటుపిమ్మట స్వరోచి బ్రహ్మరాక్షసుడితో ఘోరమైన యుద్ధం చేసి, చివరగా అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆవేటుతో రక్కసుడు నేలకూలాడు. ఆశ్చర్యకరంగా ఆ ఘోరదేహంనుండి ఒక దివ్యపురుషుడు ఉధ్భవించాడు. అతను స్వరోచిని ప్రేమతో కౌగలించుకుని ఇలా అన్నాడు.
“వత్సా, నేను ఇందీవరాక్షుడు అనే గంధర్వరాజుని. ఈ మనోరమ నా ముద్దుల కుమార్తెయే. అంతేకాదు, నేను నీ తల్లి వరూధిని కి తమ్ముణ్ణి. శాపవశాత్తూ నేను బ్రహ్మరాక్షసుడనై, జ్ఞానం నశించి చివరికి నా కుమార్తెనే భక్షించడానికి సిద్ధం అయ్యాను. ఇంతకీ నాకు ఈ శాపం ఎలా వచ్చిందంటే , ఒక మునీశ్వరుడు తన శిష్యులకి ఆయుర్వేదవిద్యని ఉపదేశమిస్తూ ఉండడం చూసి, నేను ఆ మునిని నాకు కూడా ఆయుర్వేదాన్ని నేర్పమని అడిగాను. అతను అందుకు నిరాకరించాడు. అప్పుడు నేను అదృశ్యకరణి అనే విద్యాప్రభావంతో, ఎవరికీ కనబడకుండా ఆముని తన శిష్యులకి వైద్యవిద్య నేర్పుతుండగా ఆ శాస్త్రాన్నంతానేర్చుకున్నాను. అంతటితో ఆగకుండా, నిజరూపంతో ఆ మునీశ్వరుడివద్దకి వెళ్ళి “ఓయీ, నాకు విద్యనేర్పమంటే గొణుక్కున్నావు. ఆసక్తి ఉన్నవారికి విద్య ఎలాగైనా రాకపోతుందా? సన్నికల్లు దాచేస్తే పెళ్ళి ఆగిపోతుందా? చూడు, నీకు తెలియకుండానే నీ విద్యనంతా నేర్చేసుకున్నాను” అని అపహాస్యంచేశాను. దానితో ఆముని మహోగ్రదగ్రుడై నన్ను బ్రహ్మరాక్షసుడవైపోమని శపించాడు. నేను పశ్చాత్తాపంతో అతని కాళ్ళమీదపడి క్షమాపణకోఱగా ఆయన కనికరించి “కొన్ని దినాలకి నీ కుమార్తెనే మ్రింగబోయి ఒక ధన్యునిశరముల వాతబడి శాపవిముక్తుడ వౌదువుగాని” అని దయ చూపించాడు.
“ఆ ముని శాపం వలన నాకు క్రమక్రమంగా రాక్షసత్వం ప్రాప్తించింది. నా పౌరలందరినీ మ్రింగేశాను. ఇరుగుపొరుగు పట్టణాలని కూడ నాశనం చేయడం మొదలుపెట్టాను. నా మంత్రులు నా భార్యాపిల్లల్ని నా నుండి దాచేసి నాకు మహోపకారం చేశారు. చివరికి ఇలా నా ముద్దులకుమార్తెనే కబళింపబోయాను. నేటికి నీ దయవలన శాపవిముక్తి కలిగింది. నా కుమార్తెనీ, నేను నేర్చుకున్న ఆయుర్వేదవిద్యనీ గ్రహించి నన్ను ధన్న్యుణ్ణి చెయ్యి” అని వేడుకున్నాడు. అందుకు స్వరోచి సంతొషంతో అంగీకరించాడు.
ఇంతలో ఇందీవరాక్షుని మంత్రి సామంతాదులందరూ వచ్చి, తమ ప్రభువుని స్వాగతించారు. ఇందీవరాక్షుడు, స్వరోచి-మనోరమలతో కలిసి మహావైభవంగా తన రాజ్యానికి వెళ్ళి, ఒక శుభముహూర్తంలో మనోరమని స్వరోచికిచ్చి అంగరంగ వైభోగంగా వివాహం జరిపించాడు.
(to be continued…)
బాలాంత్రపు వేంకట రమణ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.