బీజేపీ `ఆపరేషన్ ఆకర్ష్`
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా పోటీ చేసే స్థాయికి ఎదగాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగానేపార్టీని బలోపేతం చేసుకునే కార్యక్రమం చేస్తోంది. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపెట్టేందుకు వ్యూహాలుపన్నుతోంది. ఇప్పటి నుంచే అభ్యర్థుల కోసంవేట మొదలు పెట్టింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆరుగురు సభ్యులతో `ఆపరేషన్ ఆకర్ష్`కు తెరలేపింది. ఎలాగైనా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తులు ఉండకూడదు అన్న ఉద్దేశ్యంతోనే ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. సమయం దొరికినప్పుడల్లా టీడీపీని ఇరుకునపెడుతూనే తాము రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు బీజేపీ ఆరోపణలు వాస్తవాలే అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది. దీంతో సోము వీర్రాజు, పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి తదితరనాయకులు బాబు విధానాలపై ఒంటికాలిపై లేస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలంటే పార్టీలో ఇపుడున్న నేతల బలం ఏమాత్రం సరిపోదు. 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేసే సామర్థ్యం ఉన్న గట్టి అభ్యర్ధుల జాబితాను ఇమ్మంటే పార్టీ నాయకత్వం దిక్కులు చూడాల్సిందే. అందుకనే ఆపరేషన్ ఆకర్ష్ -2016 పేరుతో పార్టీ నాయకత్వం ఆరుగురు నేతలతో కమిటి వేసింది.
ఎంఎల్‌సి సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, రాంభూపాల్‌రెడ్డి, పార్ధసారధి, శాంతారెడ్డిలు కమిటిలో సభ్యులు. ఈ కమిటి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు జరుపుతుంది. ఇతర పార్టీల్లోని నేతలెవరైనా తమ పార్టీలోకి వచ్చేది లేనిది ఆరాలు తీస్తుంది. వివిధ కారణాలతో పార్టీ మారాలనుకుంటున్న నేతలకు గాలం వేయటం కమిటి లక్ష్యం. ఈ విధంగా వచ్చిన వారిని వచ్చినట్లు బీజేపీలో చేర్చుకుని బలోపేతం చేయాల్సిందిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవలే ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆకర్ష్ కమిటిని నియమించారు. ఇపుడు పార్టీలో ఉన్న వారికి, రెండేళ్ల క్రితం పార్టీలో చేరిన వారికే దిక్కులేకపోతే కొత్తగా ఎవరు చేరుతారన్న విషయమై కూడా మొన్నటి సమావేశంలోనే చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.