Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు – Chapter 10

By   /  May 11, 2015  /  No Comments

    Print       Email

శీలంబుణ్ గులమున్ శమంబు దమముం జెల్వంబు లేబ్రాయమున్

బోలం జూచి యితండు పాత్రుడని యే భూపాలు డీ వచ్చినన్

InCorpTaxAct
Suvidha

సాలగ్రమము మున్నుగా గొనడు – మాన్యక్షేత్రముల్ పెక్కు చం

దాలం బండు నొకప్పుడుం దఱుగ దింటం బాడియుం బంటయున్

అతడి శీలాన్ని చూసి, కులాన్ని చూసి, అంతరింద్రియ నిగ్రహాన్ని (శమము) గమనించి, బాహ్యేంద్రియ నిగ్రహాన్ని (దమము) గుర్తించి, సౌందర్యాన్ని (చెల్వంబు) వీక్షించి, లేత వయస్సుని – యౌవనాన్ని పరిశీలించి ఇతడు పాత్రుడు – అర్హుడు – అని ఏ రాజుగారైనా ఏదైనా ఇవ్వడానికి వస్తే (ఈన్ వచ్చినన్) ప్రవరుడు అంగీకరించేవాడు కాదు. కనీసం సాలగ్రామ దానమైనా స్వీకరించేవాడు కాదు.

దానం పట్టినవాడు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. సాలగ్రామం మాత్రం విష్ణుస్వరూపం. ఇది దాతకీ ప్రతిగ్రహీతకీ కూడా శుభప్రదం. కాబట్టి దీనికి ప్రతిగ్రహీత ప్రాయశ్చిత్తం చేసుకోనవసరం లేదు. అయినా దాన్ని కూడా స్వీకరించేవాడు కాదుట. అప్రతిగ్రహం ప్రవరుడికి దృఢమైన నియమం అని అర్థం.

దీనికి కారణం ఏమిటంటే – పలువిధాలుగా పండే సారవంతమైన పొలాలు (మాన్యక్షేత్రముల్) ఉన్నాయి అతనికి. పాడికీ పంటకీ ఇంటిలో ఏనాడూ (ఒకప్పుడున్) ఏ లోటూ లేదు. అందుకని ఎవరిదగ్గరా చెయ్యి చాపవలసిన అవసరం అతడికి రాలేదు.

ఇంక అతని ధర్మపత్ని సోమిదేవమ్మ ఎంతటి అనుకూలవతి అంటే –

 

వండనలయదు వేవురు వచ్చిరేని

నన్నపూర్ణకు నుద్దియౌ నతని గృహిణి

యతిథు లేతేర నడికి రేయైన బెట్టు

వలయు భోజ్యంబులింట నవ్వారి గాగ.

 

ఒక్క సారిగా వెయ్యిమంది (వేవురు) భోజనాలకు వచ్చినా ఆవిడ వండటానికి అలిసిపోదు. బద్ధకించదు. అన్నపూర్ణాదేవికి సాటివస్తుంది (ఉద్దియౌ) అతని భార్య (గృహిణి). అతిథులు అర్థరాత్రి వేళ వచ్చినాసరే వండిపెడుతుంది. కావలసిన పదార్థాలు ఇంటిలో యెప్పుడూ సమృధ్హిగా (అవ్వారిగాగన్) ఉండటంతో సోమిదమ్మగారు సాక్షాత్తూ అన్నపూర్ణ అయ్యింది. యఙ్ఞం చేసినవాడు సోమయాజి; అతని భార్య సోమిదమ్మ.

 

తీర్థ సంవాసు లేతెంచినారని విన్న

     నెదురుగా నేగు దవ్వెంత యైన

నేగి తత్పదముల కెఱగి యింటికి దెచ్చు

     దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు

నిచ్చి యిష్టాన్న సంతృప్తులగా జేయు

     జేసి కూర్చున్నచో జేరవచ్చు

వచ్చి యిద్ధరగల్గు వనధి పర్వత సరి

     త్తీర్థ మాహత్మ్యముల్ దెలియ నడుగు

 

నడిగి యోజన పరిమాణ మరయు, నరసి

పోవలయు జూడ ననుచు నూర్పులు నిగుడ్చు

ననుదినము తీర్థ సందర్శనాభిలాష

మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి.

 

తీర్థయాత్రలు చేసినవారెవరైనా అరుణాస్పదం వైపు వస్తున్నారని తెలిస్తే చాలు, ఎంత దూరమైనా ఎదురువెళతాడు. వెళ్ళి వారి పాదాలకు నమస్కరిస్తాడు, నమస్కరించి (ఎఱగి) ఇంటికి ఆహ్వానించి తీసుకు వస్తాడు. తెచ్చి మంచి భక్తితో ఆతిథ్యం ఇస్తాడు. ఇచ్చి వారికి ఇష్టమైన భోజన పదార్ధాలు తెలుసుకొని వండించి వారిని సంతృప్తులుగా చేస్తాడు (ఇష్టా+అన్న+సంతృప్తులగా జేయు). చేసి వారు విశ్రాంతిగా కూచున్న సమయంలో దగ్గరకి చేరతాడు. చేరి – ఈ భూమి మీద ఉన్న (ఈ ధరన్ కలుగు) సముద్రాలు (వనధి) పర్వతాలు (పర్వత), నదులు (సరిత్) తీర్థాలు, వాటి మహత్తులూ తెలియజెప్పమని అడుగుతాడు. వారు చూసినవి చెబుతారు. అవి ఇక్కడికి ఎన్ని యోజనాలదూరంలో ఉన్నాయో అడిగి తెలుసుకొంటాడు. అరసి – నేనుకూడా చూడటానికి వెళ్ళాలి అంటూ నిట్టూర్పులు విడుస్తాడు (చూడన్ పోవలయుననుచు ఊర్పులు నిగుడ్చున్).

