Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

శ్రీ తిలక్ కవితలు కొన్ని

By   /  March 8, 2016  /  Comments Off on శ్రీ తిలక్ కవితలు కొన్ని

    Print       Email

శ్రీ తిలక్ కవితలు కొన్ని
devarakonda
శ్రీ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ తెలుగు సాహిత్యంలో ఒక ధ్రువ తార.అతను  చేపట్టని సాహితీ ప్రక్రియే లేదు.కధలు,గేయ నాటికలు ,కవితలు.ఇలా ఎన్నో ప్రక్రియలను చేపట్టిన ‘కవితిలకం’ వీరు.వీరు వ్రాసిన’అమృతం కురిసిన రాత్రి’ కి తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక  స్థానం ఉంది.అతి చిన్న వయసులోనే వీరు మరణించారు.వీరు వ్రాసిన కథ ‘నల్లజర్ల రోడ్’దాదాపుగా భారతీయ భాషలన్నింటిలోకీ అనువదించబడ్డది. వీరి ‘అమృతం కురిసిన రాత్రి’ ,వారి మరణానంతరం కేంద్ర సాహిత్య అకాడెమీ
వారి పురస్కారంపొందింది.ఆ మహనీయునికి నివాళి సమర్పించుకుంటూ,వారి కవితలు కొన్నింటిని మీకోసం ఈ క్రిందనే పొందు పరుస్తున్నాను.చదివి ఆస్వాదించండి.ఆలోచించండి!

అమృతం కురిసిన రాత్రి

InCorpTaxAct
Suvidha

******************

అమృతంకురిసిన రాత్రి 
అందరూ నిద్రపోతున్నారు
 
నేను మాత్రం
తలుపు తెరచి యిల్లు విడచి 
ఎక్కడికో దూరంగా
కొండదాటి కోన దాటి 
వెన్నెల మైదానంలోకి
వెళ్లి నిలుచున్నాను
 
ఆకాశం మీద అప్సరసలు 
ఒయ్యారంగా పరుగులెత్తుతున్నారు
వారి తారా మంజీరాలు
ఘల్లు ఘల్లని మ్రోగుతున్నాయి
వారి ధమ్మిల్లాల పారిజాతాలు
గుత్తులు గుత్తులై వేలాడుతున్నాయి
వారు పృధు వక్షోజ నితంబ భారాలై
యౌవన ధనస్సులా వంగిపోతున్నారు
నన్ను చూసి కిలకిల నవ్వి యిలా అన్నారు
చూడు వీడు
అందమైనవాడు
ఆనందం మనిషైన వాడు
కలలు  పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
యెర్రని పెదవుల మీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించటం తెలిసినవాడు
నవనవాలైన ఊహా వర్ణార్ణ వాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు నరుడు మనకి వరుడు
జలజలమని కురిసింది వాన
జాల్వారింది అమృతంపుసోన
*******************************
సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు
అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు
చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..
********************************
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
 *****

ఈ రాత్రి

*****
ఈ రాత్రి సామిదగ్ధమయింది
ఈ ధాత్రి నిస్తబ్ధమై ఉంది
హేమగాత్రి! నీ చరణమంజీరం
నిస్వనింపదు!
నా లోపల ఆశామందారం
కిసలయింపదు!

గాలిలేనిప్రకృతి యోగిలాగ రోగిలాగ
మూల్గుతోంది
కాలువిరిగిన ముసలికుక్క దీనంగా
మొరుగుతోంది
తరతరాల నిస్పృహ నన్నావరించుకొంది
చరచరాలు తాకిన నీమూర్తి ముడుచుకొంది
యుద్ధం మీద యుద్ధం వచ్చినా
మనిషి గుండె పగలలేదు
మనిషి మీద మనిషి చచ్చినా
కన్నుతుదల జాలిలేదు
నాగరికత మైలవడిన దుప్పటిలా
నన్నౌ కప్పుకుంది
నాకందని ఏదో రహస్యం నన్ను
వశం చేసుకుంది

పాముకోర డేగరెక్క యీ కాలానికి చిహ్నం
పూలతేనె నెమలిరెక్క ఒక మిధ్యా ప్రమాణం
నా ప్రవృత్తి పసుపువన్నెల పెద్దపులిలా
పరచుకొంది
ఏదో విపత్ దూరంగా మబ్బులలో
దాగి ఉంది!

ఈ రాత్రి సామిదగ్ధమయింది
ఈ ధాత్రి నిస్తబ్ధమై ఉంది
హేమగాత్రి! నీ చరణమంజీరం
నిస్వనింపదు!
నా లోపల ఆశామందారం
కిసలయింపదు!

