శనివారం, జనవరి 17, 2015
డాల్లస్/ఫోర్ట్ వర్త్
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలైన మన పండుగలలో విశేషమైనది సంక్రాంతి. ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఇర్వింగ్ నిమిట్జ్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2015 అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, మరియు కార్యక్రమ సమన్వయకర్త వెంకట్ దండ ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణంలో బొమ్మల కొలువును అలంకరించారు. సుమారు 800 మంది పైగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పోషక దాతలు మరియు వివిధ వ్యాపార సంస్థల ప్రదర్శనలు ఆహ్వానితులకి స్వాగతం పలికాయి. స్థానిక విందు ఇండియన్ రెస్టారెంట్ వారు అరిసెలతో నోరూరించే పండుగ బంతి భోజనం వడ్డించారు.
సుమారు 185 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. వనితావేదిక సమన్వయకర్త శ్రీలక్ష్మి మండిగ నేతృత్వంలో చిన్నారుల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష ఆదరణ లభించింది. ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతి గ్రహీతలను గుర్తించారు.
పల్లవి తోటకూర ఆధ్వర్యంలో చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది.ఆ తరువాత వెంకట్ ములుకుట్ల అధ్వర్యంలో వినాయకుడిని ప్రార్థిస్తూ వివిధ సంగీత వాయిద్యాలతో ఫ్యూజన్ పాట, జ్యోతి కందిమళ్ళ నిర్వహణలో ‘మహా గణపతిం మరియు స్వాగతం” శాస్త్రీయ నృత్యం, సంజనా పడిగెల నిర్వహణలో చిన్నారుల టాలీవుడ్ మెడ్లీ నృత్యాలు, ఝాన్సి చామకూర నిర్వహణలో LMA పిల్లల సినిమా పాటల మెడ్లీ, ప్రవీణ వజ్జ నిర్వహణలో “కొలనిదోపరికి గొబ్బిళ్ళో” సంక్రాంతి పండుగను వర్ణిస్తూ చిన్నారుల శాస్త్రీయ నృత్యం, యోగిత మండువ దర్శకత్వంలో ప్రదర్శించిన “సంక్రాంతి వచ్చిందే తుమ్మెద” చిత్ర సంగీత మిశ్రమ నాట్య విన్యాసాలు, గురు శ్రీలతా సూరి నిర్వహణలో నాట్యాంజలి బృందం వారి “చరిష్ను’ శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం ప్రేక్షకులని ఎంతో ఆకొట్టుకున్నాయి. ఆ తరువాత లక్ష్మినాగ్ సూరిభొట్ల దర్శకత్వంలో ప్రదర్శించిన “అత్తారింటికి దారి “ హాస్య నాటిక అందరిని ఆహ్లాదంలో ముంచెత్తి, నవ్వులు పూయించింది. హెతల్ జోష్ నాగరాజ్ నిర్వహణలో ‘గ్రేస్ క్రియేషన్స్ – గర్ల్స్ లైఫ్’ నృత్యం అందరిని ఆనంద పరిచినది.
డాల్లస్ లో వున్న తెలుగు వారందరినీ సంక్రాంతి సంబరాల్లో ముంచడానికి టాంటెక్స్ ఆహ్వానం మేరకు విచ్చేసిన ప్రముఖ హాస్య నటుడు శివారెడ్డి ప్రేక్షకులను తన మిమిక్రీ , కృత భాషణం (Ventriloquism for Kids) , సరదా మాటలతో, హాస్యోక్తులతో నవ్వులు పువ్వులు పూయించారు. ఈ సందర్భంగా శివారెడ్డి గారికి ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సన్మానం చేయడం జరిగింది.
2014 అధ్యక్షులు విజయ మోహన్ కాకర్ల ప్రసంగిస్తూ తమకు సహాయ సహకారాలు అందించిన కార్య వర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ , తమ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు సభ్యులతో పంచుకున్నారు. ఆ తరువాత సంస్థ నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి ను సభకు పరిచయం చేసారు. అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి 2015 నూతన కార్యవర్గ సభ్యులను అందరిని సభకు పరిచయం చేస్తూ, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ఉత్తరాధ్యక్షుడుగా, ఉప్పలపాటి కృష్ణారెడ్డి ఉపాధ్యక్షుడుగా, ఆదిభట్ల మహేష్ ఆదిత్య కార్యదర్శిగా, వీర్నపు చినసత్యం సంయుక్త కార్యదర్శిగా, శీలం కృష్ణవేణి కోశాధికారిగా, వేణుమాధవ్ పావులూరి సంయుక్త కోశాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. ఆ తరువాత పాలక మండలి నూతన అధిపతిగా అజయ్ రెడ్డి, ఉపాధిపతిగా సుగన్ చాగర్లమూడి మరియు సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి గుర్రం, రమణారెడ్డి పుట్లూరు, రామకృష్ణా రెడ్డి రొడ్డ, శ్యామ రుమాళ్ళ, శ్రీనివాస్ బావిరెడ్డి లను సభకు పరిచయం చేసారు.
సభని ఉద్దేశిస్తూ నూతన అధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి 2015 సంవత్సరంలో కార్యక్రమాల నాణ్యత పెంచడం, స్థానిక కళాకారులకు అవసరమైన వేదికలు కల్పించడం, యువత వ్యక్తిత్వ వికాస పురోభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలను ప్రవేశపెట్టడం, సంస్థ పరిధిలో ఉన్న తెలుగు వారి మధ్య సఖ్యత పెంచడం లాంటి వినూత్నకార్యక్రమాలతో డల్లాస్ తెలుగు ప్రజలకి చేరువ అవతామని మరియు సాంస్కృతిక అవసరాలతో పాటు మారుతున్న మన సభ్యుల అవసరాలకు అనుగుణంగా సంస్థ కార్యకలాపాలను రూపుదిద్దుకోవడం ఎంతైనా అవసరమని తెలిపారు.
