అంధ్ర కవితా పితామహ
అల్లసాని పెద్దనామాత్య ప్రణీత
మను చరిత్రము
కథ, పద్యాల సొగసులు
(సంక్షిప్త పరిచయం )
బాలాంత్రపు వేంకట రమణ
మూలం:
1 ) “మనుచరిత్రము” – శ్రీ వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్ చెన్నై ప్రచురణ, 2001.
2 ) “పద్య కవితా పరిచయం – 1” డా. బేతవోలు రామబ్రహ్మం (పెద్దన – మనుచరిత్ర: ప్రవర సిద్ధులు కథ)
ముందు మాట
ఒక జాతి యొక్క సంస్కృతిని భావితరాలకి అందించేది భాష.
ఆదికవి నన్నయ్యతో మొదలయ్యి గత వెయ్యి సంవత్సరాలకు పైగా ఎందరో మహాకవులు తమ కవితా శక్తితో తెలుగు భాషను సుసంపన్నం చేస్తూ వచ్చారు. తెలుగుభాషకి ప్రతీక తెలుగు పద్యం. ఛందోబద్ధమైన పద్యం కేవలం ఒక్క తెలుగు జాతికి మాత్రమే దక్కిన ఒక అపురూపమైన వరం. తెలుగు పద్యం యొక్క అందమంతా మన ప్రాచీన సాహిత్యంలో పొందుపరచబడి ఉంది. ప్రాచీన సాహిత్యం పట్ల క్రమేపీ చిన్న చూపు ఏర్పడుతుండటం వలన, తెలుగు పద్య మాధుర్యం, గొప్పదనం యువతరానికి తెలిసి రావటం లేదు.
పద్యం అంటేనే పారిపోయే కాలమిది. ఇటీవల కాలం వరకూ, నేను కూడా అలా పారిపోయినవాడినే! ఎందుకంటే పద్యం యొక్క గొప్పదనంగానీ, దాని మాధుర్యంగానీ తెలియకపోవడమే దీనికి కారణం. ఎవరయినా తెలియపరిస్తే పద్యం మీద మమకారం పెరుగుతుంది. తెలుగు భాష యొక్క గొప్పదనం తెలిసి వస్తుంది. ఇది నా వ్యక్తిగత అనుభవం.
అందుకే నా వంతు భాషా సేవగా కొన్ని ప్రబంధాలను తీసుకొని వాటిని సంక్షిప్తంగా పరిచయం చేద్దామని సంకల్పించాను. తొలి ప్రయత్నంగా ఆంద్ర కవితాపితామహుడుగా పేరొందిన అల్లసాని పెద్దనామాత్యుడు రచించిన “మనుచరిత్రము” ప్రబంధాన్ని ఎన్నుకొన్నాను. ఈ ప్రబంధ కథా సంగ్రహం, కొన్ని పద్యాల సోగసుల్నీ వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నించాను. ఈ విషయంలో ఒక అభ్యర్ధన. ముందుగా ఒక పద్యం చదవండి. దాని వివరణ చదవండి తిరిగి అదే పద్యాన్ని మళ్ళీ చదవండి. అటుపైన తరువాత పద్యం లోకి వెళ్ళండి. ఈ సంక్షిప్త పరిచయం ద్వారా ప్రబంధం యొక్క కవితా మాధుర్యాన్ని రుచి చూపించడమే నా ఉద్దేశ్యం. ఇది చదివి ప్రబంధం మొత్తం చదవటానికి మీకు పూనిక కలిగితే నా జన్మ ధన్యమైనట్లే భావిస్తాను.
ఇందులోని దోషాలు, సవరణలు తెలియచేస్తే సరిదిద్దుకుంటానని సహృదయులయిన పాఠక మహాశయలందరికీ మనవి చేసుకుంటున్నాను.
భవదీయుడు
బాలాంత్రపు వేంకట రమణ
సనా, రిపబ్లిక్ ఆఫ్ యెమెన్
balantrapuvenkataramana@gmail.com
బాలాంత్రపు వేంకట రమణ
పరిచయం
పుట్టింది : 19-02-1950 తూర్పు గోదావరి జిల్లా బాలాంత్రం, పెరిగింది కాకినాడలో. స్థిరపడింది హైదరాబాద్ నగరంలో.
హై స్కూలు చదువు కాకినాడ, డిగ్రీ ఉస్మానియా, హైదరాబాదు.
తండ్రి గారు శ్రీ బాలాంత్రపు సూర్యనారాయణ రావు, తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ.
శ్రీమతి పేరు శారదా దేవి. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.
ప్రస్తుతం ఉద్యోగరీత్యా మధ్య ప్రాత్యదేశం యెమెన్ లో నివాసం.
