శ్రుతిప్రమాణాభివినాశితా చ సా
కథం భవిష్యత్యపి కార్యకారిణీ |
విజ్ఞానమాత్రాదమలాద్వితీయత –
స్తస్మాదవిద్యా న పునర్భవిష్యతి||
శ్రుతి ప్రమాణములచే నశింపబడిన మీదట అవిద్య మరల కార్యమును చేయుటకు ఏ విధముగ సమర్థమగును? ఇది అసంభవము. ఏలననగా పరమార్థతత్త్వము ఏకమాత్రమగు జ్ఞానస్వరూపము. అది నిర్మలమైనది, అద్వితీయమైనది. కావున బోధ కలిగిన పిదప మరల అవిద్య ఉత్పన్నము కానేకాదు.
అవిద్య ఒకసారి నాశనమైన వెనుక మరల పుట్టదు అని చెప్పినప్పుడు, నేను ఈ కార్యమునకు కర్తను అన్న బుద్ది ఎటుల కలుగును? కావున, జ్ఞానము స్వతంత్రమైనది. అది దేనినీ అపేక్షించదు. జీవులకు మోక్షము నిచ్చుటకు విద్య ఒక్కటే అద్వితీయమై ప్రకాశించును. అనగా మోక్షమునిచ్చుటలో అది ఒక్కటే సమర్థమైనదని అభిప్రాయము.
సా తైత్తిరీయశ్రుతిరాహ సాదరం
న్యాసం ప్రశస్తాఖిలకర్మణాం స్ఫుటం
ఏతావదిత్యాహ చ వాజినాం శ్రుతిర్
జ్ఞానం విమోక్షాయ న కర్మసాధనం|
అదియునుగాక, తైత్తిరీయశాఖయొక్క ప్రసిద్ధ శ్రుతి వాక్యము(న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్త్వ మానశుః)నందు కూడా సమస్త కర్మలను త్యజించుటయే మంచిదని వక్కాణించబడినది. అటులే వాజసనేయ శ్రుతి (ఏతావదరే ఖల్వమృతత్వం) కూడ మోక్షమునకు జ్ఞానమే తప్ప కర్మసాధనము కాదని చెప్పుచున్నది.
నీవు(సముచ్చయవాది) జ్ఞానముతో సమానమైనదని యజ్ఞాదుల దృష్టాంతము నిచ్చితివి, అది సరికాదు. ఏలయన, రెండిటి ఫలములు భిన్నభిన్నములు. యజ్ఞము( హోత, ఋత్విజుడు, ఉద్గాత,యజమాని మొదలగు) బహుళ కారకములతో సిద్ధించునది. జ్ఞానము ఇందులకు భిన్నమైనది.అది కారకాదులతో అపేక్షలేనిది.
కర్మత్యాగము చేసిన నేను ప్రాయశ్చిత్తము చేసికొనవలెను అన్న అనాత్మబుద్ధి అజ్ఞానులకు మాత్రమే కలుగును అనుట ప్రసిద్ధము. కాని, అది తత్త్వజ్ఞానులకు కలుగదు. ఈ విధముగ వికారరహితమగు చిత్తము కలిగి బోధము నందియున్న పురుషుడు అనగా ముముక్షువు విహితకర్మల సైతము విధిపూర్వకముగా పరిత్యజించవలెను.
పిమ్మట, శుద్ధచిత్తుడై శ్రద్ధాపూర్వకముగా గురుని కృపవలన “తత్త్వమసి” అను మహా వాక్యానుసారము ఆత్మ పరమాత్మల ఏకత్వమును గ్రహించి, మేరుపర్వతమువలె నిశ్చలుడై జీవన్ముక్త సుఖవంతుడు కావలెను.
ఇందు ప్రతి వాక్యము యొక్క అర్థము తెలియుటలో తొలుత అందలి పదముల అర్థజ్ఞానమే ముఖ్య కారణమగుట తొలి నియమము. తత్ త్వం పదములు వరుసగా పరమాత్మకు, జీవాత్మకు వాచకములు అగుచున్నవి. “అసి” అను పదము పరమాత్మ-జీవాత్మలకు ఏకత్వమును తెలియజేయును.
జీవాత్మ,పరమాత్మ అను ఈ రెండిటిలో ఒకటి ప్రత్యగాత్మ మరియొకటి పరమాత్మ పరోక్షము. ప్రత్యక్షము-పరోక్షములు అనెడు వాచ్యార్థ గోచరమగు విరోధమును వదిలివేయవలెను. ఈ విరోధమును వదిలిపెట్టి, సంశోధితమగు లక్షణావృత్తిచే లక్షితమైన శుద్ధచేతనత్వమును గ్రహించి తన స్వస్వరూపమును ఎరిగి ఏకీభావమును పొందవలయును.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.