
వ్యవసాయాత్మికా బుద్ధిః ఏ కేహ కురునన్దన|
బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్||
‘వ్యవసాయ’ ‘అవ్యవసాయ’ అని రెండు పదాలు ఉన్నాయి. వ్యవసాయ అంటే కృషి చేయడం, సాధించాలన్న తపన కలిగి ఉండడం. దానికి వ్యతిరేకం ‘అవ్యవసాయ’ అన్నది. ‘వ్యవసాయాత్మికా బుద్ధి’ కృతనిశ్చయంతో కూడిన బుద్ధి అని. అన్నిటినీ కూడగట్టుకున్న బుద్ధి. మన శరీరంలోనే ఎన్నో విభజనలున్నాయి. అన్ని అంగాలు ఎంతో సమన్వయంగా పనిచేస్తే కానీ మన ఈ దేహ వ్యాపారం సాగదు. ప్రతి ఒకటి ఇంకొక దానితో పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. విడివిడిగా ఉంటూ అన్నీ కలసి ఉన్నట్లు, మన అంతరంగిక జీవితం కూడా అన్ని కలయికల సముదాయం. ‘ ఏ కేహ కురునన్దన’ వ్యవసాయక బుద్ధి ఒకే నిశ్చయాన్ని కలిగి ఉంటుంది. కాని ‘బహుశాఖా హ్యనన్తాశ్చ బుద్ధయో2వ్యవసాయినామ్’ ‘ అవ్యవసాయి’లో, కష్టపడని వానిలో స్థిరత్వం ఉండదు. శక్తి అంతా విఛ్చిన్నమై ఉంటుంది. మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి శక్తులన్నీ విఛ్చిన్నమై ఉండడం. రెండు అన్నీ కూడి ఉండడం. సామాన్య మానవుడి బుద్ధి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అందువల్ల దానిలో ఎక్కువ శక్తి నిక్షిప్తం కాదు. శ్రీ కృష్ణుడు కర్మయోగంలో స్థిరత్వ బుద్ధిని సాధించడం గురించి, మానవుడు తనలోని శక్తి అంతటినీ కలిపి ఒకటిగా చేసుకోగలిగిన యోగమును గురించి బోధిస్తున్నాడు. మానసిక భావ ఐఖ్యత వల్ల మనిషి యొక్క అవగాహన స్వఛ్చంగా ఉంటుంది. ప్రతినిత్యం మనం తమ మానసిక శక్తులను విఛ్ఛిన్నం చేసుకొని ఉన్న వ్యక్తులను చూస్తుంటాం. ఉదాహరణకు మహాత్మాగాంధీజీలో గొప్ప శక్తి సమైఖ్యతను చూడగలం. వారిలో బుద్ధి స్థిరంగా, నిశ్చయంగా పనిచేసింది. అది వెయ్యి విధాలుగా పరిచ్ఛిన్నమై ఉండలేదు. కేంద్రీకృత బుద్ధి శక్తివంతంగా పని చేస్తుంది. మనం కూడా ఆ విధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శక్తి అంతా కూడగట్టుకుని ఒకే బుద్ధిగా ఉంటే శక్తివంతంగా అన్ని పనులను నిర్వహించవచ్చు. ఎవరో దీనిని మీకు తెచ్చి ఇవ్వరు. ఈ విషయంలో మీవైపు ఎవ్వరూ చూడనే చూడరు. మీకు మీరే ఈ కోణంలో మిమ్మల్ని వృద్ధి పరచుకోవాలి. మనం ప్రపంచాన్ని ఎంతవరకూ, ఏ విధంగా అర్ధం చేసుకున్నామన్న దానినుండే మన చదువుకు విలువ సమకూరుతుంది. విద్య అంటే పుస్తకం చదివి పరీక్ష వ్రాయడం కాదు. అది బాహ్యమైన విద్య. నిజమైన విద్య అంతరంగిక సమైక్యతవల్ల వచ్చేది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.