కెలకుల నున్న తంగెటి జున్ను గృహమేధి
యజమానుడంక స్థితార్ధ పేటి
పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు
దొడ్డి బెట్టిన వేల్పుగిడ్డి కాపు
కడలేని యమృతంపు నడబావి సంసారి
సవిధ మేరు నగంబు భవన భర్త
మరుదేశ పథ మధ్యమప్రప కులపతి
యాకటి కొదవు సస్యము కుటుంబి
బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి
జటి పరివ్రాజకాతిధి క్షపణ కావ
ధూత కాపాలికాద్యనాధులకు గాన
భూసురోత్తమ! గార్హస్త్యమునకు సరియె!
ఓ బ్రాహ్మణోత్తమా! ఆశ్రమాలు నాల్గింటిలోనూ గృహస్థాశ్రమమే (గార్హస్త్యము) గొప్పది. తక్కిన అన్ని ఆశ్రమాలవారికీ ఇదే ఆధారం. చెవిటి (బధిర), కుంటి (పంగు), గ్రుడ్డి (అంధ), భిక్షువులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు (జటి), సన్యాసులు (పరివ్రాజకులు), అతిథులు, బౌద్ధ భిక్షువులు (క్షపణకులు), దిగంబరులు (అవధూతలు), కాపాలికులు (శాక్తేయులు) మొదలైన అనాధులందరికీ గృహమేథి (యజమానుడు, వాస్తవ్యుడు, కాపు, సంసారి, భవన బర్త, కులపతి, కుటుంబి – ఇవిన్నీ పర్యాయపదాలు) దగ్గరలో ఉన్న తంగెటిజున్ను లాంటివాడు (చేతితో తీసుకోవచ్చునని) ఒడిలో ఉన్న ధనపేటిక (డబ్బుపెట్టి), పెరటిలో ఉండి పండిన కల్పవృక్షం, దొడ్డిలో కట్టేసుకున్న కామధేనువు (వేల్పుగిడ్డి) అంతులేని అమృతకూపం, అందుబాటులోఉన్న మేరుపర్వతం, ఎడారిదారిలో (మరుదేశపథం) చలివేంద్రం (ప్రప). ఆకలికి అమిరే పంట వంటి వాడు గృహస్థు అనేవాడు.
ఇంత గొప్పది గృహస్థాశ్రమం. గృహమేథిగా ఉంటూ నువ్వు సన్యాసుల్ని మమ్మల్ని పొగుడుతావేంటి, పిచ్చివాడా! అని సిద్ధుడి అభిప్రాయం.
ప్రవరుడు సిద్ధుడిని – స్వామీ మీరేమేమి దేశాలు తిరిగారు? ఏమేమి తీర్థాలు చూసారు? ఆయా చోటులగల వింతలూ విశేషాలూ నాకు చెప్పమని కోరగా, సిద్ధుడు అతనితో ఇలా అంటున్నాడు.
ఓ చతురాస్య వంశ కలశోదధి పూర్ణ శశాంక! తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు, పుణ్యనదీనదంబులున్
జూచితి నందు నందుఁగల జోద్యములున్ గనుఁగొంటి నాపటీ
రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్
చతురాస్యుడు – నాలుగు ముఖాలు కలవాడు = బ్రహ్మ. ఆ వంశం అనే క్షీరసముద్రం (కలశ + ఉదధి). ఆ సముద్రానికి పూర్ణచంద్రుని వంటి వాడా! అని ప్రవరుణ్ణి సంబోధించాడు. పున్నమిచందమామను చూస్తే సముద్రం ఉప్పొంగుతందిట. అలా ప్రవరుడు ఉదయించినందువల్ల అతడి వంశం సంతోషతరంగితమయ్యిందని. చంద్రుడు క్షీరసముద్రంనుంచి జన్మించాడని క్షీరసాగర మథనకథ. బ్రాహ్మణవంశం అనే క్షీరసముద్రం నుంచి ప్రవరుడు అనే పూర్ణ శశాంకుడు జన్మించాడు.
ఈ సుధీర్ఘ సంబోధన సిద్ధుడికి ప్రవరుడిపై కలిగిన ఆదరాతిశయాన్ని సూచిస్తుంది.
చణుడు అంటే నేర్పరి. వ్యాకరణ చణుడు అంటే వ్యాకరణంలో నేర్పరి – పండితుడు అని. మహాకవి శ్రీశ్రీ ఒకచోట “హింసనచణ ధ్వంస రచన” అన్నారు.
తీర్థాయత్రాచణుడంటే, తీర్థయాత్రలు చెయ్యడంలో నేర్పరితనం కలవాడు. అదే శీలంగా, అదే పనిగా, జనపదాలూ, పవిత్ర నదీ నదాలూ (తూర్పునకు ప్రవహించేవి నదులు, పశ్చిమానికి ప్రవహించేవి నదాలు) అన్నీ తిరిగాను. ఆయా చోట్లగల వింతలు (చోద్యాలు) చూశాను. తెలుసుకున్నాను. ఎంతదేశం తిరిగానంటే మలయాద్రి, పశ్చిమాద్రి, హిమాద్రి, పూర్వాద్రి సరిహద్దులుగా మధ్యలో ఉన్నదేశంలో అన్ని జనపదాలూ, అన్ని నదీ-నదాలూ దర్శించాను. పటీరం అంటే మంచిగంధం. దక్షిణదిక్కున మలయ పర్వతం ఉంది. దానిమీద మంచి గంధం చెట్ట్లు ఎక్కువగా ఉంటాయని కవుల వర్ణన. అందుకని మలయ పర్వతాన్ని పటీరాచలం అంటారు.
ఆకర్ణాంతం అంటే చెవిదాకా. ఆశాంతం. అలాగే ఆపటీరాచల, పశ్చిమాచల….అంటే ఆయా పర్వతాలచివరిదాకా అని.
కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
పదాంభోరుహముల్, ప్రయాగ నిలయుం బద్మాక్షు సేవించితిన్,
యాదోనాథసుతాకళత్రు బదరీ నారయణుం గంటి, నీ
యా దేశంబన నేల? చూచితి సమస్తాశావకాశంబులన్
కేదారేశ్వరుణ్ణి సేవించాను. హింగుళాదేవి పాదపద్మాలు శిరస్సున కీలించాను. శిరస్సు ఆన్చి నమస్కరించానని. ప్రయాగనిలయుడైన పద్మాక్షుణ్ణి భజించాను. బదరీనారాయణుడు – క్షీరసముద్రరాజతనయ యొక్క పతిని దర్శించాను. (యాదస్ = నీరు, యాదోనాథుడు = సముద్రుడు. యాదోనాథుని సుత = లక్ష్మీదేవి. లక్ష్మీదేవి కళత్రంగా – భార్యగా కలవాడు – విష్ణుమూర్తి).
బాలాంత్రపు వేంకట రమణ
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.