ప్రత్యేక హోదా లేనట్లే!
రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడిన తీరు చూస్తాఉంటే ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనేది అర్థమవుతోంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడుగుతాయని, ఆర్థిక లోటులో ఉన్న ఏపీని ఆదుకుంటామని చెబుతూనే ప్రత్యేక హోదా ఇచ్చేది లేదనే భావన వచ్చేలా మాట్లాడారు. అరుణ్‌జైట్లీ ఇంకా ఏమన్నారంటే…ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు ఒడిశా వంటి ఎన్నో రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టుతున్నాయని జైట్లీ అన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 14వ ఆర్థిక సంఘాన్ని నియమించామని ఆయన తెలియజేస్తూ, వారు ఇచ్చే సిఫార్సులకు అనుగుణంగానే తమ నిర్ణయాలు ఉంటాయని సూచించారు. కాంగ్రెస్ వ్యతిరేకించిన పన్ను రాయితీలను సైతం ఆంధ్ర ప్రదేశ్‌కు ఇచ్చామని వెల్లడించిన జైట్లీ రాష్ట్రం కోరుతున్నట్లుగా మరిన్ని రాయితీలు ప్రకటిస్తే, పక్క రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టినట్లు అవుతుందన్నారు. కేవలం నిరసనల కారణంగా ప్రత్యేక హోదాను ఇవ్వలేమని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత నవ్యాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే ఎన్నో వేల కోట్ల అదనపు నిధులను పోలవరం, రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్రానికి అందజేశామని వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి ఆ నిధులను ఎలా వెచ్చించారో పరిశీలించిన తరువాతే మరిన్ని నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. తీసుకున్న డబ్బుకు లెక్కలు చెప్పవలసిన బాధ్యత ఎపి ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ఎపికి లోటు ఏర్పడితే దాన్ని భర్తీ చేసేందుకు సైతం కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. రాజధానిలో రాజ్ భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ ఏర్పాటు నిమిత్తం రూ. 2,500 కోట్లను అందజేశామని ఆయన తెలిపారు. ఈ దశలో మంత్రి సుజనా చౌదరి కల్పించుకుని కేంద్రం సాయం చేస్తున్న విషయం నిజమేనని, రాజధాని నిమిత్తం ఇచ్చిన రూ. 2,500 కోట్లలో రూ. 1000 కోట్లను గుంటూరు, విజయవాడల్లో మురుగునీటి పారుదలకు కేటాయించారని గుర్తు చేశారు. పదే పదే అదనపు నిధులు కావాలని అడుగుతూ ఉంటే ఎలా తెచ్చి ఇవ్వాలని ఆర్థిక శాఖ మంత్రి ప్రశ్నించారు. ఇంకా రాష్ట్రానికి ఏమేమో ఇచ్చారో కూడా లిస్టు చదివి వినిపించారు.
ఏపీకి కల్పించిన సౌకర్యాలపై జైట్లీ తెలిపిన అంశాల్లోని ముఖ్యవివరాలివి
* విభజన చట్టం సెక్షన్ 9లో ఉన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ అదనపు పోలీసు ఉద్యోగాలను కేటాయించాం.
* హైకోర్టును విభజించాలని తెలంగాణ పట్టుబడుతోంది. అందుకూ ప్రయత్నిస్తున్నాం.
* సెక్షన్ 46 ఎంతో ముఖ్యం. ఆదాయం పంపిణీపై ఉంది. జనాభా ప్రాతిపదికన 58 శాతం ఎపికి, 42 శాతం తెలంగాణకూ కేటాయించాం.
* ఎపిలో వెనుకబడిన జిల్లాలను ఆదుకునేందుకు నిధులు అందించాము.
* సెక్షన్ 90లో తెలిపిన విధంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇస్తున్నాం.
* ఒకసారి పార్లమెంటులో చట్టం ఆమోదం పొందిన తరువాత మరేమీ చేయలేము.
* సెక్షన్ 93లోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పలు జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశాం.
* ప్రధాని ఎంతో చొరవ తీసుకుని ఎపి పారిశ్రామికాభివృద్ధికి ఎంతో చేశారు.
* ఐఐటిని ఇప్పటికే ప్రారంభించాం. ఎన్ఐటి కూడా పని చేస్తోంది. ఐఐఎంలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది.
* రాష్ట్రం ఏర్పడి కేవలం రెండేళ్లే అయింది. ఎన్నో సంస్థల ఏర్పాటు దిశగా, ఎపి సర్కారును స్థలం అడిగాము.
* జాతీయ వర్శిటీ ఏర్పాటుకు స్థలాన్ని చూశాం.
* పట్టణాభివృద్ధి దిశగా విశాఖకు మెట్రోను ప్రకటించాం. దానికి ప్రాథమిక అనుమతులు వచ్చాయి.
* సున్నితమైన రైల్వే జోన్ విషయంలో అదే రాష్ట్రం నుంచి ఎంపికైన సురేష్ ప్రభు చర్చిస్తున్నారు.
* జాతీయ హైవేలను నితిన్ గడ్కరీ ఇప్పటికే ప్రకటించారు.
* కృషి సంచాయ్ యోజన కింద 8 ప్రాజెక్టులు చేపట్టాము.
* నీటిపారుదల రాష్ట్రాల బాధ్యతే అయినా, ఎపి విషయంలో కల్పించుకుని నిధులు ఇచ్చాం.
* రాజధానిని నిర్మించాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. దశల వారీగా నిధులు ఇచ్చేందుకు సిద్ధం.
* మా హామీలను నెరవేర్చుకోవడానికి కూడా నిధులు ఉండాలి కదా?
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.