`బాహుబలి 2`కు 3 జాతీయ అవార్డులు
* ఉత్తమ తెలుగు చిత్రంగా `ఘాజీ`
* జాతీయ ఉత్తమ నటిగా శ్రీదేవి
డెక్కన్ అబ్రాడ్: 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన జ్యూరీ పలు విభాగాల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా `బాహుబలి 2`కి మూడు అవార్డులు దక్కాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ విభాగాల్లో `బాహుబలి 2` జాతీయ అవార్డులను దక్కించుకుంది. `బాహుబలి 2`కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా ఆర్.సి.కమలకన్నన్ పనిచేశారు. ఆయన సారథ్యంలోని పలు స్వదేశీ, విదేశీ బృందాలు `బాహుబలి 2`కు వీఎఫ్ఎక్స్ అందించాయి. ఇక ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్‌గా పీటర్ హెయిన్ పనిచేశారు. దాదాపు రాజమౌళి అన్ని సినిమాలకు ఈయనే స్టంట్ మాస్టర్ కావడం విశేషం.
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన `ఘాజీ` సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా `న్యూటన్` నిలిచిన ఈ అవార్డుల జాబితాను అవార్డుల కమిటీ అధ్యక్షుడు శేఖర్ కపూర్ ప్రకటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యింది అస్సామీ సినిమా `విలేజ్ రాక్ స్టార్స్`. జాతీయ ఉత్తమనటిగా నిలిచింది దివంగత నటి శ్రీదేవి. `మామ్` సినిమాకు గానూ శ్రీదేవి అవార్డును పొందారు.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్(ఫిమేల్)గా నిలిచింది దివ్యాదత్తా. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు నాగరాజ్ మంజులేకు దక్కింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచాడు ఏఆర్ రెహమాన్. మణిరత్నం సినిమా `కాట్రు వెలియిడై`కు గానూ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు పొందాడు. అలాగే `మామ్` బీజీఎంకు కూడా రెహమాన్ కు అవార్డు ప్రకటించారు.
65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఈ ఏడాది మే 3న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందజేస్తారు. కాగా, నేషనల్ అవార్డ్స్ జ్యూరీలో దక్షిణాది నుంచి ప్రముఖ నటి గౌతమి సభ్యురాలిగా ఉన్నారు. ఆమెతో స్క్రీన్ రైటర్ ఇంతియాజ్ హుస్సేన్, గేయ రచయిత మెహబూబ్, అనిరుద్ధ రాయ్ చౌదరి, కన్నడ దర్శకుడు పి.శేషాద్రి, రంజిత్ దాస్, రాజేష్ మపుస్కార్, రుమీ జఫ్రే, త్రిపురారి శర్మ జ్యూరీ ప్యానెల్లో సభ్యులుగా ఉన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.