తరుణవయస్సులో ఉన్న ఆ నిత్యాగ్నిహోత్రుడి మనస్సులో ఎప్పుడూ ఒకటే కోరిక. వెళ్ళాలి, తీర్థాలు సందర్శించాలి అనే అభిలాష రోజురోజుకీ ఆత్మలో ఉప్పొంగుతోంది.

ఇలా ఉండగా ఒకనాడు ఒక ఔషధ సిద్ధుడు ప్రవరుడి ఇంటికి వచ్చాడు. హఠాత్తుగా ఊడిపడ్డాడు. సరాసరి ఇతడి ఇంటికే వచ్చాడు. (ఈ రెండు కారణాలవల్లా – ఒకప్పుడు వరూధినిచేత తిరస్కృతుడైన గంధర్వుడే ఇక్కడికి సిద్ధుడిగా వచ్చాడనీ, ఆనక అతడే మాయాప్రవరుడయ్యాడనీ కొందరు ఊహించారు).

ఆ సిద్దుడి వర్ణన ఇది.

 

ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె

     మొగముతోలు కిరీటముగ ధరించి

కకపాల కేదారకటకముద్రిత పాణిఁ

     గుఱచ లాతాముతోఁ గూర్చి పట్టి

యైణేయ మైన యొడ్డాణంబులవణిచే

     నక్కళించినపొట్ట మక్కళించి

యారకూటచ్ఛాయ నవఘళింపఁగఁ జాలు

     బడుగు దేహంబున భస్మ మలఁది

 

మిట్టయురమున నిడు యోగఒపట్టె మెఱయఁ

జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ

గావికుబుసంబు జలకుండియును బూని

చేరెఁ దద్గేహ మౌషథసిద్ధుఁడొకఁడు

 

 

ఆ సిద్ధుడి వేషం చిత్రంగా ఉంది.

 

తైల సంస్కారంలేక రాగిరంగుకి (ఎరుపు) మారిపోయిన ఒంటి జడ (కెంపు+జడ) దాన్ని కప్పుతూ పులితోలు (మువ్వన్నె మెకము = మూడు రంగుల్లో ఉండే మృగం – పెద్దపులి) కిరీటంగా ధరించాడు.

 

ఒక చేతిలో సంచి (కకపాల) పట్టుకున్నాడు. ఆ చేతికే కేదార కటకం (పంచలోహాలతో శివలింగముద్రతో ఉన్న కడియం లేదా కంకణం) ఉంది. అర్థచంద్రాకారముఖం గల ఒక పొట్టి దండాన్ని (కుఱచ లాతము, లాతాము) అదే చేతి చంకలో కూర్చి దగ్గరగా పట్టుకున్నాడు. ఇది జపమాల తిప్పేటప్పుడు చేతి కింద బోటుగా ఉపయోగించే యోగదండం కావచ్చును.

దుప్పితోలుని (ఏణి = ఆడలేడి, ఐణేయం = ఆడలేడి తోలుతో చేసింది) ఒడ్డాణంగా ధరించాడు. వెన్నుకి అంటుకుపోయిన పొట్టను (అక్కళించిన పొట్టన్) ఆ తోలుపట్ట బిగింపుతో (లవణిచేన్) లావుగా ఉబ్బించి కనిపించేటట్టు చేసుకున్నాడు (మక్కళించి=లావెక్కించి).

ఇత్తడి రంగులో ఉన్న (ఆరకూట+ఛాయ) సన్నటిదేహం నిండా విభూతి పులుముకున్నాడు (బడుగుదేహము=బక్క శరీరం). ముందుకు పొడుచుకువచ్చి ఎత్తుగా ఉన్న వక్షస్థలంమీద (మిట్ట ఉరము) పొడవైన యోగపట్టె జందెంలా వేలాడుతోంది. చెవులకి రుద్రాక్షపోగులు చవుకళిస్తున్నాయి (ఊగిసలాడుతున్నాయి). కావిరంగు కుబుసాన్ని (పొడుగాటి కావిచొక్కా) ధరించాడు. కూర్పాసము= కుబుసము) జలకుండికను (కమండలువో తాబేటికాయలాంటిదో) పట్టుకున్నాడు. ఇలాంటి రూపంతో ఒక ఔషధ సిద్ధుడు వచ్చాడు.

వచ్చిన సిద్ధుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చిణ పిదప అతనితో ప్రవరుడు ఇలా అంటున్నాడు.

 

మీ మాటలు మంత్రంబులు

మీ మెట్టిన యెడ ప్రయాగ, మీ పాద పవి

త్రామల తోయము లలఘు

ద్యోమార్గ ఝరాంబు పౌనరుక్త్యములుర్విన్

 

స్వామీ! మీ మాటలే మంత్రాలు. మీరు కాలుపెట్టినచోటు ప్రయాగ (అంతటి పవిత్రస్థలం అని). మీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఆకాశగంగాజలానికి (ద్యోమార్గఝరి) భూమిమీద పునరుక్తులు. వాటికంటే రెట్టింపు పవిత్రమైనవి అని. లఘు అంటే చిన్న; అలఘు: చిన్నదికానిది, గొప్పది.

 

బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →