బాబుకు ఏం తెలుసు ఐటీ గురించి?
ప్రపంచానికి ఐటీని పరిచయం చేసింది తానేనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఆయనకు ఐటీ గురించి ఏం తెలుసో చెప్పాలని వైయస్ఆర్సీపీ పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సవాల్ విసిరారు.
బాబుకు ఐటీ అంటే ఇన్‌కం ట్యాక్స్ అని మాత్రమే తెలుసు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి బాబు వల్ల ఒక్కడితేనే కాదని, అందుకు చాలా మంది కృషి చేశారన్నారు. అంతేకాదు బుగ్గన గత చరిత్ర చెబుతూ ‘చంద్రబాబు సీఎం గా ఉన్న సమయంలోనే కర్నాటక ముఖ్యమంత్రిగా నిజాయితీపరుడైన జేహెచ్ పటేల్ ఉండేవారు. ఆయన దగ్గరకు వెళ్లిన కొందరు చంద్రబాబు మనల్ని ఓవర్ టేక్ చేస్తూ వెళుతున్నారని తరచూ చెప్పేవాళ్లట. ఆయన అదంతా వినీ వినీ విసుగు చెంది.. ఈ రోజు చంద్రబాబును చూసి గానీ, నన్ను చూసి గానీ ఎవరూ ఇక్కడ ఐటీ సంస్థలు స్థాపించడం లేదు. వాళ్లకు కావల్సిన మానవ వనరులు ఇక్కడ ఉన్నాయి. అంతే కాకుండా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి సంస్థలు స్థాపించి ఉన్నాయి. ఐటీ అభివృద్ది చెందడానికి కావల్సిన మంచి వాతావరణం ఉంది కాబట్టే సంస్థలు వచ్చాయి. మమ్మల్ని చూసి మాత్రం సంస్థలు రాలేదు, మేమిద్దరం కూడా చూడటానికి అంత బాగుండం` అని కూడా వాళ్లతో చెప్పారట.
ఇదిలా ఉంటే తాను చెప్పడం వల్లే సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవో అయ్యారని బాబు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. 1992లో సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్‌లో జాయిన్ అయ్యారని, చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటప్పుడు సత్యనాదెళ్లకు బాబు ఎలా చెప్పి ఉంటారన్నారు. అప్పటికీ ఇప్పటికీ చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకునే వాళ్లు ఎవరూ లేరన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం మానుకోవాలని సూచించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.