‘శ్రీరామ హృదయం’ అనే విషయం మహర్షి వేదవ్యాసకృత బ్రహ్మాండపురాణ మందలి ఉత్తరఖాండంలోని ” అధ్యాత్మ రామాయణం” లో ప్రస్తావించబడ్డది. రావణవధానంతరం అయోధ్యాపురిలో శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక సమయంలో సాకేత రాముని ఆదేశం మేరకు సీతమ్మ తల్లి హనుమకు శ్రీరామావతార తత్త్వాన్ని ఉపదేశిస్తుంది. అదియె ‘ శ్రీరామహృదయం’ గా చెప్పబడుచున్నది.
దృష్ట్యా తదా హనుమంతం ప్రాజలిం పురతః స్థితం|
కృతకార్యం నిరాకాంక్షం జ్ఞానాపేక్షం మహామతిం||
రామః సీతామువాచేదమ్ బ్రూహి తత్త్వం హనుమతే|
నిష్కల్మషో2యం జ్ఞానస్య పాత్రం నౌ నిత్యభక్తిమాన్||
సమస్త కార్యములను నెరవేర్చినవాడు, ఏ విధమైన కోర్కెలులేని వాడు, మహాబుద్ధిశాలి యగు హనుమంతుడు సీతారాములయందు చేతులు జోడించి యుండగా శ్రీరాముడు సీతతో ఈ రకంగా పలికాడు, ” సీతా! ఈ హనుమ మన ఇద్దరి యెడల అచంచల భక్తి కలవాడు, పాపరహితుడు, జ్ఞానం పొందడానికి అర్హుడు అందువల్లనీవు ఈతనికి నాతత్త్వం ఉపదేశింపమని ఆదేశించగా, సీతామాత ఈ విధంగా చెప్పనారంభించినది.
“నాయనా! హనుమా! శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తూ అద్వితీయ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమని, ఏ ఉపాధిలేని వాడని, సత్య స్వరూపుడని. ఇంద్రియములకు మనస్సుకు గోచరింపని వాడని, రాగదోషాదిరహితుడని, నిర్మలుడని, శాంతమూర్తియని తెలుసుకో. ఈ విషయంలో యెట్టిసందేహములేదు. అదే విధంగా నన్ను సృష్టి, స్థితి, లయా, తిరోధాన, అనుగ్రహాది పంచకృత్యములు నిర్వర్తించు మూల ప్రకృతి స్వరూపిణిగా తెలుసుకో. నేను శ్రీరామచంద్ర ప్రభువునకు వశవర్తినై ఆయన ఆదేశానుసారం ఈ విశ్వకార్యాన్ని రచించుచున్నాను. అయినప్పటికీ ఈయనసాన్నిధ్యాన నా వల్ల చేయబడ్డ సృష్టిని బుద్ధిహీనులు అదంతయు ఈయన యందు ఆరోపించుచున్నారు. రామావతార పర్యంతము, స్వామి అయోధ్యాపురంలో అతిపవిత్రమగు రఘువంశమున జన్మించినది మొదలు రాజ్యాభిశిక్తుడగు వరకు జరిగిన సమస్త కర్మలు నా చేత చేయబడ్డాయి. అయినప్పటికిని అజ్ఞానులయిన ఈ జనులు వీటికంతటికీ నిర్వికారుడు, సర్వాత్మకుడు భగవానుడు అయిన శ్రీరామచంద్రుని కారణముగా భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.