ఇందిరా భవన్ నుంచి ఆంధ్రరత్న భవన్ కు ఏపీ పీసీసీ..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు విజయవాడ కేంద్రంగా మారింది. నిన్నటి వరకు హైదరాబాద్ ఇందిరాభవన్ వేదికగా నడుస్తున్న ఏపీ.పీసీసీ కార్యకలాపాలు.. ఇక నుంచి విజయవాడ ఆంధ్రరత్నభవన్ వేదికగా సాగనున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం బెజవాడ తన పూర్వ వైభవాన్ని సాధించింది. అన్నింటికీ ఈ సిటీనే కేంద్ర బిందువుగా మారుతోంది.ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో మకాం వేసి పాలన సాగిస్తున్నారు.దీనికితోడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను కూడా నెమ్మదిగా అక్కడికే తరలిస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు కూడా విజయవాడను కేంద్రంగా మార్చుకుంటున్నాయి. తమ రాష్ట్ర కార్యాలయాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే సీపీఐ, సీపీఎం పార్టీ కార్యాలయాల నిర్మాణాలను పూర్తయ్యాయి. ఇప్పటి వరకు బెజవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆఫీసుగా సేవలందించిన ఆంధ్రరత్నభవన్ 19వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంగా మారబోతోంది.
దీనికోసం .. ఆంధ్రరత్నభవన్‌లోని కింది భాగాన్ని ఆధునీకరించారు. ఏపీ నడిబొడ్డున ఉన్న విజయవాడ నుంచే పీసీసీ కార్యకలాపాలను నిర్వహించడం వల్ల 13 జిల్లాల నేతలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుందని ఆ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లోని అన్ని రాష్ట్ర విభాగాలను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రరత్నభవన్‌లోని అన్ని గదులను ఆధునీకరించడంతో పాటు సీలింగ్, ఏసీ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు.
19న జరిగే పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఈ విషయాన్ని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గిన విషయం తెలిసిందే. అయితే తిరిగి పూర్వ వైభవం సాధించేందుకు విజయవాడ కేంద్రంగా 13 జిల్లాలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యనేతలు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.