
దేశంలో అతి కీలకమైన రక్షణ రంగంతోపాటు మరికొన్ని రంగాలకు సంబంధించిన అత్యంత వివాదస్పద నిర్ణయాన్ని గుట్టు చప్పుడు కాకుండా మోడీ ప్రభత్వం ప్రకటించింది. రక్షణ, విమానయాన రంగాల్లో 100 శాతం, ఫార్మా రంగంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం తెలుపుతున్నట్లు భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఈ మూడు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి 49 శాతంగా ఉండేది. దీనిని ఒకేసారి 51 శాతం పెంచారు.
ఈ నిర్ణయంతో విదేశీ ఆయుధ కంపెనీలు భారత్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. ఆయా కంపెనీలు ఇక్కడ చిన్నతరహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి తయారుచేసుకునే వీలుంటుంది. విమానయాన, ఫార్మా రంగాల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. రక్షణ రంగంలో ఎఫ్ డీఐల పెంపు కోసం ప్రభుత్వం ఆయుధ చట్టం-1959కి సవరణలు చేసింది. రక్షణ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తే దేశ భద్రతకు,సమగ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు! అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కీలకమైన రక్షణ రంగంలో నూరు శాతం ఎఫ్ డీఐలకు అనుమతి సరికాదని ఆందోళనలు చేసింది. ఇప్పుడు అదే మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణలకు పచ్చ జండా ఊపింది.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నీతి ,అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక నీతి!ఇటువంటి ద్వంద్వ నీతులను మున్ముందు మరెన్ని చూడాలో మనం ! స్వదేశీ కంపెనీల్లో విదేశీయులు 49 శాతాన్ని మించి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. డబ్బుంటే 100 శాతం పెట్టుకోవచ్చు. అంటే ఆ కంపెనీల మీద Ownership కూడా పొందొచ్చు!ఇక్కడి ఉత్పత్తులను మనం పెంచితే వాటిని వారు తమ దేశాలకు తీసుకొనిపోవచ్చు! ఇదే దాని ఉద్దేశం అని నా అభిప్రాయం! మనం విమాన ప్రయాణం చేస్తే అది విదేశీయులకు లాభంగా మారుతుంది. డబ్బులు వదిలేది మనకు లాభాలు పొందేది విదేశీ సంస్థలు!అయితే వారు అభివృద్ధి పరిచిన టెక్నాలజీ మాత్రమే మనకు వస్తుంది. అయితే ఇలా విదేశీ పెట్టుబడుల వల్ల విమానాల సంఖ్య పెరిగి పోటీ వాతావరణం ఏర్పడి టిక్కెట్టు రేట్లు తగ్గచ్చునేమో! అది కొంత మంచిదే కానీ మన డబ్బులు మాత్రం విదేశీ సంస్థల జేబుల్లోకి వెళ్లిపోతాయి .పర్యవసానంగా దేశీయ విమాన సంస్థలు విదేశీ సంస్థలతో పోటీలో తట్టుకోలేక నష్టాల్లో కూరుకుపోయి మూతబడుతాయి!ఇవన్నీ తెలిసి,ఊహించి కూడా ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది!ఇక విదేశీయులు స్వేచ్ఛగా మన దేశంలో ఆస్తులను కూడకట్టుకోవచ్చు!అంతే కాదు నష్టపోయిన మన కంపెనీలను మళ్లీ వారే అతి తక్కువ ధరలకు కొని తిరిగి వాటిని లాభాల్లోకి తెచ్చుకుంటారు!ఈ దేశంలో వారికి సుస్థిరత వస్తుంది!ఎన్నో ఏళ్ల విదేశీ పాలనలో మ్రగ్గి మహాత్మా గాంధీ నేతృత్వంలో మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యానికి అర్ధం లేకుండా పోతుంది. పరోక్షంగా మళ్లీ మనం విదేశీయుల పాలనలోకి వెళ్లుతున్నాం!కొంతకాలం తర్వాత అది ప్రత్యక్ష పాలన కావచ్చు!ఈ దేశాన్ని పరిపాలించిన వారందరూ మొదట్లో ఇక్కడికి వచ్చింది వ్యాపారాల నిమిత్తమే!ఇది చరిత్ర.దీన్ని ఎవరూ కాదనలేరు!అయితే ప్రభుత్వరంగ సంస్థల్లో విదేశీ కంపెనీల పెట్టుబడులపై పూర్తిగా తలుపులు తెరవకపోవటం కొద్దిగా నయం!
ప్రజల రియాక్షన్ చూసి నిదానంగా ప్రభుత్వరంగ సంస్థల్లో కూడా నెమ్మదిగా విదేశీ కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహిస్తారేమో!తమకున్న కొన్ని వేల కోట్ల డాలర్ల నిల్వలతో విదేశాలను కొల్లగొట్టటానికి అమెరికన్ కంపెనీలు ఎప్పుడూ ముందుంటాయి .మోడీ ఇన్నిసార్లు అమెరికాకు పోయింది ఇందుకేనన్నమాట!ఎఫ్డీఐల పర్యవసానాలు ఇంకా చాలా ఉన్నాయి,మున్ముందు ఇంకా తెలుస్తాయి!ఆనాడు భాజాపా చేసిన ఆందోళనలోని ఫోటోను జతచేసాను, మీరూ చూడండి!ఆ ఫోటో లో ఒక కార్యకర్త పట్టుకున్న బానర్ లో ‘Demolish FDI,Save India!’ అని ఉంది.ఇప్పుడు మనం ఆ బానర్ లోని అక్షరాలను ‘Save FDI,Demolish India!’లామార్చి చదువుకోవాలేమో!2012 లో మోడీ కాంగ్రెస్ ను నిందిస్తూ ఆ పార్టీ దేశాన్ని విదేశాలకు దొడ్డి దోవన అమ్మాలని చూస్తుందని ట్వీట్ చేసాడు!అదే మోడీ నేడు ఇదే దేశాన్ని నేరుగా ,రాజమార్గం ద్వారా విదేశాలకు అమ్మాలనుకుంటున్నాడు !అంటే దొంగలు పోయి బందిపోట్లు వచ్చారన్నమాట!ఏది ఏమన్నా’దేశభక్తి’ వారి సొత్తు కదా!
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.