ఏపీకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు
వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతేకాదు ఏపీకి ఇంకా స్వాతంత్ర్యం రాలేదని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాబుపై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రం లేని పరిస్థితి కన్పిస్తోందని ఆక్షేపించారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ్టికి కూడా మన దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలో స్వాతంత్ర్యం లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దళితులపై దాడి అమానుషమన్నారు. చనిపోయిన ఆవు చర్మాన్ని తీసుకుంటున్న వారిపై దాడి చేసి, నడిరోడ్డుపై కట్టేసి చెప్పులతో కొట్టిన పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఈ ఘటన చూస్తుంటే మనకు నిజంగా స్వాతంత్ర్యం వచ్చిందా అనే అనుమానం కలుగుతుందన్నారు.
వ్యక్తులను మతం, కులం ఆధారంగా గుర్తించే పరిస్థితులు మారాలన్నారు. ఎన్నికల హామీలపై పాలకులను ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నామని వైఎస్ జగన్ అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఓ పార్టీ తరఫున గెలిచి ఆ తర్వాత మరో పార్టీలో చేరటం చూస్తున్నామన్నారు. రాజ్యాంగాన్ని మనకళ్ల ముందే వెటకారం చేస్తున్నారన్నారు. ఇక నల్లధనంతో ఎమ్మెల్యేను కొంటూ దొరికిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదంటే ఈ వ్యవస్థ ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలన్నారు. వ్యవస్థల్లో మార్పులు రావాలంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలలని పిలుపునిచ్చారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.