గుండెకింద నవ్వు

*** 
చేతిలో కలం అలాగే నిలిచిపోయింది

చివరలేని ఆలోచన సాగిపోయింది

ఏదో రహస్యం నన్నావరించుకుంది

అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

పడుతూలేస్తూ పరుగులిడే మహాప్రజ

పిలుస్తూ బెదురుతూపోయే కన్ను గవ

కాలి సంకెలల ఘలంఘల వినబడే రొద

ఏమీ తోచక భయంతో కళ్ళు మూశాను

అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

ఆకు ఆకునీ రాల్చింది కడిమి చెట్టు

రేకు రేకునీ తొడిగింది మొగలు మొక్క

రెప్ప రెప్పనీ తడిపింది కన్నీటి చుక్క

యెందుకో యీ ప్రాణిప్రాణికీ విభేదం

ఎరగని నా మనస్సు నాలోనే చెదిరింది.

అప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

వెళ్ళిపోయే చీకటిని వదలలేక వదిలే తార

వదిలిపోయే జీవితాన్ని వీడలేక వీడిపోయే లోకం

కాలుజారి పడిన కాలపు పాడు నుయ్యిలో కనబడిన శూన్యం

కాలు కదిపిన చలువరాల సౌధంలో వినబడిన గానం

ఏమిటని ప్రశ్నిస్తే ఏమో అని పలికిన నిశ్శబ్దం

అపుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

ఆకాశపు వొంపులోన ఆర్ద్రం వెనుక నీ నవ్వు

పాతాళం లోతులలో ప్రతిధ్వనించి సాగింది

అంధకారపు సముద్రానికి అవతల వొడ్డున నీ రూపం

అందుకోలేని నా చూపుకి ఆశ ఆశగా సోకింది.

రా! ప్రశ్నించే నా మనస్సులో నీ చల్లని చేతితో నిమురుకో

రా! నా కను రెప్పమాటుగా నీ మెరుపు వీణ మెల్లగా మీటుకో

కమ్ముకుంది నాలో భయంతో కలసిన ధైర్యం

ప్రవహించింది నాలో తీరంలేని రజిత నదం

ఇప్పుడే ఇప్పుడే నీ నవ్వు నా గుండె కింద వినబడింది.

నా భరత ధాత్రి 
మూడు సముద్రాల కెరట కెరటాల నీలాల
మోహన వస్త్రం దొలిచి
మౌళి మీద హిమసుందర కిరీటం ధరించిన
రాజ్ఞి నా భరత ధాత్రి అనుకోవటం ఒక నిజం!
అదొక సుఖం.
మూడు సముద్రాలు  మూసిన కోసిన తీరంతో 
ముగ్గు బుట్టలాంటి తలమీద కొండంత బరువుతో
మూల్గుతున్న ముసలిది నా తల్లి అనుకోవడం
మరో నిజం అదో దు:ఖం 
ఇదీ నిజం అదీనిజం
రెండిటింటికీ ఋజువులు సమం 
శ్రీ రాముడి శ్రీ కృష్ణుడి జన్మభూమి మరి
కంసునికి దశకంఠునికీ కాదా?
మన సంస్కృతి
*******
మన సంస్కృతి నశించిపోతూందన్న
మన పెద్దల విచారానికిమనవాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడనేది ఆధారం

మనగలిగినదీ

కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు

మరణించిన అవ్వ నగలు

మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు

యుగయుగానికీ స్వభావం మారుతుంది

అగుపించని ప్రభావానికి లొంగుతుంది

అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకున్నట్లు ఊహించకు

సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు

మాధుర్యం, సౌందర్యం, కవితా

మాధ్వీక చషకంలో రంగరించి పంచిపెట్టిన

ప్రాచేతస కాళిదాస కవిసమ్రాటులనీ

ఊహా వ్యూహోత్కర భేదనచణ

ఉపనిషదర్ధ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ

పోగొట్టుకునే బుద్ధిహీనుడెవరు?

ఎటొచ్చీ

విధవలకీ వ్యాకరణానికీ మనుశిక్షాస్మృతికీ గౌరవంలేదని

వీరికి లోపల దిగులు

వర్తమానావర్త ఝంఝావీచికలికి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?

అందరూ లోకంలో శప్తులూ పాపులూ

మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక

సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ

కేవలం వీరికే తమ వోటిచ్చినట్లు వీరి అహమిక

ఇది కూపస్థమండూకోపనిషత్తు

ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు

మనవేషం , మన భాషా , మన సంస్కృతీ

ఆదినుండీ , ద్రవిడ బర్బర యవన తురుష్క హూణులనుండీ,

ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా ఉన్నదనీ

అయిదు ఖండాల మానవ సంస్కృతి

అఖండ వసుధైక రూపాన్ని ధరిస్తోందనీ,

భవిష్యత్ సింహద్వారం

తెరుస్తోందనీ,

గ్రహించలేరు పాపం వీరు

ఆలోచించలేని మంచివాళ్ళు

ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు

నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సింధువు.

(సేకరణ)

టీవీయస్.శాస్త్రి

TVS SASTRY
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →