భీష్మ ఏకాదశి ,శ్రీ విష్ణు సహస్రనామముల ప్రత్యేకత
(ఈ వ్యాసాన్ని చూసి రాజు గారు ఎంత సంతోషించేవారో !మిత్రుడు స్వర్గీయ KVPS రాజు గారి దివ్య స్మృతికి అంకితం!)
మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్ముడు దేహయాత్ర ముగించి స్వర్గలోకానికేగిన రోజు. ఆ తరువాత వచ్చే ఏకాదశినే మనం భీష్మ ఏకాదశి అంటాం.అంతకు ముందు కొద్ది రోజుల క్రితమే గీతోపదేశం జరిగింది.. భీష్మ ఏకాదశి మనకు చాలా పవిత్రమైన దినం,కారణం, భీష్ముడు మరణించిన తరువాత వచ్చే తొలి ఏకాదశి ఇదే కావటం వల్ల.భీష్మాచార్యులవారు,మహాభారత యుద్ధ సమయంలో అంపశయ్య మీదనుండే పవిత్ర గంగాజలం ఆహారంగా తీసుకుంటూ శ్రీ విష్ణు సహస్రనామమును పారాయణం చేస్తూ,పాండవులకు జ్ఞానబోధ కూడా చేశాడు.భీష్మ ఏకాదశి నాడు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ చేయటం ఎంతో పుణ్యంగా ఆస్తిక మహాశయులు భావిస్తారు. అంతకు మునుపే శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా గీతోపదేశం పొందిన అర్జునుడు తనకున్న చాలా సందేహాలు శ్రీ కృష్ణుని అడిగి వివరణ పొందాడు.అయినప్పటికీ,అర్జునిడికి ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి.అయితే భారత యుద్ధమంతా తన దివ్య దృష్టితో వీక్షించటమే కాకుండా ధృతరాష్ట్రునికి కూడా చూపించిన సంజయుడు ధన్యజీవి.ఎందువలన అంటే,భగవంతుడు ప్రవచించిన గీతోపదేశాన్ని అర్జునిడితో పాటుగా ఆయనకూ వినే అదృష్టం కలిగింది.సంజయుని వల్లనే గీతోపదేశం బహిర్గతం అయ్యింది. భీష్మ ఏకాదశి రోజున చాలామంది ఉపవాస దీక్షతో పాటుగా శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం కూడా చేస్తారు.అలా వుండటం వల్ల మనలో సాత్వికత వృద్ధిలోకి రావటానికి అవకాశమున్నట్లుగా కొంతమంది నమ్మకం.ఆ పర్వదినాన కొందరు గురుముఖంగా ‘ఉపదేశం’ పొందే అలవాటు కూడా ఉంది.ఎందుకంటే,ఆ రోజును ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్ధికి అనువైన రోజుగా అందరూ పరిగిణస్తారు.మహాభారత సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి రధసారధిగా పనిచేసి విజయం సాధించి పెట్టిన విషయం మనకు తెలిసినదే!ఒక రోజు యుద్ధం ముగిసిన అనంతరం,ఎవరి స్థావరాలకు వారు వెళ్ళే సమయమది.అలాంటి ఒక రోజున అర్జునుడు శ్రీకృష్ణుని రధం దిగి ద్వారములు తెరవవలసినదిగా చెబుతాడు.శ్రీ కృష్ణునికి అర్జుని ప్రవర్తన రుచించలేదు.గీతోపదేశం చేసిన గురువుకి శిష్యుడు ఇవ్వవలసిన మర్యాద అర్జునుడు పాటించలేదని శ్రీకృష్ణుని అభిప్రాయం.శ్రీ కృష్ణుడు అప్పటి వరకు అర్జునుడికి బోధించినందంతా వృధాఅని భావించి ,మరో గురువు ద్వారా అతనికి,మిగిలిన పాండవులకు ఉపదేశం ఇప్పించాలని అనుకున్నాడు.భగవద్గీత నాల్గవ అధ్య్యాయంలోని 34 వ శ్లోకం ఇలా చెబుతుంది–“జ్ఞాన మార్గం చాలా కష్టం.జ్ఞాన మార్గం ద్వారా అంతర్యామిని చేరుకోవటం అన్నిటికంటే కష్టం.”ఎంత చెప్పినా ,ఎన్ని సార్లు చెప్పినా జ్ఞాన మార్గం బోధపడని అర్జునుడుకి మరియు ఇతర పాండవులకు మరో ఆచార్యుని ద్వారా ధర్మ బోధ చేయించాలని శ్రీ కృష్ణ పరమాత్మ తలచాడు .గీతలో పైన ఉదహరించిన శ్లోకం,ఒక విద్యార్ధి గురువు వద్ద ఎలా ప్రవర్తించి జ్ఞానాన్ని పొందవలెనో చెబుతుంది.అహంభావాన్ని వీడి గురువుకి సర్వసమర్పణ చేసుకొని వినయ విధేయలతో జ్ఞానాన్నిగురువు ద్వారా పొందాలని గీతాచార్యుల ఉపదేశసారం.గురువు చెప్పేది శిష్యుడు శ్రద్ధగా విని తగిన సమయంలోనే తన సందేహాలను అడిగి తీర్చుకోవాలి.కొన్ని సమాధానాలకు గురువులు వెంటనే సమాధానం చెప్పరు. ఒక్కొక్క సారి సమాధానం వెంటనే చెప్పవచ్చు లేక కొన్ని నెలలు ,సంవత్సరాలు కూడా తీసుకొన వచ్చును.అంతవరకూ శిష్యుడు శ్రద్ధగా ఓర్పుగా వేచివుండవలసిందే!శిష్యుని అర్హత చూసి తగిన సమయంలో గురువు సందేహాలు తీరుస్తాడు.పాండవులకు ధర్మబోధ చేయటానికి తగిన గురువుగా భీష్ముని శ్రీ కృష్ణుడు గుర్తిస్తాడు.భీష్ముడు అంపశయ్య మీద ఉండి భౌతిక దేహాన్ని ఉత్తరాయణ పుణ్య కాలంలో వదిలి వేయటానికి తగిన సమయం కోసం చూస్తున్న తరుణమది.శ్రీ కృష్ణుడు స్వయంగా పాండవులను భీష్మాచార్యుల వద్దకు తీసుకొని వెళ్లి వారికి ధర్మబోధ చేయ వలసినదిగా భీష్ముని కోరుతాడు. అవసానదశలోనున్న భీష్మునికి తన మహిమ ద్వారా ధారణ మరియు జ్ఞాపకశక్తిని శ్రీ కృష్ణుడు ప్రసాదిస్తాడు.గీతాచార్యుడైన శ్రీకృష్ణుడే స్వయంగా నిర్దేశించిన గురువు భీష్ముడు.శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం ఒక విధంగా చెప్పాలంటే వేదాలు మరియు గీతాసారమే!జీవితమంతా ధర్మబద్ధంగా జీవించి చెప్పినదే చేసిన యోధుడైన భీష్ముని ధర్మనిరతికి మృత్యువు కూడా అతని సమ్మతి లేకుండా అతనిని చేరటానికి సాహసించలేదు.ధర్మం అంత గొప్పది.వివిధ రకముల పుష్పాలనుంచి తేనెటీగ మధువుని సేకరించినట్లు,భీష్ముడు కూడా ఎందరో ఋషులు చెప్పిన శ్లోకాలను ఏర్చి కూర్చి చెప్పినదే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ సమక్షంలో భీష్ముడు పాండవులకు తెలియ చేయటం కోసం చేసిన స్తుతి శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం.. విశ్వమంతావ్యాపించిన విష్ణువు మరెవరో కాదు శ్రీకృష్ణుడే అని పాండవులకు ఉపదేశించి తరించిన మహానుభావుడు భీష్ముడు.
అదే భీష్మ ఏకాదశి మరియు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం యొక్క ప్రత్యేకత!!!
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.