బాబు రెండేళ్లలో సాధించింది శూన్యం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రెండేళ్లు పూర్తి అయినా ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన బాబు ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారో చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు హామీలు ఇచ్చి అవి చేయకుండా ప్రజలను మోసం చేశారని, బాబుపై 420 కేసులు పెట్టాలని వైసీపీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారు. బాబు రెండేళ్లలో సాధించింది శూన్యమని, ఆయన మాత్రం ఈ రెండేళ్లలో రెండు లక్షల కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. కాగా చంద్రబాబు పాలనపై వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యానారాయణ కూడా స్పందించారు. చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాటు సాగించిన పాలనలో ఏ ఒక్క వర్గానికీ సంతృప్తి కలగలేదని ఆయన విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రజలు దయచేసి ఆలోచించాలని కోరుతున్నామన్నారు. మేధావులు కూడా దీనిపై ఆలోచించాలన్నారు. ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తమకు ఏమైనా అయితే ప్రభుత్వం అండగా ఉంటుందని సామాన్యులు ఆశిస్తారని.. అలాగే మేధావులైతే పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందుతుందని, సమస్యలు పరిష్కారం అవుతాయని, రాష్ట్రం పారిశ్రామికంగా ముందడుగు వేస్తుందని అనుకుంటారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రెండేళ్లు ఏ ప్రాంతానికీ, ఏ వర్గానికి ఎటువంటి సంతృప్తి ఇవ్వకుండా అందరిలోనూ దయనీయమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలించే సీఎం ప్రజలకు ఒక భరోసా ఇవ్వగలగాలని, కానీ రెండేళ్లలో ఎవరికీ సంతృప్తి ఇవ్వకుండా పాలన సాగిందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అంతేకాదు బాబు చెప్పిన హామీలను బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని అన్నారని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారని, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని. ప్రత్యేక హోదా కానీ.. పోలవరం ప్రాజెక్టు కానీ పనులు చేపట్టారా అని బొత్స చంద్రబాబును ప్రశ్నించారు. ఇవీ చేయకుండా సంబరాలు చేసుకుంటే ఏం లాభమని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని మరిచి స్వలాభం కోసం బాబు పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగే చేసుకుంటూ పోతే ప్రజలు ఏదొక రోజు తిరగబడతారని హెచ్చరించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.