ఐఎస్ చేతుల్లో 39 మంది భారతీయుల హత్య
* 2014లో కిడ్నాపింగ్‌కు గురైన 40 మంది భారతీయులు
* డీఎన్ఏ పరీక్షల ద్వారా వారంతా మనవాళ్లేనని నిర్ధారణ
* రాజ్యసభలో ప్రకటన చేసిన విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్
డెక్కన్ అబ్రాడ్: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో 2014లో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో కిడ్నాపింగ్‌కు గురైన 40 మందిలో 39 మంది మరణించినట్లు నిర్ధారణ అయిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారు. మంగళవారం ఆమె రాజ్యసభలో ఒక ప్రకటన చేస్తూ ఇరాక్‌లోని బాదుష్ సమీపంలోని సామూహిక సమాధుల్లో వున్న ఈ మృతదేహాలను భారత, ఇరాక్ అధికారుల బృందం కనుగొన్నదని, డిఎన్ఎ పరీక్షల ద్వారా వారంతా అదృశ్యమైన భారతీయులేనన్న విషయం నిర్ధారణ అయిందని వివరించారు. 2014లో మోసుల్ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఆక్రమించుకున్న తరువాత అక్కడ నివశిస్తున్న 40 మంది భారతీయులు కిడ్నాపింగ్‌కు గురైన విషయం తెలిసిందే. వీరిలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాలకు చెందిన వారున్నారని మంత్రి వివరించారు. మొత్తం 39 మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు లభించామని, భారత్‌లోని వారి కుటుంబాల నుండి డిఎన్ఎ శాంపిల్స్ సేకరించి పంపామని, బాగ్దాద్‌లో జరిగిన పరీక్షల్లో పరిశీలించినపుడు ఈ శాంపుల్స్ 38 కేసుల్లో సరిపోలాయని వివరించారు. ఈ విషయంలో తమకు సహకరించిన ఇరాక్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియచేశారు. వారి అవశేషాలను భారత్‌కు తీసుకు వచ్చేందుకు సహాయమంత్రి సింగ్ త్వరలోనే ఇరాక్‌కు వెళ్తారని ఆమె చెప్పారు.
అదృశ్యమైన వారు తిరిగి సజీవంగా రాకపోవటం దురదృష్టకరమని ఆమె వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకముందే వారు చనిపోయినట్లు సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలను తోసిపుచ్చిన సుష్మా స్వరాజ్…కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి ముందే వారి మరణంపై పార్లమెంటులో ప్రకటన చేయడాన్ని సమర్థించుకున్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం అయినందునే పార్లమెంటులో తొలుత ప్రకటన చేసినట్లు చెప్పారు. ఇరాక్‌లో ఆచూకీకి కనిపించకుండా పోయిన భారతీయుల గురించి సమాచారం అందిన వెంటనే పార్లమెంటుకు వివరాలు చెబుతానని గతంలో తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడంపై ఆమె ఆసంతృప్తి వ్యక్తంచేశారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.