బెదిరిస్తే రైతులు భూములు ఇచ్చేస్తారా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే తుళ్లూరును రాజధానిగా ఎంపికచేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లోని సెక్రటేరియట్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సూచనలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు. రాజధాని ఎక్కడ నిర్మించాలో చెప్పకుండా విభజించినందువల్లే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకుపోయిందన్నారు.
రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది విరాళాలు కూడా ఇచ్చారని చెప్పారు. దీంతోపాటు మై బ్రిక్స్ మై అమరావతి కార్యక్రమానికి ఎంతోమంది ముందుకువచ్చారని తెలిపారు. ప్రజలందరూ పవిత్రభావంతో పూజలు చేసి మట్టి, నీరు తీసుకొచ్చారని తెలిపారు. అంతలా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాజధాని శంకుస్థాపనను అడ్డుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నించిందన్నారు. రైతులను రెచ్చగొట్టి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. తాము ఓ పద్దతి ప్రకారం పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. అయితే మాటిమాటికి ప్రతిపక్షం కుతంత్రాలు చేస్తోందని ఆరోపించారు.
రాజధాని రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ప్రతిపక్షం ఆరోపించడం చాలా విడ్డూరంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. రైతులను బెదిరిస్తే భూములు ఇచ్చేస్తారా..? అంటూ ప్రశ్నించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు 1756 లావాదేవీలు జరిగితే 1724 ఎకరాలు కొనుగోలు చేశారన్నారు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు 9904 లావాదేవీలైతే 6500 ఎకరాలు కొనుగోలు జరిగినట్లు వెల్లడించారు. మొత్తం 9213 ఎకరాల్లో క్రయవిక్రయాలు జరిగాయన్నారు. రాజధాని ప్రకటన వరకు జరిగిన ప్రకారం చూస్తే 604 మంది 515 ఎకరాలు కొనుగోలు చేశారని తెలిపారు.
రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలుపై ప్రతిపక్షం నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. భూములపై అసత్య కథనాలు ప్రచురించి ప్రజల్లో అభద్రతా భావం కలిగించాలని చూస్తున్నారని విమర్శించారు. ఎలాపడితే అలా అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని అన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.