బాబుకు కేంద్రం బంపర్ ఆఫర్?
ప్రత్యేక హోదా విషయంలో కానీ.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కానీ కేంద్రం సరిగా స్పందించడం లేదని, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య పొరపొచ్చలు వచ్చాయని, దూరం పెరుగుతూ వచ్చిందని ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. అయితే సురేష్ ప్రభుకు ఏపీ నుంచి టీడీపీ అవకాశం కల్పించడంతో బీజేపీ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఏమైందో ఏమో కానీ.. కేంద్రం చంద్రబాబు నాయుడకు బంపర్ ఆఫర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 22న కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ నుంచి ఇప్పటికే అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి కేంద్ర కేబినెట్లో కొనసాగుతుండగా.. తాజా విస్తరణలో మరొకరికి మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. 16 మంది ఎంపీలున్న టీడీపీకి ఇంకో మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రధానికి సూచించినట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో బీజేపీ నేతలు ఒకట్రెండు రోజుల్లో చర్చలు జరుపవచ్చని, మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు వీలుగా ఇద్దరు ఎంపీల పేర్లను సూచించాల్సిందిగా కోరతారని ఆ పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు, శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరిల శాఖలు మారే అవకాశాలున్నాయని కొందరు అంటున్నారు. పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి వెంకయ్యనాయుడిని గ్రామీణాభివృద్ధి లేదా వ్యవసాయ శాఖకు మార్చితే.. అశోక్‌కు పట్టణాభివృద్ధి శాఖ అప్పగించాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.
బ్యాంకు బకాయిల కేసులో కోర్టుల చుట్టూ తిరుగుతున్న సుజనాపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ను తప్పించే అవకాశం ఉందని కొందరు… ఆ అవకాశమే లేదని మరికొందరు టీడీపీ ఎంపీలు అంటున్నారు. విస్తరణలో మరో మంత్రి పదవి ఎవరికి దక్కే అవకాశాలున్నాయో టీడీపీ ఎంపీలు లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడున్న ఇద్దరు మంత్రులూ కోస్తాకు చెందినవారు కావడంతో ఈసారి రాయలసీమకు చాన్స్ దక్కుతుందని కొందరి అంచనా. సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి వంటి వారి పేర్లు బలంగా వినిపిస్తున్నా.. ఆ ప్రాంతం నుంచి బీసీలకు అవకాశం ఇస్తారని, ఆ కోణంలో హిందూపురం ఎంపీ, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్పకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ టీడీపీ నేతల్లో కూడా ఆశలు పెరుగుతున్నాయి. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి ఇది ఎంతో ఊరట కలిగించే అంశమని, కేంద్రం టీడీపీపై సానుకూలంగా ఉందనే విషయమే ఆ పార్టీకి బాగా కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.