డా.ఊరిమిండి నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలకమండలి ఉపాదిపతి సుగన్ చాగార్ల మూడి సంయుక్తంగా కాకర్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఆ తరువాత డా.ఊరిమిండి నరసింహారెడ్డి మరియు విజయమోహన్ కాకర్ల సంయుక్తంగా 2014 పాలకమండలిఅధిపతి మూర్తి ములుకుట్ల దంపతులను ఙ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన రఘు చిట్టిమల్ల, బాల్కి చామకూర, సుభాషిణి పెంటకోటలను, మరియు పాలక మండలి సభ్యులుగా పదవీవిరమణ చేసిన డా. సి. ఆర్. రావు, 2014 పోషక దాతలను డా.ఊరిమిండి నరసింహారెడ్డి, విజయ మోహన్ కాకర్ల మరియూ మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.
ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు పునఃఫ్రారంభిస్తూ, రేఖా రెడ్డి నిర్వహణలో చలనచిత్ర నృత్యాలు , పఠనేని సురేష్ సమన్వయంలొ స్థానిక గాయకులు చక్కటి చలన చిత్రంలోని పాటల మెడ్లీ, శ్రీలత ముషం నిర్వహణలో ‘బావ మరదళ్ల సంక్రాంతి సరదా సందడి “ చిన్నారుల నృత్యo , రూప బంద నేతృత్వంలో ‘బ్రోవ భారమా’ పాశ్చాత్య మరియు శాస్త్రీయ ఫ్యూజన్ నృత్యం, సరిత కొండ నిర్వహించిన చలన చిత్ర నృత్యాల మెడ్లీ అందరిని అలరించినది. తెలుగు చలనచిత్ర జగత్తు 2014 సంవత్సరంలో కోల్పోయిన ఒక మహా నటుడు ANR గారికి స్మృత్యాంజలి ఘటిస్తూ, శాంతి నూతి మరియు మల్లిక్ దివాకర్ల నేతృత్వంలో సమర్పించిన ‘నృత్యాక్షరి’ ప్రదర్శన ఆహ్వానితులను ఎంతో ఆనందంలో ముంచివేసి నేటి కార్యక్రమాలలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
2014 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త సింగిరెడ్డి శారద తనకు సంవత్సరం పొడుగునా సహకరించిన కార్యకర్తల జట్టుకు కృతజ్ఞతాపూర్వక అభివందనం తెలియజేస్తూ 2015వ సంవత్సరంలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టనున్న వనం జ్యోతి గారిని సభకు పరిచయం చేసారు.
“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త దండ వెంకట్, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన విందు రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషక దాతలకు కృతఙ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా అద్భుతంగా పనిచేసిన పఠనేని సురేష్, ఇల్లెందుల సమీర మరియు జలసూత్రం చంద్రశేఖర్ లకు అభినందనలు తెలిపారు.
కార్యక్రమ సమన్వయకర్త దండ వెంకట్, ఈ కార్యక్రమ ప్రత్యేక పోషక దాతలైన ప్రీమియర్ స్పాన్సర్ బిజినెస్ ఇంటేల్లి సొల్యూషన్స్, ప్రెసెంటిoగ్ స్పాన్సర్ మెడికల్ అండ్ వెల్ నెస్ సెంటర్-మర్ఫి, ఈవెంట్ స్పాన్సర్ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టి.డి.ఎఫ్.), టాంటెక్స్ సంస్థ ప్లాటినం పోషక దాతలైన బావర్చి బిర్యానీ పాయింట్, మై టాక్స్ ఫైలెర్, బిజినెస్ ఇంటేల్లి సోలుషన్స్, ఆకుల అసోసియేట్స్, బేలర్ స్కాట్ అండ్ వైట్ హార్ట్ హాస్పిటల్ మరియు రుచి పాలస్ ఇండియన్ రెస్టారంట్, గోల్డ్ పోషక దాతలైన పారడైస్ బిర్యానీ పాయింట్, పసంద్ రెస్టారెంట్, పాన్ పెప్సికో, హొరైజన్ ట్రావెల్స్, విష్ పాలెపు సి.పి.ఏ, ఆంబియన్సు రియాల్టీ (కిశోర్ చుక్కాల), జి అండ్ సి గ్లోబల్ కన్సార్టియం, టెక్సాస్ హెల్త్ ఫిజిషయన్స్ గ్రూప్, అనిల్ గారి రియాల్టర్స్ , విక్రం రెడ్డి జంగం అండ్ ఫ్యామిలీ , సిల్వర్ పోషక దాతలైన శ్రీని చిదురాల రియాల్టర్ , వెండాన్గో లేఔట్స్, సిం-పర్వతనేని-బ్రౌన్ లా ఆఫీసెస్, ఒమేగా ట్రావెల్ అండ్ టూర్స్, పెన్ సాఫ్ట్ టెక్నాలజీస్, రెలై ట్రస్ట్ మార్ట్ గేజ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేసారు. “గాన సుధ – మన టాంటెక్స్ రేడియో” 1220 AM లో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేసిప్లాజా, రేడియో ఖుషిలకు మరియు ప్రసారమాధ్యమాలైన టివి9, 6టివి, తెలుగు వన్ రేడియో (టోరి), ఏక్ నజర్, టివి5, డిపిటివి లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.
ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.