Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం

By   /  May 17, 2016  /  No Comments

    Print       Email

agastyaచంటిపిల్లలకు పాలు పట్టించి లేదా ఏదైనా ఆహారం తినిపించి, దిష్టి తీసి, పొట్ట నిమురుతూ ‘జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం’ అని అంటుంటాం. దీనివల్ల పిల్లలకు ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని ఒక నమ్మకం.

దీని వెనక ఉన్న కథ ఏమిటో మీకు తెలుసా! మనలో చాలామందికి తెలియకపోవొచ్చు.  దీని కథ ఏమిటంటే పూర్వం ఒక అడవిలో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఒకచోటినుండి ఇంకొక చోటికి వెళ్ళాలంటే అడవులగుండా ప్రయాణం చేయవలసి వచ్చేది. అలా ప్రయాణిస్తున్నవారిని  ఆపి, వారి ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వాతాపి, ఇల్వలుడు రాక్షసులు కోరేవారు.  పాపం! వీరి మాటలు నమ్మిన ప్రయాణీకులు వారి ఇంటికి ఆతిథ్యానికి వెళ్ళేవారు. వచ్చిన అతిథులను స్నానపానాదులను ముగించుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పి ఇల్వలుడు వంట చేయటానికి అని వంటగదిలోకి వెళ్ళేవాడు.  అక్కడ ఇల్వలుడు, వాతాపిని చంపి ముక్కలు ముక్కలుగా చేసి వండేవాడు.

అతిథులకు స్వయంగా ఇల్వలుడే కొసరికొసరి వడ్డించేవాడు.  బాటసారులు సుష్టుగా భోజనం చేసేవారు.  వీళ్ళు భోజనం ముగించి లేవబోయే సమయానికి ఇల్వలుడు వారిముందు నిలబడి “వాతాపి! ఓ వాతాపీ! రా! బయటకి రా!” అని పిలిచేవాడు. ఈ పిలుపు వినగానే వీరి కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి తిరిగి ప్రాణం పోసుకుని బాటసారుల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి చచ్చి పడి ఉన్న బాటసారులను కడుపునిండా భుజించేవారు.  ఇలా మోసంతో ఈ ఇద్దరూ ఆ అడవిగుండా వెళ్ళే ప్రయాణీకులను భుజిస్తుండేవారు ఈ మోసం ఎంతోకాలం నిలబడలేదు. అప్పుడు ఆ అరణ్యంలో ఉండే మునులంతా కలిసి, అగస్త్య మహర్షిని కలిశారు. విషయమంతా విన్నవించుకున్నారు. అగస్త్య మహాముని తప:సంపన్నుడు. మంత్రశక్తులన్నీ ఆయన ఆధీనంలో ఉండేవి. సముద్రాన్నే ఔపోసన పట్టిన మహానుభావుడు. విషయమంతా విన్న అగస్త్యుడు వెంటనే వాతాపి, ఇల్వలుడు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు.

Agastya_drinks_the_oceanమహర్షిని చూడగానే యథాప్రకారం ఇద్దరూ బ్రాహ్మణ రూపంలో ఎదురువెళ్ళి తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని ప్రార్థించారు. అగస్త్యులవారు వెంటనే అంగీకరించి వారితోపాటు బయలుదేరారు.  ఇల్వలుడు ఇంటికి చేరుకోగానే “మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ ఉండండి. ఈలోగా భోజనం సిద్ధం చేస్తాను.”  అని వంటింట్లోకి వెళ్లి యథాప్రకారంగా వంట చేశాడు. తరువాత మహర్షులవారిని భోజనానికి పిలిచి, కొసరికకొసరి వడ్డించాడు. మహర్షులవారు భోజనం ముగించి ఇల్వలుడికి వినపడకుండా, పొట్ట నిమురుకుంటూ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని అనుకున్నారు. తరువాత ఇల్వలుడు మహర్షికి ఎదురు నిలబడి, “వాతాపీ! ఓ వాతాపీ! రా! బయటకు రా!”  అని పిలిచాడు. ఎంతసేపటికి వాతాపి రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.  అప్పుడు అగస్య మహర్షి నవ్వి “ ఇంకెక్కడి వాతాపి? నా పొట్టలో జీర్ణమయిపోయాడు.” అన్నాడు. ఇల్వలుడు తన ఎదురుగా ఉన్నది అగస్త్య మహర్షి అని తెలుసుకున్నాడు. వెంటనే మహర్షి కాళ్ళ మీదపడి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్థించాడు. ఆ అరణ్యం వదిలి వెళతానని చెప్పాడు. మహర్షులవారు దయ తలిచి “వెళ్ళు! “ అన్నారు. ఇల్వలుడు ఇకముందు ఎవరిని చంపనని ప్రమాణం చేసి, ఆ అరణ్యం వదిలి వెళ్ళాడు. ఇదీ ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ వెనుక ఉన్న కథ!   

 

Source:  Tripura Sundari Pratapagiri

InCorpTaxAct
Suvidha

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →