ఆ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణను చేపట్టలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ఊహాగానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెరదించారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల తర్వాతే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తన మంత్రులతో చెప్పినట్లు సమాచారం. నవంబర్లో పురపాలక ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో డిసెంబర్లో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు 2014లోనే జరిగిపోయాయి. కోర్టు కేసుల కారణంతో కొన్ని మిగిలిపోయాయి. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కాకినాడ, కర్నూలు కార్పొరేషన్లు రాష్ట్రంలోనే పెద్ద కార్పొరేషన్లుగా ఉన్నాయి. మరో ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కోర్టులో కేసుల కారణంగా వీటికి ఎప్పుడు ఎన్నికలు జరిగేదీ స్పష్టత రాలేదు. కానీ నవంబర్లో జరగవచ్చని అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పెద్ద ఎన్నికలు ఇవే అవుతాయి. వీటిని పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ ఎన్నికల తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఈ ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ నాయకత్వ పనితీరును మదింపు చేయాలన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులుగా ఉన్నవారు, మంత్రి పదవులు ఆశిస్తున్నవారి పనితీరు, వారికి రాజకీయంగా ఉన్న పట్టును బేరీజు వేయడానికి ఈ ఎన్నికలు మంచి అవకాశమని, వారి పనితీరు ఆధారంగా మంత్రివర్గంలో మార్పుచేర్పులు చేపట్టాలని సీఎం భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల కథనం. వారితోపాటు ఇతర జిల్లాల మంత్రులు, సీనియర్లకూ ఈ ఎన్నికల బాధ్యతలు అప్పగించి వారి శక్తి సామర్థ్యాలను కూడా అంచనా వేయాలని సీఎం భావిస్తున్నారట. ఇన్చార్జుల నియామక కసరత్తు ఇంకా మొదలు కాలేదు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత వచ్చాకే ఈ నియామకాలు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.