చక్రం తిప్పుతున్న చినబాబు లోకేష్
వలసలు ఇంకా ఉంటాయంటున్న టీడీపీ శ్రేణులు
వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుంచి వలసలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు. వైసీపీలో ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు.. ఎవరు టీడీపీ వైపు వచ్చే వాళ్లు ఉన్నారో తెలుసుకుంటూ వాళ్లతో స్వయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడి పార్టీలో ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చాంద్ బాషా టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. అందులో భాగంగానే 50 వాహనాల్లో కార్యకర్తలు, నేతలతో కలిసి విజయవాడకు వెళ్లారు. ఈ రోజు(శనివారం) చంద్రబాబు సమక్షంలో పార్టీలో తీర్థం పుచ్చుకోనున్నాడు. అయితే ఈ సమాచారం అందుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు చాంద్‌బాషాను బుజ్జగించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు.
కాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే 12మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరగా.. చాంద్ బాషా చేరికతో ఆ సంఖ్య 13కు చేరనుంది. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ ఈ వ్యవహారాలను చూసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను లాగడంలో తెలుగుదేశం పార్టీ సక్కెస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వీళ్లందరికీ కూడా ఏదోక విధంగా పార్టీలో న్యాయం చేస్తామని చిన్నబాబు లోకేష్ హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వైయస్ఆర్ కాంగ్రెస్ మేలుకోకపోతే మాత్రం మునుముందు భారీ నష్టమే జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.