తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్
ప్రస్తుత పరిస్థితులను చూస్తా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ జరిగే ఉందనిపిస్తోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. మీరు అక్రమ కట్టడాలు కడుతూ దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వదలడం లేదని తెలంగాణ సర్కార్‌ను ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తే.. మీరు కట్టిన ప్రాజెక్టులు సక్రమమా అంటూ ఏపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ సర్కార్ ప్రశ్నిస్తోంది. అంతేకాదు కృష్ణానది యజమాన్యబోర్డు తన పరిధిని దాటి వ్యవహరిస్తుందని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో, అధికార పార్టీ లోక్‌సభ సభ్యులంతా కలిసి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బోర్డు అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని హరీష్‌రావు విజ్ఞప్తి కూడా చేశారు. అలాగే కేంద్ర జలవనరుల ముఖ్యకార్యదర్శిని కలిసి కృష్ణాబోర్డుపై ఫిర్యాదు చేయడంతో పాటు కేటాయింపుల మేరకే నీటిని వినియోగించేందుకు ప్రాజెక్టుల నిర్మాణానికి రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కొత్తగా ప్రాజెక్టులు నిర్మించాలంటే కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలోని అపెక్స్ కమిటీ, కృష్ణాబోర్డు అనుమతి తప్పనిసరిన్న విషయాన్ని ఈ సందర్భంగా ఏపీ జలవనరులశాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు నిర్మాణాన్ని తెలంగాణ సర్కార్ ప్రారంభించిందని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులను ఏపీ సర్కార్ అడ్డుకుంటుందని దుష్పప్రచారాన్ని చేయడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం 155 టీఎంసీల నీటిని అక్రమంగా వినియోగించుకునేందుకు ప్రణాళిక రచన చేస్తోందని ఏపీ రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అంటుండడం గమనార్హం. అంతేకాదు రాష్ట్ర విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ (10) ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే పూర్తి చేయాలని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. అయితే భవిష్యత్ తరలు నష్టపోకుండా ఇలాంటి విషయాలను సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.