అభిరుచులు: కర్నాటక సంగీతం. తెలుగు సాహిత్యం. నటన (సుమారు 75 సినిమాలు, 90 తెలుగు TV సీరియల్సు లో నటించారు)
తెలుగు పద్యం అంటే వీరికి ఎనలేని మక్కువ. మధ్యప్రాచ్య దేశాలు, యూరప్, అమెరికాలో విస్తృతంగా పర్యటించి తెలుగు ప్రబంధాల మీద, తెలుగు పద్య మాధుర్యం గురించి పలు ఉపన్యాసాలు ఇచ్చారు.
ఓం నమో విఘ్నేశ్వరాయనమః
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యే సిద్ధిర్ భవతుమే సదా !
శ్రీ కృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో ‘భువన విజయ’ సభామండపాన్నిఅలరించిన అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దనామత్యునిది అగ్రస్థానం. ఆయన ‘అంధ్ర కవితా పితామహ’* బిరుదాంకితుడు. నందవరీక బ్రాహ్మణుడు. తండ్రి పేరు చొక్కన. బళ్ళారి ప్రాంతం లోని దోసపాడు పరగణాలోని దోరాల ఇతని నివాస స్థలం. “మనుచరిత్రము” గా ప్రసిద్ధి గాంచిన “స్వారోచిష మనుసంభవము” అనే ప్రబంధం ద్వారా తెలుగు భాషామతల్లి మకుటంలో కల్కి తురాయిగా నిలిచాడు. పెద్దనామాత్యుడు “మనుచరిత్రము” కాక “హరికథాసారము” అనే ప్రబంధాన్ని కూడా రచించి తన గురువైన శఠకోపయతికి అంకితం చేశాడు.
మార్కండేయ పురాణంలో ఉన్న “స్వారోచిష మనుసంభవం” అన్న కథని రాయలవారే పెద్దనకి సూచించారు. “….భవచ్చతుర రచన కనుకూలంబున్” – “నీ రచనా స్వభావానికి ఈ కథ అనుకూలంగా ఉంటుంది” అని రాయల సూచన. “మనుసంభవ మరయ రసమంచిత కథలన్ విననింపు” అనేది పై సూచనకి హేతువు. రసవత్కథలు ఉన్నాయి. నీది రసవద్రచన. కాబట్టి అనుకూలిస్తుంది అని రాయల వారి ప్రోత్సాహం.
పెద్దన గారి ప్రత్యేకతలని చెబుతూ రాయల వారే –
హితుడవు చతురవచోనిధి
వతుల పురాణాగమేతి హాస
కథార్థ స్మృతియుతుఁడ వాంధ్ర కవితా
పితా మహుఁడ వెవ్వరీడు పేర్కొన నీకున్ (మనుచరిత్ర, పీఠిక)
*“ఆంధ్రకవితాపితామః” అన్న బిరుదు పెద్దన కంటే ముందు ఇద్దరికీ (శివదేవయ్య క్రీ. శ. 1260, కొఱవి సత్తేనారన క్రీ. శ. 1400 ) పెద్దన తరవాత కాలంలో మరో ఇద్దరికీ (ఉప్పు గుండూరి వేంకట కవి క్రీ.శ. 1600, ఎనమండ లక్ష్మీ నృసింహ కవి క్రీ.శ. 1680 ) ఇవ్వబడింది. కానీ ఒక పెద్దన యందే ఈ బిరుదు స్థిరంగా నిలిచిపోయింది.
ఇందులో పురాణ-ఆగమ-ఇతిహాసాలు అన్నీ తెలుసు అనడం వాటిలో ఉండే కథల పరమార్థాలను నీవు యెరుగుదువు అనడం. ఇది పెద్దన గారి పాండిత్యానికి సూచకం. “హితుడవు” అనేది వ్యక్తిత్వానికి కితాబు. “చతుర వచోనిధివి” (నిపుణమైన వాక్కులకు గనివి) అనేది కవితాశక్తికి నివాళి. “నీతో సరితూగేవారు లేరు” అన్నాడు రాయలు.
రాయలవారి ఈ ప్రేరణతో ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనామాత్యుడు “స్వారోచిషమనుసంభవం” అనే ప్రబంధాన్ని కడు రమణీయంగా తీర్చిదిద్దాడు. ఇది “మనుచరిత్రము” గా ప్రసిద్ధి చెందింది. తెలుగు పంచమహాకావ్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. తెలుగులో “పంచ మహా కావ్యాలు“గా పరిగణింపబఢు తున్న గ్రంధాలు:
1) పెద్దనామాత్యుని “మనుచరిత్రము”
2 ) నంది తిమ్మన గారి “పారిజాతాపహరణము” లేదా శ్రీనాథుని “శృంగార నైషధం”
౩) శ్రీ కృష్ణదేవరాయ విరచిత “ఆముక్తమాల్యద”
4) తెనాలిరామకృష్ణుని “పాండురంగమాహత్మ్యము ”
5) రామ రాజభూషణుని “వసుచరిత్రము”
ఈ ఐదు కావ్యాలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే తెలుగు భాష సంపూర్ణంగా వచ్చేస్తుందని పెద్దల ఉవాచ.
పెద్దన గారంటే రాయలవారికి అపరిమితమైన గౌరవం. ఎంతటి గౌరవం అంటే “ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి కేలూత యొసగి ఎక్కింఛుకొనేవా”డట. స్వయంగా కాలికి గండపెండేరం తోడిగాడట. మనుచరిత్రం కృతి స్వీకరించినప్పుడు తాను కూడా పల్లకి మోసాడట! అంతటి గౌరవం, మర్యాద. పెద్దన తన సమకాలీన కవులచేత కూడా అంతగానూ గౌరవింప బడ్డాడు. అందరికీ ఎవో వంకలు పెట్టి కొంటె కోణంగి అనిపించున్న కవి చౌడప్ప కూడా తన వెక్కిరింపు స్వభావాన్ని మానుకొని:
పెద్దన వలెఁ గృతి సెప్పిన
బెద్దనవలె, నల్ప కవినిఁ బెద్దనవలేనా?
ఎద్దనవలె మొద్దనవలె
గ్రద్దనవలెఁ గుందవరపు గవి చౌడప్పా!
అని పెద్దనార్యుని గూర్చి తన మెప్పుని వెల్లడించాడు.
మనుచరిత్రము – కథా సంగ్రహం
అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు అరుణాస్పదపురం. ఆ ఊళ్ళో ప్రవరుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడుండేవాడు. చూడ్డానికి అత్యంత సుందరుడు. “మన్మధుడు, చంద్రుడు, ఇంద్రకుమారుడైన జయంతుడు, నలకూబరుడు మొదలైన జగన్మోహనాకారులు ఇతనిముందు తీసికట్టు” అనిపించేటంతటి అందగాడు. ఎంతటి అందగాడో అంతకుమించిన సుగుణాలరాశి. తరుణవయస్సులో ఉన్నావాడు. వేదవేదాంగ పండితుడు. యౌవనమందే యఙ్ఞయాగాలు చేసిన ఘనుడు. అతడు నిజంగా బ్రాహ్మణకుల దీపకుడు. పైగా ధనవంతుడు. పుష్కలంగా పండే మాన్యక్షేత్రాలున్నాయి. ఏ రాజుగారైనా అన్నివిధాలా దానం ఇవ్వడానికి ఇతడే అర్హుడు అని యెంచి దానం ఇవ్వబోతే, దానం స్వీకరించడం కూడా పాపం అని భావించి పరిగ్రహించేవాడు కాడు. దానంపుచ్చుకుంటే దానికో ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఒక్క సాలగ్రామ దాన స్వీకరణకే యేపాపం అంటుకోదట. ప్రవరాఖ్యుడు దాన్ని కూడా స్వీకరించేవాడు కాడు. అంతటి నిష్టాగరిష్టుడు.
అతని భార్య సోమిదమ్మ, అతనికి అన్నివిధాలా అనుకూలవతి. ఎంతో భక్తిశ్రద్ధలతో భర్తనీ, అత్తమామల్నీ సేవిస్తూ ఉంటుంది. వెయ్యిమంది అతిథులు అర్థరాత్రి సమయంలో వచ్చినా సరే, చిఱునవ్వుతో వారికి వండి పెట్టి సంతుష్టుల్ని చేస్తుంది.
ప్రవరుడి తలిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉండి ఇంటి పనీ, బయట పనీ చక్కగా చూసుకుంటూఉంటారు. వారు వృద్ధులు. ప్రవరుడు వాళ్ళని నిత్యం ఎంతో భక్తిప్రపత్తులతో సేవించుకుంటూ ఉంటాడు.
