మోడీపై బాబు అసంతృప్తి
ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నా తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై బాబు ఫైర్ అవుతున్నారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సింది పోయి ఎలాంటి ఆర్థిక సహాయం చేయడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అన్యాయం చేస్తోందో గణాంకాలతో సహా చంద్రబాబు వివరిస్తున్నారు. రాష్ట్రం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని.. దాన్ని భర్తీ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం.. రూ. 4800 కోట్లు మాత్రమే ఇచ్చిందని చంద్రబాబు అంటున్నారు. సెంట్రల్ యూనివర్శిటీ.. గిరిజన యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్న హామీలు నిలబెట్టుకోలేదని.. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లే ఇచ్చారని బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. వెనకబడిన ప్రాంతాలకు రావలసిన నిధులూ ఇవ్వడం లేదని.. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు.. రాజధాని నిర్మాణానికి నిధులూ ఇవ్వడం లేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దంటూ పార్టీ నేతలకు చెబుతూ వచ్చిన చంద్రబాబే.. ఇప్పుడు స్వయంగా మోడీకి వ్యతిరేకంగా గళం విప్పుతుండడంతో తెలుగు తమ్ముళ్లు కూడా బీజేపీని విమర్శించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో పాలు నీళ్లు లాగా కలిసి ఉన్న బీజేపీ, టీడీపీ నేతలు ఇకపై అలా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ.. టీడీపీ మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.