Loading...
You are here:  Home  >  Spiritual  >  Current Article

మను చరిత్రము కథ, పద్యాల సొగసులు (సంక్షిప్త పరిచయం )– 2nd Chapter

By   /  February 12, 2015  /  No Comments

    Print       Email

దారి తప్పినా మనస్సు దారి తప్పలేదు

 

InCorpTaxAct
Suvidha

హిమగిరిపై ప్రవరుడు అనేక రమ్యమైన స్థలాల్ని చూశాడు. ఎన్నో పవిత్రమైన ప్రదేశాలని చూశాడు. నరనారాయణులు తపస్సు చేసిన బదరీ వనాన్ని సందర్శించి పులకించిపోయాడు. భగీరధుడు తపస్సు చేసినచోటు, ఆకాశగంగ భువికి దిగిన చోటు, పార్వతి పరమేశ్వరునికి శుస్రూష చేసిన ప్రదేశము, మన్మధుడు శివుని మూడవ కంటిమంటచే బూడిదయిన జాలిగలిగించు ప్రదేశం, అగ్నిదేవుడు సప్తర్షుల కాంతలపై మోహం చెందిన ప్రాంతం, కుమారస్వామి జననం చెందిన ఱెల్లుదుబ్బులనూ మొదలైన ఎన్నో దివ్యమైన, మనోహరమైన ప్రదేశాలనీ, సుందరమైన లోయలనీ, గుహలనీ, సెలయేళ్ళనీ చూసి పరవశించిపోయాడు.   హిమాలయ పర్వత ప్రకృతి సౌందర్యం ప్రవరుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది.

ఆ అందాలకి ఎంత ముగ్ధుడైపోయినా, పరమ నిష్టాగరిష్టుడైన ప్రవరుడు, “నిత్యం అనుష్టించే కర్మకలాపాలకి వేళ దాటి పోతోంది. ఈ చోటులగల చోద్యాలని రేపు మళ్ళీవచ్చి ఆస్వాదిస్తాను” అనుకొని “ఇంటికి చేరాలి” అని సంకల్పించాడు. కానీ ప్రయోజనం కలగలేదు. తీరాచూస్తే ఏముంది, పాదాలకి పూసుకున్న పసరు మంచు వలన కఱిగిపోయింది! ప్రవరుడి గుండెలో రాయిపడినట్ట్లయింది. “అయ్యో! ఇక ఇక్కడి నుండి నాకు విముక్తి లేదు. నా జీవితం ఇక్కడే క్షుద్రమార్గంలో అంతమైపోతుంది కాబోలు. ఆ పసరు ప్రభావాన్ని పరిక్షించడానికి, నేను ఏ కాశీయో, గయో, కురుక్షేత్రమో, ప్రయాగో వెళ్ళకుండా, నరమానవులెవరూ అగుపించనిదీ, క్రూరమృగాలు విశేషంగా సంచరించేదీ అయిన ఈ మంచుకొండకే ఎందుకొచ్చాను? ఓ దైవమా, నా నిత్యానుష్టాలకి దూరంచేసి, తీసుకొచ్చి   ఇలా దూరంగా మిన్నులుపడ్డచోటున పడేశావు కదయ్యా!” అని పరిపరి విధాల చింతించాడు.

 

కొంతసేపటికి తేరుకొని “ఈ హిమగిరి మునీంద్రులకి నిలయం. నన్ను ఇల్లు చేర్చగల మహాత్ముడు ఒక్కడైనా ఇక్కడ కనిపించకపోడు” అని ధైర్యం తెచ్చుకొని ముందుకి సాగాడు. కొంతదూరం వెళ్ళగా, అతని చెవులకు ఒక గానం వినిపించింది. వెంటనే అతని హృదయంలో ఒక అశాజ్యోతి వెలిగి నట్లయింది. “అక్కడేదో ముని ఆశ్రమం ఉన్నట్లుంది, ఇక నేను రక్షింపబడతాను” అనుకుంటూ ఆ సంగీతం వినవచ్చిన దిక్కుగా త్వర త్వరగా వెళ్ళాడు. అక్కడ మధురంగా పాడుతూ, వీణ వాయిస్తూఉన్న ఒక అధ్భుతమైన సౌందర్యవతి అతనికి కనిపించింది.

ప్రవరుడు ఆమెను సమీపించి “ఓ సుందరీ, తోడు లేకుండా ఒంటరిగా చరిస్తున్న నీవు యెవతెవు? నేను బ్రాహ్మణ్ణి. నన్ను ప్రవరుడంటారు. దారి తప్పి ఉన్నాను. నా ఊరు చేరేమార్గం చెప్పి పుణ్యం కట్టుకో, నీకు శుభమౌతుంది” అన్నాడు.

అతను తనని సమీపిస్తూండగానే అతనిని గమనించి, అతని రూపలావణ్య తేజోవిలాసాలకి ముగ్ధురాలై ,అతని మీద మనసు తగులుకొన్న   ఆ గంధర్వాంగనకి, ప్రవరుడి అమాయక పలుకులు విని నవ్వు వచ్చింది. అతనితో ఇలా అంది. “చెంపకి చారడేసి కన్నులు పెట్టుకొని, దారి ఎవరినయ్యా అడుగుతున్నావు? ఒంటరిగా ఉన్న జవరాల్ని పలకరించే నీ దుందుడుకుతనం ఇకచాలు. నువ్వు వచ్చిన త్రోవ ఇంతలోనే మర్చిపోయావా. ఇంకమాటలేమిటికి?

 

“నా పేరు వరూధిని. గంధర్వకాంతని. రంభ, తిలోత్తమ, ఘృతాచి, హరిణి, హేమ మొదలైన అప్సరసశిరోమణులు నాకు ప్రాణసఖులు.

 

“ఓ అపరమన్మధాకారా! నీ మేను ఎండతాపానికి ఎంత కందిపోయిందో చూడు. ముద్దులొలికే నీమోము వాడిపోయింది. నా ఆతిధ్యాన్ని స్వీకరించి, నా ఇంట విశ్రమించి, బడలిక తీరినతరువాత వెళుదువుగానిలే. తొందరేమీ లేదు” అంది.

 

అతని మీద ఎంతో మోహితచిత్త అయిన వరూధిని, తన మనోభావాన్నంతటినీ ఈ మాటల్లో వెల్లడించాననుకుంది. కానీ ఆ వైదిక బ్రాహ్మణుడికి ఇలాటి అర్థాలే తెలియవు. అతని హృదయ దర్పణం అమూల్యమైనది. నిరుపమానమైనది. అది ఉన్న రూపాన్ని ఉన్నట్టే గ్రహిస్తుంది.

 

అతను తనలో “ఆహా! ఈ పడుచు పాపం మర్యాద తెలిసినది. బ్రాహ్మణులయందు, అతిథులయందు భక్తి శ్రద్ధలుగల ఆస్తికురాలు” అనుకున్నాడు. వరూధిని తనని చూడగానే తత్తరపాటుతో లేవడం, ఆమె ఒళ్ళంతా కంపించడం, ఓరచూపులూ, మోహన్ని ప్రకటించే హావ భావ చేష్టలు అవేమీ అతనికి పట్టలేదు. అవన్నీ పర పురుషుల్ని చూసినప్పుడు స్త్రీలకి కలిగే సహజసిద్ధమైన లజ్జాచేష్టలనుకున్నాడు.

 

అతను ఆమెతో “రమణీలలామా! నువ్వు చూపించిన ఆదరణే చాలు.   అగ్నిహోత్రాదికములైన కర్మకాండము నెరవేర్చవలచిన సమయం సమీపించింది. వేళ అతిక్రమించిపోతోంది. మీ గంధర్వులకి అసాధ్యమైనది ఏదీ లేదు. త్వరగా నన్ను నా ఊరు చేర్చు” అన్నాడు.

వరూధిని చిఱునవ్వునవ్వి “ఓయి వెఱ్రిబ్రాహ్మడా! ఊరో, ఊరో అంటావు, నీ ఊరెక్కడికి పోతుంది? ఇంతలో నీ ఇల్లెక్కడికి పోతుంది? ఈ మణిమయాలైన గుహలూ, చక్కటి ఈ ఉద్యానవనాల్లోని మంచి గంధపుచెట్ట్లూ, ఇక్కడి గంగానదిఒడ్డున ఉన్న ఇసుకతిన్నెలూ, వెన్నెలతీగల పొదరిళ్ళూ, ఇవేవీ నీ కుటీరానికి సరితూగవా? ఇంక చల్లకి వచ్చి ముంత దాచడం ఎందుకు? నీ మీద నాకు పట్టరానంత మోహం కలిగంది. మదనుడు నన్ను నీకు కన్యాదానం చేశాడు. నన్నేలుకొని ఈ స్వర్గసుఖాలన్నిటినీ అనుభవించు” అని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేసింది.

 

అగ్నిహోత్రుడిలాగ పవిత్రమైనవాడు, పరమ నిష్టాగరిష్టుడు, సచ్ఛీలుడు అయిన ప్రవరుడు, ఆమె పలుకులు విని నిశ్చేష్టుడైపోయాడు. అతని గుండె గుభిల్లుమంది. “అయ్యో! ఇదెక్కడికర్మరా!” అనుకొని, ఆమెతో “కాంతా! నీవు వెఱ్రిదానివి. వ్రతినై కర్మకాండలతో దినాల్ని గడిపే నన్ను ఏమని కామించావు? సంగతి సందర్భాలు, ఎదుటివారి మానమర్యాదలూ అవీ గమనించనక్కఱలేదా? నాకిలాటివేవీ తెలియవు. అగ్నిహోత్రానికీ, దేవతార్చనకీ వేళ అతిక్రమించిపోతోంది. నా తలిదండ్రులు వృద్ధులు. ఆకలితో ననకలాడుతూ నారాకకోసం ఎదురుచూస్తూఉంటారు. నేను సమయానికి ఇల్లు చేరకపోతే సమస్తధర్మాలూ చెడిపోతాయి. ఇక నా ఎదుట నీ పిచ్చి కలాపాలు కట్టిపెట్టి, చేతనైతే ఇల్లుచేరడానికి నాకు సాయం చెయ్యి” అని తన ధృడనిశ్చయాన్ని తెలియజేసాడు.

 

ఊహించని, ఎదురుచూడని ఈ నిరాదరణకి వరూధిని హృదయం నీరుకారిపోయింది. ఎందరో యక్ష గంధర్వ కిన్నెర కింపురుష యువసుందరులు ఆమె కడకంటిచూపుకోసం పరితపించడమే ఆమెకి తెలుసు, కానీ ఈ సాధారణ మనవుడి నిరాకరణ ఆమెకి మింగుడుపడలేదు.   అంతవరకూ ఉన్న గుండెధైర్యం తొలగిపోయింది. అయినా తేరుకొని ఎన్నోవిధాలుగా తన పాండిత్యమంతా ఉపయోగించి, హొయళ్ళూ, టక్కులూ ప్రదర్శించి, ఎన్నో ప్రలోభాలుచూపించి అతన్ని వశపరచుకోవాలని ప్రయత్నించింది.

 

“మీ మానవులు అన్ని ఆపసోపాలూ, అష్టకష్టాలూ పడి తపస్సులూ, యఙ్ఞాలూ అవీ చేసేది స్వర్గసుఖాలనీ, మాలాటి అప్సరసల సంభోగాలనీ అనుభవించడానికేగదా! అయాచితంగా నా అంతటనేను నీకు లభిస్తూ ఉంటే కాదంటావేమిటి? గంధర్వాంగనల పొందుకాదని సంసారకూపంలో పడతానంటావేమిటి?” అంది.

 

“నీ యందు మరులుగొని, మన్మధబాధతో హింసపడుతున్నాను. ఆ పాపం నీకు చుట్టుకుంటుంది” అని బెదిరించింది.

“ఓ దయారహితుడవైన బ్రాహ్మణుడా, ఎందుకు చెడతావు? హృదయం దేనిమీద లగ్నం ఔతుందో, ఇంద్రియాలు దేనివల్ల సుఖిస్తాయో, అదే పరబ్రహ్మము. అదే ఆనందోబ్రహ్మ. దాన్ని ఊహించుకో!” అని మెట్టవేదాంతం బోధించబోయింది.

 

ఇలా వరూధిని శతవిధాలా ప్రయత్నించినా, ప్రవరుడు చలించలేదు. బ్రహ్మవాదుల ఐహిక ఇచ్చలపట్ల వైముఖ్యాన్నీ, వైదిక కర్మలయొక్క ధర్మపరత్వాన్నీ, బ్రహ్మవర్చస్సుయొక్క ప్రభవాన్నీ వివరించాడు. వాటిముందు నువ్వు చెప్పిన సుఖాలన్నీ తుచ్ఛమైనవి అన్నాడు. నాకు నా ఆరణులు, అగ్నులూ, ధర్మకర్మలూ ముఖ్యమైనవి అన్నాడు.

 

అయినాసరే వరూధిని వదలకుండా అతనిమీదపడి కౌగలించుకోడానికి ప్రయత్నించింది. ప్రవరుడు “హరి, హరీ” అని ‘పో’ అంటూ ఆమెను త్రోసివేసాడు. ఆమె పరాభవంతో సిగ్గుపడి, ఆ వెంటనే మితిమీరిన దుఃఖంతో “దయలేనివాడా, ఇలా మోటుగా గెంటేస్తే సౌకుమార్యులైన ఇంతులు తట్టుకోగలరా? చూడు నీగోరు ఎలాగీసుకుపోయిందో” అంటూ చనుకట్టు చూపి, అవ్యక్తమధురంగా ఏడ్చింది.

 

“ఓ సుందరాకారా, పరాశరుడు దాసకన్యతో క్రీడించలేదా? అతన్ని మీ బ్రాహ్మణులు వెలివేసారా? మేనకతో చుట్టరికం సాగించిన విశ్వామిత్రుడికి కులంలో వన్నెతక్కువయిందా? అప్సరసా మేళంతో భోగించినందుకు, మాందకర్ణి తన మహిమని కోల్పోయాడా?   అహల్యాజారుడైన ఇంద్రుణ్ణి దేవతలు స్వర్గలోకాన్ని ఏలనీయం అన్నారా? వారందరికన్నా నువ్వు గొప్పవాడివా? ఇనుపకచ్చడాలు కట్టుకున్న మునిమ్రుచ్చులందరూ మా తామరసనేత్రల ఇండ్ల బందాలు కారా?” అని ప్రశ్నించింది.

 

పరమపవిత్రుడైన ప్రవరుడు ఆ మాటలకి బదులైనా ఇవ్వకుండా, ఆమె తనపైబడినప్పుడు తనవంటికి అంటుకున్న జవ్వాది మొదలైన సుగంధద్రవ్యాల్ని కడుక్కొని, శుచియై, అగ్నిహోత్రుణ్ణి ఇలా ప్రార్థించాడు.

 

“ఓ హవ్యవాహనా! వహ్నిదేవుడా! దాన-జప-అగ్నిహోత్రములయందు నేను పరతంత్రుడనైతే,   ఎల్లప్పుడూ త్రికరణశుద్ధిగా నీ యొక్క పాదపద్మాల ధ్యానమందే నేను భక్తిగలవాడనైతే, ఇతరులయొక్క భార్య-ధనాదులను నేను ఎన్నడూ కోరనివాడనైతే, నన్ను సగౌరవంగా, సూర్యుడు పశ్చిమాద్రిని క్రుంకకముందు ఇంటికి చేర్చు, తండ్రీ!” అని ప్రార్థించాడు.

 

ప్రవరుడలా ప్రార్థించగానే, అగ్నిదేవుడతని దేహంలో ఆవహించి, అతనికి అమితమైన తేజోబలాల్ని కలిగించాడు. అంతట అధ్భుతంగా ప్రవరుడు వాయువేగమనోవేగాలతో తన ఇల్లు చేరి, తన నిత్యకర్మలని సక్రమంగా నిర్వర్తించుకుంటూ జీవనం సాగించాడు.

 

ఔరా! ప్రవరా! సర్వసంగపరిత్యాగులైన మహామునీశ్వరులు కూడా సాధించలేని ఇంద్రియనిగ్రహాన్ని మామూలు సంసారివి అయిఉండీకూడా సాధించి “భళా” అనిపించుకున్నావు!

 

 

(భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం:-

 

వనదళవాతముల్ మెసవువారు పరాశర కౌశికాదు, లా

ఘనులును సుందరీజనులఁ గన్గొని మోహితచిత్తులైరి; హె

చ్చిన ఘృత పాయసాన్నము భుజించెడి వారలన్ మనోజయం

బు నెగడునేని వింధ్యము సముద్రజలంబులఁ దేలి యాడదే?

 

 

 

 

 

 

 

నీరు-ఆకులు-గాలి భుజించే పరాశరుడు, విశ్వామితుడు మొదలైన మహానుభావులు కూడా ఆడవారిని చూచి మోహము పొందారు. నెయ్యి, పాలు, అన్నము ఎక్కువుగా తినే సాధారణమైన మనుష్యులకు మనోనిగ్రహం కలిగితే, వింధ్యపర్వతం సముద్రజలాల్లో   తేలియాడదా?)

– బాలాంత్రపు వేంకట రమణ

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

AMANA – Andhra Pradesh Muslim Association of North America

Read More →