ప్రవరుడికి అతిథిపూజ అంటే పరమానందం. అంతేకాదు, తీర్థయాత్రలన్నా, తీర్థయాత్రలు చేసివచ్చిన పుణ్యమూర్తులన్నా ఎంతో భక్తి. అటువంటివారు వస్తున్నారని తెలిస్తే, ఎంతదూరం అయినా వాళ్ళకి ఎదురేగి, పాదాలకి నమస్కరించి ఇంటికి ఆహ్వానించి, భక్తితో ఆతిధ్యమిచ్చి, వాళ్ళకి ఇష్టమైన భోజన పదార్థాలని వండించి, వడ్డించి, సంతృప్తులుగాచేసి, వాళ్ళు భుజించి కూర్చున్నాకా వాళ్ళని సమీపించి వాళ్ళు వెళ్ళి వచ్చిన, చూసిన ప్రదేశాల గురించి, తీర్థ క్షేత్రాల గురించీ అడిగి తెలుసుకొనేవాడు. అవి తనఊరినుంచి ఎంతెంత దూరంలొ ఉన్నాయో అడిగి తెలుసుకొనేవాడు. ఆయా ప్రదేశాలకి తాను వెళ్ళలేకపోతున్నానే అని చింతిస్తూ, నిట్టూర్పులు విడుస్తూ ఉండేవాడు. వెళ్ళాలని ఉబలాటపడేవాడు. కానీ నిత్యాగ్నిహోత్రి, పితృసేవాతత్పరుడు అయిన ప్రవరుడు తన నిత్యకృత్యాలయిన అనుష్టాలని వదిలి ఒక్క రోజు కూడా ఉండడానికి ఇష్టపడకపోని కారణం వలన అరుణాస్పదపురాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళేవాడు కాడు.
ఇలా ఉండగా ఒకనాడు ప్రవరుని ఇంటికి ఒక సిద్ధుడు హఠాత్తుగా వచ్చాడు. యధావిధిగా ప్రవరుడు అతనికి అర్ఘ్యపాద్యాలిచ్చి, సకలోపచారాలు చేసి, మంచి భోజనం పెట్టి, అతను విశ్రాంతి తీసికొన్న తరవాత చెంతచేరి “మహాత్మా! మీరు ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతూ ఇలా నా ఇల్లు పావనం చేసారు? మీరు ఏయేదేశాల్నీ, ఏయే పర్వతాల్నీ చూశారు? ఏయే తీర్థాలలో స్నానాలు చేశారు? ఏయే ద్వీపాలు, ఏయే పుణ్య స్థలాలు, ప్రదేశాలు సందర్శించారు?” అని అడిగాడు తన ధోరణిలో.
అందుకు ఆ సిద్ధుడు “నేను మెట్టని గుట్ట, సేవించని తీర్థం, క్షేత్రం, చూడని ప్రదేశమూ లేవు” అంటూ తాను ఆసేతు హిమాచలం ఏమేమి వింతలూ, విడ్డూరాలూ చూశాడో చెప్పుకొచ్చాడు. అదంతా విని ప్రవరుడు ఆశ్చర్యచకితుడయ్యడు, ఆపైన కొంచెం అనుమానమూ కలిగింది. “స్వామీ, మీరు వర్ణించినవన్నీ సందర్శించి రావాలంటే ఏళ్ళూ పూళ్ళూ పడతాయికదా, మీరు చూస్తే అంత వయసు ఉన్నవారిలా కనపడ్డంలేదు, అదెలా సాధ్యమయింది?” అని ప్రశ్నించాడు అనుమానంగా.
దానికి ఆ సిద్ధుడు నవ్వి “నువ్వన్నది నిజమే, నడకే ఆధారం గలవారికి ఇది పొసగనిదే, కాని నా దగ్గఱ ఈశ్వరకృపవల్ల ఒక పాదలేపనం ఉంది. ఆ పసరు ప్రభావంతో ఎంత దూఱమైనా లిప్తమాత్రంలో పోగలను. ఆకాశంలో సూర్యుడి గుఱ్ఱాలు ఎంత వేగంగా ప్రయాణించగలవో భూమి మీద నేనూ అంత దూరమూ, అంతే వేగంగా అలసట లేకుండా ప్రయాణించగలను” అని చెప్పాడు.
ప్రవరుడికి ఎంతోకాలంగా తీరకుండా ఉండిపోయిన తన తీర్థాయాత్రా సందర్శనాభిలాష తీరే మార్గం దొరికింది. ఇలా వెళ్ళి అలా వచ్చేయ్యగలిగితే తన నిత్యకర్మలకీ, అనుష్టానాలకీ, తలిదండ్రుల సేవకీ ఏమీ అంతరాయం కలగదుకదా మరి. అతను వెంటనే ఆ సిద్ధుడికి భక్తిశ్రద్ధలతో అంజలిఘటించి, తన చిరకాల వాంఛ తీర్చమని ప్రార్థించాడు. సిద్ధుడు ప్రసన్నుడై, తన బుట్టలోంచి పసరు తీసి, దీని పేరు ఇదీ అని చెప్పకుండా, ప్రవరుడి పాదాలకి దాన్ని పూసి తన దారిన తాను చక్కాపోయాడు. ఆ పసరుపూసి అతడలా వెళ్ళగానే ప్రవరుడు తన మనసులొ “హిమవత్పర్వతాన్ని చూడాలి” అని సంకల్పించాడు. మరుక్షణంలోనే అతడు హిమగిరిశిఖరం మీదికి పోయి నిలిచాడు.
* * *
(To be continued…)
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.