శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం: టాంటెక్స్ “నెల నెలా తెలుగు వెన్నెల” వేదికపై ప్రముఖుల విశ్లేషణ
డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్:
ప్రతి నెల తెలుగు సాహిత్య సేవలో భాగంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 91 వ కార్యక్రమం ఆదివారం ఫిబ్రవరి 15, 2015 ఇర్వింగ్ నగరంలోని దేశి ప్లాజా స్టూడియో లో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల అకస్మాత్తుగా పరమపదించిన డాలస్ వాస్తవ్యులు శ్రీమతి పూసర్ల ఉషారాణి ఆత్మకు శాంతి చేకూరాలని సభ నిమిషముపాటు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు. టెక్సస్ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా “నెల నెలా తెలుగు వెన్నల” కార్యక్రమం అంతర్జాలం ద్వారా దేశి ప్లాజా (డి.పి. టీవి) వారి సహకారంతో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఒక్క డాలస్ నగరంలో మాత్రమే కాకుండా, టెక్సస్ రాష్ట్రం, ఇంకా ప్రపంచ నలు మూలల నుండి విశేష సంఖ్యలో తెలుగు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూడడం చెప్పుకోదగ్గ విశేషం. వివరాలలోకి వెళితే సాంప్రదాయ బద్ధమైన ప్రార్ధన గీతం “చిన్నారి పాపాయి”తో డాలస్ చిన్నారులు బిల్లా శ్రేయ, తెలకల పల్లి శ్రియ , సుంకిరెడ్డి అవని , వడ్లమన్నాటి శ్వేత , తోటకూర ప్రీతిక్ , వాసకర్ల శ్రియ మధురంగా గానం చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. తదుపరి శ్రీ అంపశయ్య నవీన్ రచించిన “అంపశయ్య ” అనే పుస్తకము గురించి బసాబత్తిన శ్రీనివాసులు వివరిస్తూ, ఆ పుస్తకం నవీన్ గారి ఇంటి పేరులా మారడాన్ని ప్రస్తావించారు. వేల సంవత్సరాల క్రితం సంస్కృతం లో భరతముని వారు రచించిన “నాట్యశాస్త్రం” పుస్తకాన్ని శ్రీ పోనంగి శ్రీరామ అప్పారావు తెనిగించిన విషయాలను, అప్పటి భారత ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా వారు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొనడం గురించి శ్రీమతి కలవగుంట సుధ ఆహుతులకు వివరించారు. ఆ తరువాత సాహిత్య వేదిక బృంద సభ్యురాలు సింగిరెడ్డి శారద ఒక చక్కటి స్వీయ కవితను చదివి వినిపించారు. అటు పిమ్మట దొంతి శోభారాణి గారు “నిగమ నిగమాంత వర్ణిత” అనే ఒక అన్నమాచార్య కీర్తన పాడి ఆహ్వానితులకు వినిపించారు. వచన కవిత్వం గురించి ప్రస్తావిస్తూ శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన “అమృతం కురిసిన రాత్రి “, మహాకవి శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం నుండి కొన్ని ప్రముఖ పద్యాలను జలసూత్రం చంద్రశేఖర్ తన చక్కటి వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ చదివి ఆహ్వానితులను ఆనంద పరిచారు.
అటు పిమ్మట, సభకు శ్రీమతి పూర్ణ నెహ్రు గారు ఈనాటి ముఖ్య అతిథి ప్రభల శ్రీనివాస్ గారి సంగీతం, సాహిత్యం మరియు నాటక రంగాలలో వున్న ప్రతిభను తెలుపుతూ, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి పరిచయం చేస్తూ వేదిక పైకి ఆహ్వానించగా , శ్రీమతి జుజారే రాజేశ్వరి పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు. సంగీతానికి సాహిత్యానికి విడదీయలేని సంబంధం ఉందనేది జగమెరిగిన సత్యం, అయితే సాహిత్యం వెంట సంగీతం పరుగిడుతుందా? లేక సంగీతపు నది మలుపుల్లో సాహిత్యం సేద తీరుతుందా? అనే విషయం కూలంకషంగా చర్చించి ఆహుతులచేత జయ జయ ధ్వానాలు అందుకొన్నారు ముఖ్య అతిధి శ్రీ ప్రభల శ్రీనివాస్. ముఖ్య అతిధి శ్రీ ప్రభల శ్రీనివాస్ తమకే సొంత మైన అద్భుత గాత్రంతో, త్యాగరాజు- అన్నమయ్యలే దిగివచ్చారా అన్నంత రీతిలో కీర్తనలు గానం చేసారు. మొదటగా పొన్నై పిళ్ళై గారు రాసిన “రంగ నాథుడే , అంతా రంగ నాథుడే , అంత రంగ నాథుడే” అనే కీర్తనతో కార్యక్రమం ప్రారంభించారు. అందులో ఉండే పదాల గమ్మత్తు “అంతా “, “అంతః” అనే మాటలను అరవ కవి అయినా ఎంత చక్కగా ఉపయోగించు కొన్నారు , తెలుగు భాషపై తమిళల, మలయాళీ, కన్నడ ప్రజలకు ఎంత ప్రేమ ఉందో సోదాహరణముగ వివరించారు. మన అన్నమయ్య , త్యాగరాజు కృతులు వారు నిత్యం గానం చేస్తారని వారికి వందనాలు అర్పించారు. త్యాగరాజు గారి గురించి మాట్లాడక పోతే శాస్త్రీయ సంగీతం గురించి మాట్లాడడం అసంపూర్తి గా ఉంటుంది , ఆయన చేయని ప్రయోగం లేదు, కొన్ని లక్షల శిష్య కోటిని తయారు చేసారు , ప్రతిఫలాక్ష లేకుండా , తన సొంత ఇంటిలో భోజనం పెట్టి , సంగీత వరాలను నేటి తరాలకు పంచారు అని ప్రస్తుతించారు. ఆయన రచించిన “గంధము పుయ్యరుగా “అనే పాటను ఆహుతులందరి చేతా పాడించారు. ఈ రోజుల్లో కూడా స్వరాల మీద , కొత్త కొత్త రాగల మీద ప్రయోగాలు చేసిన గొప్ప సంగీత విద్వాంసుడు శ్రీ మంగళంపల్లి బాల మురళి కృష్ణ గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారితో కలిసి గొంతు కలపడానికి ఎంతో ఉత్సాహము చూపించారు. ఈ కార్యక్రమం ఒక ప్రసంగంలా కాకుండా, సాహిత్యపు కొలనుల్లో సంగీత లాహిరి గా సాగిపోవడం ఎంతైనా చెప్పుకోదగిన విశేషం.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి , ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా ముఖ్య అతిధి శ్రీ ప్రభల శ్రీనివాస్ గారిని దుశ్శాలువతో, సమన్వయ కర్త దండ వెంకట్ మరియు సాహిత్య వేదిక బృందం జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త దండ వెంకట్ మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. సంస్థ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి , సoయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Sharada Singireddy
Chair Special Events &Chair – Media & Public Relations,
TANTEX – 2015
Telugu Association of North Texas
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.