ఒకేసారి రెండు హిట్స్ కోసం చైతూ స్కెచ్..?
గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో నాగచైతన్య హీరోగా నటించిన మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’. అయితే.. ‘ఏ మాయ చేశావే’ సినిమా రిజల్ట్ తో పాటు నయా మూవీ ప్రచార చిత్రాలు తాజా సినిమాపై ఫుల్ క్రేజ్ ను పెంచుతున్నాయి. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ విడుదలలో మాత్రం ఆలస్యమవుతోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ ను తెరకెక్కించాల్సి ఉందని సమాచారం. ఇది కూడా పూర్తి చేసి ఏప్రిల్‌లో ఆడియోను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అలాగే మే నెలలో మూవీని రిలీజ్ చేయడానికి ముమ్మర కసరత్తు జరుగుతోందట. మలయాళ భామ మంజిమ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి రచయిత కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ప్రేమమ్’ మూవీ షూటింగ్లో చైతన్య బిజీ బిజీగా ఉన్నాడు. మలయాళ సినిమా రీమేక్‌గా రానున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ లెక్కన నాగచైతన్య నటించిన రెండు సినిమాలు ఒకేసమయంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.‘దోచెయ్’ పరాజయానికి బదులుగా ఒకేసారి రెండు బంపర్ హిట్స్ కోసం చైతన్య ఇలా స్కెచ్ వేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే.. చైతూ నిజంగా.. సాహసం శ్వాసగా సాగిపోతున్నట్లే లెక్క.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.