Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 7

By   /  May 7, 2015  /  No Comments

    Print       Email

ఇక ఆఊళ్ళొ వేశ్యలుకూడా ఉన్నారు. వాళ్ళు నాట్యవిద్యా-రూప-విలాసాల్లో (నాట్యరేఖా కళా ధురంధర నిరూఢిన్) అందె వేసిన చేతులు. కొంగు బిగిస్తే చాలు (కాసెకొంగు) రంభాది అప్సరసలు పోటీకి వచ్చినా (ఒరయన్) ఓడిపోయి తిరిగి వెళ్ళిపోవలసిందే. నాట్యందాకా అవసరమే లేదు. వీళ్ళు కాసెకొంగు బిగిస్తేచాలు – వాళ్ళు ఆగిపోతారు.

 

InCorpTaxAct
Suvidha

ఇవన్నీ ఎందుకు – ఆ ఊళ్ళో పుట్టిన చిగురుకొమ్మ కూడా చేవగలదే. సారవంతమే.

 

 

ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోఙ్ఞ మూర్తి భా

షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీ

క్షాపరతంత్రుఁ డంబురుహ గర్భ కులాభరణం బనారతా

ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూ విలాసుడై

 

‘అఖ్య” అంటే పేరు. ప్రవరుడు అనే అఖ్యకలవాడు. “ఆపురిన్ ఉండు” అని చెప్పి ఊరుకోకుండా “ఆ పురిన్ పాయక ఉండున్” అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. “పాయక” అంటే విడిచిపెట్టకుండా. విడిచిపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళాలనీ, బహు దేశాలు చూడాలని లోపల ఎంతకోరికగా ఉన్నా, విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు. (అందుకే ముక్కూ మొగం తెలియని సిద్ధుడెవరోవచ్చి పాదలేపనం ఇవ్వగానే హిమాలయాలకి ఎగిరిపోయాడు.)

 

మకరాంక శశాంక మనోఙ్ఞ మూర్తి. అంటే మన్మధుడిలా, చంద్రుడిలా మనోహరమైన మూర్తి గలవాడు. భాషలో – పాండిత్యంలో అపర ఆదిశేషుడు. వివిధాధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు. పలు తెఱగులైన యఙ్ఞములయొక్క పుణ్యకర్మముల యొక్క నియమములకు అధీనుడగువాడు.

అంబురుహగర్భ కులాభరణంబు, బ్రాహ్మణ కులమునకు అలంకారము అగువాడు.  ఎల్లప్పుడూ (అనారత) వేదాధ్యయనం చేయించుటయందు (అధ్యాపన) ఆసక్తి కలవాడు (తత్పరుడు). అంటే వేదపఠనం నిత్యం తాను చేయడమే కాకుండా, శిష్యులకు కూడా నేర్పడంలో మహా శ్రద్ధ కలవాడు. ధర్మాచరణం, కర్మాచరణం తప్పనివాడు.

లేఖ్యము అంటే లిఖింపతగినది. చిత్రించి చూపించగలిగిన విలాసం – లేఖ్యవిలాసం. అలా లిఖించి, చిత్రించి చూపించలేనంతటి, వీలుకానంతటి తనూ విలాసం కలవాడు – అలేఖ్య తనూ విలాసుడు.

ఇలా ఈ పద్యంలో ప్రతీ విశేషణమూ భావికథలో సార్థకమయ్యేట్టుగా కవి నిబంధించాడు.

 

వాని చక్కదనము వైరాగ్యమున జేసి

కాంక్షసేయు జారకామినులకు

భోగ బాహ్యమయ్యె బూచిన సంపెంగ

పొలుపు మధుకరాంగనలకు బోలె

 

అరుణాస్పదపురంలో వెలయాండ్రు ఉన్నరనీ, వారు రంభాదులతోనైనా పోటీ చేయగలరనీ చెప్పాడు. ఆ వేశ్యాంగనల ప్రస్తావన ఇక్కడ చరితార్థమవుతోంది.

ఆ ఊళ్ళో వేశ్యాంగనలు (జారకామినులు. కామిని అంటే కామం కలది అని కాదు. ‘కమ్’ ధాతువుకి కాంతి అని అర్థం. కామిని అంటే లావణ్యవతి, కాంతిమతి అని మాత్రమే. జారకామిని అంటే లావణ్యవతి అయిన వేశ్య). ప్రవరుడి చక్కదనం చూసి చాలామంది కాంక్షించారు. కానీ ప్రవరుడికి ఉన్న వైరాగ్యంవల్ల వాళ్ళ కోరిక తీరలేదు. అతడి చక్కదనం వాళ్ళకి భోగబాహ్యం అయింది. ఎలాగ అంటే, సంపెంగ పువ్వు సొగసు తుమ్మెదలకు (మధుకరాలు) ఎలా భోగబాహ్యమో అలాగ ప్రవరుడి అందం జారకామినులకు అందనిది అయింది. (సంపెంగి దగ్గరకి వెళితే తుమ్మెదలు తలతిరిగి పడిపోతాయని లోకప్రసిద్ధి).

మొత్తం మీద ప్రవరుడి శీలసౌందర్యాన్ని ఆవిష్కరించే పద్యం. భూలోక జారకామినులకు ఎలా భోగ బాహ్యమయ్యిందో దేవలోక జారకామినికి కూడా అలాగే భోగ బాహ్యం అవుతుందని సూచన.

 

యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక

శ్రీవిధిఁ గూఁకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ

ఖ్యావహయై భజింప సుఖులై తలిదండ్రులుగూడి దేవియున్

దేవరవోలెనుండి యిలు దీర్పఁగఁ గాఁపురమొప్పు వానికిన్  

గృహస్థుగా ప్రవరుడి పరిస్థితిని తెలియజేస్తున్నాడు. అతడి ధార్మిక ప్రవృత్తికీ వైరాగ్యానికీ కారణం స్వతస్సిద్ధమైన స్వభావమే తప్ప చిన్న వయస్సులోనే మీద పడిన బరువు బాధ్యతల లాంటివి ఏవీ కావుసుమా అని సూచిస్తున్నాడు.

 

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →