ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులను అమరావతికి రావాలని మంత్రులతో పాటు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కోరినా ఉద్యోగులు హైదరాబాద్‌ను వదిలి అక్కడికి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. వారానికి 5 రోజులే పని దినాలు అని ప్రభుత్వం ప్రకటించినా.. ఇంటి అద్దెలో 30 శాతం అధికంగా ఇస్తామని చెప్పినా ఉద్యోగులు రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోక ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాల్సిన సమయం గురించి ఆయన చెప్పకనే చెప్పేశారు. జూన్ 27లోపు ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని అమరావతికి తరలించనున్నట్లు స్పష్టం చేశారు. అంటే.. జూన్ మూడో వారంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి ప్రయాణం కట్టే అవకాశం ఉందన్న మాట.
జూన్ 27 లోపు అని డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో ఈ లోపలే ఉద్యోగులు తరలివెళ్లటం ఖాయమని చెప్పాలి.
అయితే చాలా మంది ఉద్యోగులు అమరావతికి రాలేమని ఎన్ని అదనపు సౌకర్యాలు కల్పించినా కూడా తాము అక్కడి వచ్చే ప్రసక్తే లేదని అంటున్నారు. కావాలంటే ఉద్యోగం మానేస్తామని చెబుతున్నారు. అందుకోసం ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలుస్తోంది. కొంతమందివి ప్రభుత్వం అంగీకరించిందని కూడా సమాచారం. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందన్నది వాస్తవం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.